ఓటేమాతరం | Sakshi
Sakshi News home page

ఓటేమాతరం

Published Wed, May 7 2014 4:35 AM

ఓటేమాతరం - Sakshi

 ఓటర్లూ ఈ రోజు మీదే.. ఐదేళ్లకొకసారి వచ్చే ఈ రోజును వినియోగించుకోండి.. మీ సత్తా చూపండి.. మీ వద్ద ఉన్న ఓటు ఆయుధాన్ని సంధించండి.. స్వార్థ చింతన, స్వలాభం చూసుకునే నాయకులను దూరం పెట్టండి.. ఓటేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి.. డబ్బులు ఇచ్చాడనో.. మద్యం తాగించాడనో ఐదేళ్ల కాలాన్ని వారి చేతిలో పెట్టొద్దు.. మనకు ఎవరైతే న్యాయం చేస్తారో.. సమాజాన్ని బాగు చేస్తారో వారికే ఓటేసి తలరాతను మార్చుకోండి..!  
 
 సాక్షి, ఒంగోలు: ఓటర్స్ డే రానే వచ్చింది. బుధవారం జిల్లాలోని 12 అసెంబ్లీ, మూడు లోక్‌సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ స్థానాలకు 187 మంది, లోక్‌సభ స్థానాలకు 29 మంది బరిలో వున్నారు. పోలింగ్‌కు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది.  ఒంగోలు లోక్‌సభ స్థానం పరిధిలో ఒంగోలు, దర్శి, కనిగిరి, మార్కాపురం, గిద్దలూరు, యర్రగొండపాలెం(ఎస్సీ), కొండపి(ఎస్సీ) అసెంబ్లీ నియోజకవర్గాలు న్నాయి. అలాగే బాపట్ల లోక్‌సభ స్థానం పరిధిలో అద్దంకి, పర్చూరు, చీరాల, సంతనూతలపాడు అసెంబ్లీ సెగ్మెంట్లు వుండగా, జిల్లాలోని కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం నెల్లూరు పార్లమెంటరీ స్థానం పరిధిలో వుంది. ఆయా స్థానాల్లో ప్రధాన పార్టీలు  వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్‌తో పాటు భారతీయ జనతా పార్టీ ఒకచోట, జై సమైక్యాంధ్ర పార్టీ, లోక్‌సత్తా, ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 
* జిల్లాలో మొత్తం 24,84,109  మంది ఓటర్లు వున్నారు.
* 12, 34,660 మంది పురుషులు కాగా,  12,49,285 మంది మహిళా ఓటర్లు వున్నారు.
* వీరంతా బుధవారం జరిగే పోలింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
* ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం సిద్ధం చేసింది.
* జిల్లాలోని 1885 ప్రాంతాల్లో 2,881 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* ఆయా కేంద్రాల వద్ద తాగునీరు, టాయిలెట్‌లు, విద్యుత్ సౌకర్యంతో పాటు వికలాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
* జిల్లాలో 1022 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకంగా, 559 కేంద్రాలను అతిసమస్యాత్మకంగా గుర్తించారు.
* తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాలు 38 ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో పోలింగ్ సరళిని వీడియో తీయించేందుకు ఏర్పాట్లు చేశారు.
* నిరంతరం ఎన్నికలను పర్యవేక్షించేందుకు 659 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు.
 వీటికి అనుసంధానంగా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు సంబంధించి ఫిర్యాదులు వుంటే టోల్ ఫ్రీ నంబర్ 1077 కు ఫోన్ చేయవచ్చు.
* 922 పోలింగ్ కేంద్రాల్లో పరిశీలనకు 720 సూక్ష్మపరిశీలకులను నియమించారు.    
 మంగళవారం రాత్రికే పోలింగ్ సామగ్రి తరలింపు
* జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ నిర్వహణకు 20, 041 మంది ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకుంటున్నారు.
* వీరందరికీ శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా నియోజకవర్గాల్లోని సమీప కళాశాలల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి మాక్ పోలింగ్ నిర్వహించి శిక్షణ ఇచ్చారు.
మంగళవారం రాత్రికే ఎన్నికల సామగ్రిని సిబ్బందికి అప్పగించారు. వారిని ప్రత్యేక బస్సుల్లో పోలింగ్ కేంద్రాలకు పంపారు.
ఉదయం ఏడు గంటలకు  పోలింగ్ ప్రారంభం కానుంది. అంతకు అర్ధగంట ముందుగానే రాజకీయ పార్టీల ఎన్నికల, బూత్ ఏజెంట్‌లు హాజరుకావాల్సి ఉంది. అందరి వద్ద సంతకాలు తీసుకున్న తర్వాత వారి సమక్షంలోనే ప్రిసైడింగ్ అధికారులు ఈవీఎం యంత్రాల సీల్‌ను తొలగిస్తారు.
* పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంల పనితీరులో ఇబ్బందులు తలెత్తితే, వెంటనే మార్పు చేసేందుకు సెక్టోరల్ అధికారుల వద్ద అసెంబ్లీకి రెండు, పార్లమెంట్‌కు మరో రెండు ఈవీఎంలు రిజర్వులో ఉంచారు.
* కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 9,545 పోలీసు అధికారులు, సిబ్బంది విధుల్లో ఉన్నారు.
* పోలింగ్ ప్రక్రియను జిల్లాప్రధాన ఎన్నికల అధికారి కలెక్టర్ విజయ్‌కుమార్, ఎస్పీ ప్రమోద్‌కుమార్ పర్యవేక్షిస్తారు.

Advertisement
Advertisement