పిఠాపురంలో ‘దేశం’ డబుల్ గేమ్ | Sakshi
Sakshi News home page

పిఠాపురంలో ‘దేశం’ డబుల్ గేమ్

Published Sat, Apr 26 2014 1:11 AM

pithapuram in double game

- దిక్కరించిన వర్మపై.. చంద్రబాబు ఉపేక్ష  
- అకస్మాత్తుగా యనమలకు కలిగిన ఆపేక్ష
- అయోమయంలో చిక్కుకున్న పార్టీ శ్రేణులు
- ‘స్థిరమైన వేదిక’కు తరలిపోయే అవకాశం!

 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : అటు అధినేత చంద్రబాబు నాయుడు, ఇటు జిల్లాలో అగ్రనేత యనమల రామకృష్ణుడుల వైఖరి జీర్ణం కాక పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం శ్రేణులు జుట్టు పీక్కునే స్థితిలో చిక్కుకున్నాయి. చంద్రబాబు రాష్ట్ర  విభజనలో అనుసరించిన  రెండుకళ్ల సిద్ధాంతాన్నే తమ నియోజకవర్గం విషయంలోనూ అనుసరించారా అన్న అనుమానం వారిని పీడిస్తోంది.

గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైన ఎస్‌వీఎస్ వర్మను కాదని పోతుల విశ్వంను అభ్యర్థిగా చంద్రబాబు నిర్ణయించారు. దీంతో వర్మ రెబల్‌గా బరిలో దిగినా, ఇంతవరకూ పార్టీకి రాజీనామా చేయకపోయినా ఆయనను సస్పెండ్ చేయకపోవడంలో అధినేత ఆంతర్యమేమిటన్న ప్రశ్న పార్టీ శ్రేణులను వెన్నాడుతోంది.

అలాగే మొన్నటి వరకూ వర్మకు అవకాశం రాకుండా మోకాలడ్డినట్టు చెపుతున్న యనమల.. ఇప్పుడు రెబల్‌గా ఉన్న వర్మకు తెర వెనుక మద్దతునిస్తున్నారని పార్టీ వర్గాలే అంటున్నాయి. పరస్పర విరుద్ధంగా కనిపిస్తున్న ఈ వైఖరులతో పార్టీ శ్రేణులు అయోమయానికి గురవుతున్నా.. నేతలకు మాత్రం స్పష్టమైన లక్ష్యాలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
 

వర్మకు టీడీపీ పెద్దల పరోక్ష మద్దతు
 పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న వర్మ గత ఎన్నికల్లో ఓటమి పాలైన నాటి నుంచీ పార్టీ కార్యక్రమాలను భుజాన వేసుకుని తిరిగారు. తిరిగి టిక్కెట్టు తనకే వస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే.. అనూహ్యంగా వర్మకు చెయ్యిచ్చి, ఆ స్థానం నుంచి అవకాశాన్ని పోతుల విశ్వంకు కట్టబెట్టారు.

దీంతో హతాశుడైన వర్మ రెబల్‌గా బరిలో దిగారు. వర్మ వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీలను చించేశారు. పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కాకినాడ ఎంపీ అభ్యర్థి తోట నరసింహం, పోతుల అనుచరులతో దుందుడుకుగా వ్యవహరించారు. వర్మ పార్టీకి రాజీనామా చేయకుండానే ప్రచారం చేసుకుంటున్నారు. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తామన్నా ససేమిరా అని బరిలో దిగారని ప్రచారం జరిగింది.

ఇంత చేసినా వర్మపై అధినేత ఎలాంటి చర్యా తీసుకోకపోవడం పార్టీ శ్రేణులను విస్మయపరుస్తోంది. కాగా ఇక్కడ నడుస్తున్నది బాబు డబుల్ గేమ్ తప్ప వేరొకటి కాదని టీడీపీ సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. పిఠాపురం సీటు విశ్వంకు ఇచ్చినా.. పరోక్షంగా వర్మకు మద్దతు ఇవ్వండన్న సంకేతాలు పార్టీ ముఖ్యుల నుంచి అందుతుండడమే ఇందుకు సాక్ష్యమంటున్నారు.  
 

 కుదిరిన ఒప్పందం..!
 కాగా మొత్తం వ్యవహారంలో.. పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడి పాత్ర ఉందని పార్టీ సీనియర్లు అంటున్నారు. గతంలో యనమల వర్మకు వ్యతిరేకంగా ఉన్నారు. అయితే అనంతరం ఆయనకు, వర్మకు మధ్య ఒప్పందం కుదిరిందని అంటున్నారు. దీంతోనే చంద్రబాబు తాడేపల్లిగూడెం పర్యటనకు వచ్చినప్పుడు తుని టిక్కెట్టు తన సోదరుడు కృష్ణుడుకిఇవ్వకున్నా ఫర్వాలేదు, పిఠాపురంలో వర్మకు మాత్రం ఇచ్చి తీరాల్సిందేనని యనమల పట్టుబట్టారని అంటున్నారు.

ఈ నేపథ్యంలోనే తన ప్రమేయం లేకుండా సీటు తెచ్చుకున్న విశ్వంకు వ్యతిరేకంగా పని చేయాలని పార్టీ శ్రేణులకు యనమల చెపుతున్నట్టు సమాచారం. మొత్తమ్మీద పెద్ద తలకాయల రెండు ముఖాలతో.. తెల్లముఖం వేస్తున్న పిఠాపురం టీడీపీ శ్రేణులు.. ఆ పార్టీని వీడి ‘స్థిరమైన వేదిక’ను ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.

Advertisement
Advertisement