పాల్వాయి, రాజేశ్వర్‌లకు షోకాజ్ నోటీసులు | Sakshi
Sakshi News home page

పాల్వాయి, రాజేశ్వర్‌లకు షోకాజ్ నోటీసులు

Published Sat, Apr 26 2014 3:00 AM

పాల్వాయి, రాజేశ్వర్‌లకు షోకాజ్ నోటీసులు - Sakshi

 హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్‌లకు కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సహకరించకుండా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున నోటీసులు ఇస్తున్నట్లు అందులో పేర్కొంది. తక్షణమే వివరణ ఇవ్వడంతోపాటు అభ్యర్థులకు సహకరించాలని ఆదేశించింది. లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎం.కోదండరెడ్డి ఆధ్వర్యంలో టీపీసీసీ క్రమశిక్షణా సంఘం సభ్యులు శుక్రవారం గాంధీభవన్‌లో సమావేశమై వారికి నోటీసులు జారీ చేశారు. సాధారణంగా ఏ నాయకుడికైనా షోకాజు నోటీసు జారీ చేస్తే రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంటారు.

అయితే ఎన్నికల సమయంలో ఆ నిబంధనను పాటించాల్సిన అవసరం లేదు. షోకాజ్ నోటీసులతో సంబంధం లేకుండా పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించే అధికారం టీపీసీసీకి ఉంది. అయితే, పాల్వాయి సీనియర్ నేత, ఎంపీ కూడా. రాజేశ్వర్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈ క్రమంలో ఏఐసీసీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ సూచన మేరకు ఇరువురు నేతలకు షోకాజ్ నోటీసులు ఇవ్వడానికి మాత్రమే టీపీసీసీ క్రమశిక్షణా సంఘం పరిమిత మైంది. ‘మా నోటీసులకు వెంటనే వివరణ ఇస్తూ.. పార్టీ అభ్యర్థులకు సహకరిస్తే ఎలాంటి చర్యా ఉండదు. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే మాత్రం సస్పెండ్ చేసేందుకూ వెనుకాడం’ అని క్రమశిక్షణా సంఘం సభ్యుడొకరు వ్యాఖ్యానించారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement