సైనికుల ఓట్లకు పార్టీల గాలం | Sakshi
Sakshi News home page

సైనికుల ఓట్లకు పార్టీల గాలం

Published Thu, Mar 27 2014 1:29 PM

సైనికుల ఓట్లకు పార్టీల గాలం - Sakshi

తూటాలకు ఛాతీలు ఎదురొడ్డి పోరాడే సైనికులు ఇన్నాళ్లూ కనీసం ఓటు కూడా వేయలేకపోయారు. కానీ ఈ సారి ఎన్నికల్లో దేశవ్యాప్తంగా వివిధ కంటోన్మెంటులలో ఉన్న సైనికులు తొలిసారి ఓటు వేయబోతున్నారు. ప్రభుత్వం జనవరి 1, 2014 నుంచి వారు ఉన్న చోటునుంచే తమ రాష్ట్రాల్లో ఓటు వేసేందుకు వీలు కల్పించింది.


అందుకే ఈ సారి అన్ని రాజకీయ పార్టీలూ సైనికుల గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నాయి. వారి ఓట్లను సాధించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఉదాహరణకి పంజాబ్ లోని గురుదాస్ పూర్ ఎంపీ ప్రదీప్ సింగ్ బజ్వానే తీసుకుంటే ఆయన గత ఎన్నికల్లో 15000 వేల మంది సైనికులను ఓటర్లుగా నమోదు చేయించారు. ఆయనకు వారి నుంచి 13345 ఓట్లు పడ్డాయి. ఆయన తన ప్రత్యర్థిపై గెలుపొందింది కేవలం 8000 ఓట్ల తోనే. అంటే ఆయన సైనికులను ఓటర్లుగా నమోదు చేయించి ఉండకపోతే ఖచ్చితంగా ఓడిపోయి ఉండేవారు. అందుకే ఆయన గత అయిదేళ్లలో సైన్యబలగాల సమస్యల గురించి లోకసభలో 157 ప్రశ్నలు వేశారు.

హిమాచల్, ఉత్తరాఖండ్ లో సైనిక ఓట్లే ప్రధానం
ఇలాగే హిమాచల్ ప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో సైనికులు చాలా మంది పోస్టల్ బాలెట్ ఓట్లు వేయలేకపోయారు. వారికి బ్యాలెట్ పత్రాలు ఎన్నిలైపోయిన తరువాతే అందాయి. హిమాచల్ ప్రదేశ్ లో 1.50 లక్ష మంది మాజీ సైనికులు, మరో 1.50 లక్ష మంది ప్రస్తుత సైనికులు ఉన్నారు. ప్రస్తుత సైనికులు ఓట్లు వేయలేకపోయినందుకే తాము ఓడిపోయామని బిజెపి వాదించింది.


ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ, రాజస్థాన్, పంజాబ్ లలో సైనికులు, మాజీ సైనికులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. ఒక్క హిమాచల్ లోనే యోల్, ధర్మశాల, అహ్లాల్, పాలంపూర్, సుబాతు, బాక్లో, నహన్, పూహ్, డల్హౌసీ పట్టణాల్లో ఆర్మీ కంటోన్మెంట్లు ఉన్నాయి. ఇక బెంగాల్ లోని డార్జిలింగ్ లోనూ మాజీ సైనికుల సంఖ్య చాలా ఎక్కువ. అందుకే బిజెపి, కాంగ్రెస్ లకు ఎక్స్ సర్వీస్ మెన్ సెల్స్ కూడా ఉన్నాయి.

రాజకీయాల్లోకి సైనికులు
గతంలో ఎన్నికల రాజకీయాల్లో సైనికులు పాల్గొనేవారు కాదు. అసలు పోటీ చేసేవాళ్లు దొరకడమూ చాలా కష్టం. పోటీచేసిన వాళ్లు కూడా ఘోరంగా ఓడిపోయారు.


ఉదాహరణకి 1962, 1965, 1971 యుద్ధాల్లో సాహసోపేతంగా పనిచేసిన మేజర్ జనరల్ యూస్టేస్ డిసౌజా 1974 లో పోటీ పడ్డారు. కానీ ఘోరంగా ఓడిపోయారు. అయితే నేతాజీ సుభాష్ చంద్ర బోస్ స్థాపించిన ఆజాద్ హింద్ ఫౌజ్ లో పనిచేసిన కల్నల్ డిఎన్ రాజు రాజమండ్రి నుంచి, షానవాజ్ ఖాన్ (నటుడు షారుఖ్ ఖాన్ తాతగారు) ఉత్తరభారతం నుంచి ఎంపీలుగా గెలుపొందారు. ఆ తరువాత సైనికులు రాజకీయాలకు దూరంగా ఉండటం, రాజకీయులు సైనికులను పట్టించుకోకపోవడం జరిగాయి.


కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి మేజర్ జనరల్ భువన్ చంద్ర ఖండూరీలు మాజీ సైనికులే. మన మాజీ రక్షణ మంత్రి జస్వంత్ సింగ్ కూడా బ్రిగేడియర్ స్థాయిలో పనిచేసిన వారే. రాజస్థాన్ లో ప్రస్తుత ఎంపీ సచిన్ పైలట్ తండ్రి రాజేశ్ పైలట్ ఎయిర్ ఫోర్సులో పనిచేసిన వారే.


మన రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎయిర్ ఫోర్స్ నేపథ్యం నుంచి వచ్చిన వారే. వైఎస్ఆర్ సీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు దీ ఆర్మీ నేపథ్యమే.

మాజీ సైనికులను ఆకట్టుకుంటున్న మోడీ
బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ మాజీ సైనికుల వోటు విలువను గుర్తించిన అరుదైన నేతల్లో ఒకరు. అందుకే ఆయన ప్రత్యేకంగా మాజీ సైనికుల సదస్సును ఏర్పాటు చేసి, దానికి జనరల్ వికె సింగ్ ను ఆహ్వానించారు. జనరల్ వికె సింగ్ బిజెపిలో చేరడం కూడా ఒక కీలక పరిణామమే. మాజీ సైనికుల ఓట్లు కనీసం దేశంలోని 25 లోకసభ స్థానాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఈ వర్గం సమస్యలను గుర్తించడం, పరిష్కారాలను వెతకడం అవసరమని ఆయన భావించారు.


ఒక హోదా ఉన్న వారికి ఒకే జీతం, సైనికులకు ఓటు హక్కు వంటి అంశాలను ఆయన ప్రస్తావించిన తరువాతే కాంగ్రెస్ వీటిపై చర్యలు తీసుకుంది. మొత్తం మీద ఈ సారి జరుగుతున్న ఎన్నికల్లో ఖాకీ నుంచి ఖాదీకి మారే వారి సంఖ్య మరింత పెరుగుతుందన్నది మాత్రం సుస్పష్టం.

Advertisement
Advertisement