పోలీసుల అప్రమత్తం | Sakshi
Sakshi News home page

పోలీసుల అప్రమత్తం

Published Fri, May 2 2014 1:53 AM

police alert

నెల్లూరు(నవాబుపేట), న్యూస్‌లైన్: చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌లో గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో గురువారం బాంబుపేలుళ్ల నేపథ్యంలో ఇక్కడ రైల్వేపోలీసులు అప్రమత్తమయ్యారు. రైల్వేస్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. ఒకవైపు నరేంద్రమోడీ బహిరంగ సభ, మరోవైపు గౌహతీ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుళ్లు జరగడంతో తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లోని బోగీలో గుర్తు తెలియని సూట్‌కేస్‌ను ప్రయాణికులు గుర్తించి నెల్లూరు రైల్వేపోలీసులకు సమాచారం ఇచ్చారు. నెల్లూరు స్టేషన్‌లోని మూడో నంబర్ ఫ్లాట్‌పారంపై సూట్‌కేస్‌ను రైల్వేపోలీసులు దింపారు. బాంబ్‌స్క్వాడ్‌కు సమాచారం అందించారు. ఈ లోపు సూట్‌కేస్ సంబంధీకులు అక్కడికి చేరుకున్నారు. బాంబ్‌స్క్వాడ్ వచ్చి పరీక్షించిన అనంతరం సూట్‌కేస్‌ను తెరచి చూశారు. అందులో పెళ్లి వస్తువులు ఉండటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
 
 పెళ్లి వస్తువుల సూట్‌కేసే..
 విజయవాడ రామానగర్‌లో నివసించే పొదిలి వెంకటేశ్వర్లు, నరసమ్మ కుమార్తె పద్మావతిని బుచ్చిరెడ్డిపాళెం రేబాల నివాసి శ్యామ్‌బాబుతో పెళ్లి కుదిరింది. గురువారం రాత్రి జరగబోయే పెళ్లికి పెళ్లికూతురు బంధువులతో కలిసి గురువారం ఉదయం 6 గంటలకు విజయవాడ నుంచి నెల్లూరు వచ్చేందుకు పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో జనరల్ బోగీలో ఎక్కారు. దాదాపు 25 మంది పెళ్లి బృందం ఉండటంతో మూడు బోగీలలో ఎక్కారు. పెళ్లి ప్రతాణ వస్తువులున్న సూట్‌కేస్ బోగీలోనే వదిలి నెల్లూరు రైల్వేస్టేషన్‌లో దిగి వెళ్లిపోయారు. కొంత దూరం వెళ్లిన తర్వాత సూట్‌కేస్ విషయమై జ్ఞాపకం రావడంతో తిరిగి వచ్చారు. అప్పటికే సూట్‌కేస్‌ను రైల్వే ఎస్సై సుభాన్ తనిఖీ చేపట్టారు. సూట్‌కేస్ తమదే  అని వివరణ ఇచ్చారు. వారిని రైల్వే డీఎస్పీ రాజేంద్రకుమార్ వద్దకు తీసుకెళ్లి విచారించారు. అనంతరం వివరాలు తీసుకొని వారిని పంపించారు.
 

Advertisement
Advertisement