అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే తప్పుకుంటా:పిల్లి సుభాష్ చంద్రబోస్ | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే తప్పుకుంటా:పిల్లి సుభాష్ చంద్రబోస్

Published Thu, May 1 2014 2:39 AM

అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే తప్పుకుంటా:పిల్లి సుభాష్ చంద్రబోస్ - Sakshi

 తోటకు బోస్ సవాల్
 
 ద్రాక్షారామ, న్యూస్‌లైన్ :
‘రామచంద్రపురం నియోజకవర్గంలో నేను ఎనిమిదేళ్ల కాలంలో అభివృద్ధి చేయలేదని నిరూపిస్తే అసెంబ్లీ ఎన్నికల పోటీనుంచి తప్పుకుంటా.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ టీడీపీ అభ్యర్థి తోట త్రిమూర్తులుకు సవాల్ విసిరారు. ఆయన బుధవారం రాత్రి అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి పినిపే విశ్వరూప్‌తో కలసి ద్రాక్షారామలో ప్రచారం నిర్వహించారు. తాను చేసిన పనులను తోట త్రిమూర్తులు ఖాతాలో వేసుకోవడాన్ని ఆయన దుయ్యబట్టారు. ‘ఎనిమిదేళ్ల కాలంలో నేను చేసిన అభివృద్ధి త్రిమూర్తులు ఏడాదిన్నర కాలంలోనే చేసినని చెప్పుకుంటున్నారు. ఆయన దాన్ని నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా’ అన్నారు. ఇసుక మాఫియా, కుల రాజకీయాలను రెచ్చగొట్టడం సంస్కారం కాదని ఆయన తోటకు హితవు పలికారు. రామచంద్రపురం పట్టణంలోని మెయిన్ రోడ్డు, రాజీవ్ గృహకల్ప, బైపాస్ రోడ్డు, జూనియర్ కాలేజీ అభివృద్ధి, కాలేజీ గ్రౌండు అభివృద్ధి కనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు.

‘నేను కట్టించిన కమ్యూనిటీ హాళ్లు, వేయించిన సీసీ రోడ్లను తాను చేసిన అభివృద్ధిగా త్రిమూర్తులు చెప్పుకుంటున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను ఆయన మానుకోవాలి’  అని హెచ్చరించారు. లేకుంటే ఆగ్రహించిన ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. కొత్తూరులో పేదవారి కోసం 33 ఎకరాలను పట్టాలుగా ఇస్తే అవి దొంగ పట్టాలంటూ ప్రచారం చే స్తున్న నీకు అక్షరం జ్ఞానం ఉందా అని బోస్ తోటను ప్రశ్నించారు. ‘నకిలీలు ఏవో ఒరిజినల్ పట్టాలు ఏవో నీకు తెలియదు. నేను చేసిన అభివృద్ధి నాది కాదు అని కాని, నేను పంపిణీ చేసిన పట్టాలు నకిలీవి అని నువ్వు నిరూపిస్తే నేను నీకు బానిసగా ఉంటాను’ అని ఆయన అన్నారు. అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసగించాలని చూస్తే వారు తగిన గుణపాఠం చెబుతారన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement