ఈ రోజులు మాకొద్దు.. రాదు.. పోదు.. కదలదు | Sakshi
Sakshi News home page

ఈ రోజులు మాకొద్దు.. రాదు.. పోదు.. కదలదు

Published Tue, Apr 8 2014 2:01 AM

No bus services to villages lack of Roads damaged

బస్సుల కోసం పడిగాపులు పడే జనం.. బస్సొస్తే పొలోమంటూ పరుగెత్తే విద్యార్థులు.. జీపులో  జనమున్నారో.. లేక జనం మధ్యలో జీపుందో తెలియనంతగా కిక్కిరిసే ప్రైవేటు వాహనాలు.. ఇటువంటి దృశ్యాలు పల్లెల్లో నిత్యకృత్యమయ్యాయి. ఎప్పుడొస్తుందో తెలియని బస్సు కోసం గంటల  కొద్దీ నిరీక్షించలేని పల్లెవాసులు ‘ప్రైవేటు’ బాట పడుతుండగా.. ‘లాభం’ లేదని ఆర్టీసీ ట్రిప్పులు తగ్గించాల్సి వస్తోంది. ఫలితంగా ప్రజలు అష్టకష్టాలపాలవుతున్నారు. ఆర్టీసీని నమ్ముకోలేక.. అలాగని ప్రయాణాలు వాయిదా వేసుకోలేక ప్రమాదం అంచునే ప్రయాణిస్తున్నారు.
 
 నరకానికి డైరెక్ట్ రూట్లుగా మారిన రోడ్లు.. రావడమే గొప్పన్నట్టు
ముక్కుతూ ములుగుతూ వచ్చే బస్సులు
చచ్చీచెడీ మధ్యలో మొరాయిస్తే.. బతుకు బస్టాండే!
బస్సుకోసం ఎదురుచూసీ.. చూసీ యాష్టకొచ్చి
జీపులో ఓ ఇరవై మంది.. టాపుపై మరో 15మంది
ప్రాణాలు గాల్లో దీపాలని తెలిసినా.. గమ్యం చేరాలంటే తప్పదుగా మరి!
స్కూలుకో, కాలేజీకో వెళ్లాలంటే చెమటోడ్చాల్సిందే
‘పల్లెవెలుగు’తో రూపురేఖలు మార్చేస్తాం అంటారు పాలకులు..
దండిగా పాసులిచ్చేస్తారు.. మరి బస్సులేవయ్యా అంటే
రోడ్డులేదంటారు.. రోడ్డుంటే ‘ఆక్యుపెన్సీ’ లేదంటారు.
ఆ రూట్లో ‘లాభం’ లేదంటూ ‘ప్రైవేటు’కు దన్నుగా నిలుస్తారు.
‘పల్లె వెలుగు’లు నింపడం లేదని.. ఆటోలు.. జీపుల సాకుతో
ఆ ఒక్కటీ ఊడబెరుకుతారు, కాదు.. కూడదంటే డొక్కుబస్సులేస్తారు
మరి ఏమైపోవాలి విద్యార్థులు?.. ఎక్కడికెళ్లాలి ఊరి జనం?
స్వతంత్ర భారతావనిలో ఇంకా రోడ్డులేని.. బస్సురాని ఊళ్లా?
చాలు.. ఈ రోజులు మాకొద్దు.. ఇక్కడితో ఫుల్‌స్టాప్ పెట్టేద్దాం.
- సాక్షి నెట్‌వర్క్.
 
 బుట్టలల్లకపోతే బువ్వ లేదు!

 వృత్తి పథం: మేదరులు: నాకు అరవయ్యేళ్లు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేస్తే కానీ బువ్వ దొరకదు. ఒకట్రెండ్రోజులు కాదు... పుట్టింటి నుంచి వచ్చిన 44 ఏళ్ల నుంచి ఇదే కష్టమే. నా  భర్త పరమేశు.. నేను ఇద్దరమే. పిల్లల్లేరు. నిద్ర లేచినప్పటి నుంచి నా మొగుడు పనిలోకి దిగితే, నేను ఇంటి పనులు, వంట చేస్తాను. తర్వాత నా మొగుడితో పాటే పని చేస్తా. సాయంత్రానికి నాలుగు పప్పు గంపలు అల్లుతా. ఆ నాలుగు కలిపి రూ.300కు అమ్ముతాం. ఇందులో సగం పెట్టుబడికి పోతే మిగిలిన డబ్బుతో ఇల్లు గడుస్తుంది. అప్పట్లో దబ్బల రేటు తక్కువగా ఉండేది. దీంతో డబ్బు మిగిలేది.
 
  సరుకు కర్నూలు జిల్లాలోని అహోబిలం నుంచి వస్తుంది. వెదురుబొంగు రూ.60 ప్రకారం కొంటాం. రూ.20 వేలకు పైగా పెడితే కానీ అక్కడి నుంచి సరుకు తెచ్చుకోలేం. సరుకు దొరకనప్పుడు కూలి పనులకు వెళ్తాం. ఎంత కష్టపడుతున్నా రూపాయి కూడా మిగలట్లేదు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు గొంతుక్కూర్చొని పని చేస్తుండటంతో ఒళ్లంతా నొప్పులు పుడుతున్నాయి. అయినా బతకడం కోసం చేయాల్సిందే కదా! మాకెలాంటి ప్రభుత్వ సాయమూ అందడం లేదు. ఇంతకుముందు మైదుకూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు సొసైటీలో ఉన్న సొమ్మంతా తినేశారు. కష్టాల్లో ఉన్న మా లాంటి వాళ్లను నాయకులు ఆదుకోవాలి. అలాంటి వారికే ఓటేస్తాం.
 - రాగం లక్ష్మమ్మ, ప్రొద్దుటూరు, వైఎస్సార్ జిల్లా

Advertisement
Advertisement