వీడిన ఉత్కంఠ | Sakshi
Sakshi News home page

వీడిన ఉత్కంఠ

Published Wed, Apr 2 2014 2:55 AM

municipal election result on 9th of this month

సాక్షి, ఖమ్మం : మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ వీడింది. నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 2న కౌంటింగ్ నిర్వహించాల్సి ఉండగా, హైకోర్టు తీర్పుతో మరో వారం రోజులు వాయిదా పడింది. లెక్కింపుపై కోర్టు తీర్పు కీలకం కావడంతో బుధవారమే ఉంటుందేమోననే ఆతృతతో జిల్లాలో ‘పుర’బరిలో నిలిచిన అభ్యర్థు లు, నేతలు మంగళవారం టీవీలకు అతుక్కుపోయా రు. ఈనెల 30న కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీలు, సత్తుపల్లి, మధిర నగర పంచాయతీలకు ఎన్నికలు ముగిశాయి.

ఈ ఎన్నికల ఫలితాలు 2న వెలువడుతాయని ఇటు అధికారులు, అటు అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దీనిపై హైకోర్టులో తీర్పు ఉన్న నేపథ్యంలో ఏమవుతుందోనని అభ్యర్థులు ఆందోళన చెందారు. చివరకు ఈనెల 9న  కౌంటింగ్ చేపట్టాలని కోర్టు తీర్పు ఇవ్వడంతో ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల ఫలితాలు వెలువడితే ఆ ప్రభావం స్థానికఎన్నికలపై పడుతుందని కొన్ని పార్టీలు భావిస్తే.. మరికొన్ని పార్టీలు మాత్రం ఈ ఫలితాలతో వచ్చే ఎన్నికల్లో దూసుకుపోవచ్చని అంచనాకు వచ్చాయి.  

 ఇదేం ట్విస్టు..?
 మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ 9న వెలువడితే రానున్న స్థానిక, సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపవా..? అని నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 9న  అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావడం, అదేరోజున ఫలితాలు వెలువడనుండడంతో ఆయా అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి ట్విస్టు పెట్టకుండా 2నే ఫలితాలు ప్రకటిస్తే బాగుండేదని పార్టీల నేతలు, పుర బరిలో నిలిచిన అభ్యర్థులు అంటున్నారు.  

 ఈవీఎంలలో అభ్యర్థుల జాతకం..
 కౌంటింగ్ ఎప్పుడన్నది అటుంచితే.. ఈవీఎంలలో దాగి ఉన్న అభ్యర్థుల జాతకంపైనే మున్సిపాలిటీల్లో జోరుగా చర్చ సాగుతోంది. అభ్యర్థులు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను పక్కన పెట్టుకొని ఎన్ని ఓట్లు తమకు పడ్డాయో లెక్కేసుకుంటున్నారు. తమ విజయం తథ్యమని ఎవరికి వారు భావిస్తున్నా.. ఈవీఎంలలో ఉన్న జాతకం అనుకూలంగా ఉంటుందో, లేదోననే హైరానా కూడా వారిని వెంటాడుతోంది. బారీగా ఖర్చు చేసి చివరకు ఓటమి పాలైతే తమ పరిస్థితి ఏంటని తమ అనుచర నేతల వద్ద మొర పెక్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థుల విజయంపై ఎవరికి వారు భారీగా పందేలు కాస్తున్నారు. కొత్తగూడెం, ఇల్లెందులో ఈ పందేలు ఎక్కువగా సాగుతున్నాయి. ఫలితాలకు మరో వారం రోజులు గడువు ఉండడంతో ఎన్నికలు జరిగిన నాలుగు చోట్ల ఇంకా పందేలు జోరందుకోనున్నాయి.

 పీఠంపై ఎవరిధీమా వారిదే..
 మున్సిపల్ చైర్మన్ పీఠంపైనే అన్ని పార్టీలు కన్నేశాయి. అంతటా 70 శాతం పైనే పోలింగ్ నమోదు కావడంతో ఎవరికివారు తమ పార్టీకే చైర్మన్ పీఠం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. సత్తుపల్లి, మధిర కొత్తగా నగర పంచాయతీలుగా ఏర్పడడంతో ఇక్కడ గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఎక్కువగా పోలింగ్ నమోదయింది. ఈ పరిస్థితితో అన్ని పార్టీలు చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకున్నాయి. అభ్యర్థులు కూడా అన్ని వార్డుల్లో నువ్వా..నేనా..? అన్నట్లుగా తలపడ్డారు.

 ఫలితాలు వెలువడకముందే చైర్మన్ అభ్యర్థి ఎవరన్న దానిపై అప్పుడే తెరచాటు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొన్ని పార్టీల్లో  చైర్మన్ అభ్యర్థి నువ్వే.. అని జిల్లా నేతలు చెప్పడంతో, ఆర్థికంగా లేని వార్డు సభ్యులకు సదరు అభ్యర్థులు ఖర్చు చేశారు. దీంతో ఇలా ఖర్చు చేసిన వారంతా తమదే చైర్మన్ పీఠం అన్న ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. ఎక్కువ పోలింగ్ నమోదు కావడంతో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమా..? అనుకూలమా..? అన్నది ఇటు సీనియర్ నేతలకు కూడా అంతుబట్టడం లేదు. భారీ పోలింగ్ నమోదు తమకే అనుకూలమని, చైర్మన్ పీఠం తమదేనని నేతలు అంచనాల్లో మునిగారు.

Advertisement
Advertisement