నాయక్‌పై దూసిన కత్తి | Sakshi
Sakshi News home page

నాయక్‌పై దూసిన కత్తి

Published Tue, May 6 2014 2:48 AM

నాయక్‌పై దూసిన కత్తి

వరంగల్, న్యూస్‌లైన్: తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో కేంద్ర మంత్రి, మానుకోట ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే అభ్యర్థి కత్తి వెంకటస్వామి నువ్వెంత అంటే నువ్వెంత అంటూ కొట్లాటకు దిగడం జిల్లాలో చర్చనీయూంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో గెలుపోటములపై జిల్లాలోని అభ్యర్థులు,ముఖ్య నేతలతో హైదరాబాద్ గాంధీభవన్‌లో సోమవారం తెలంగాణ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సమీక్షించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న తనకు బలరాం నాయక్ సహకరించలేదని కత్తి వెంకటస్వామి ఆరోపించడంతో గొడవ మొదలైంది.

 స్వతంత్ర అభ్యర్థి దొంతికి సహకరించారని, తనకు సహకరించని పార్టీ నేతలను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ప్రత్యర్థి పార్టీలకు అమ్ముడుపోయావని వెంకటస్వామిపై నాయక్ ధ్వజమెత్తాడు. ఇరువురి మధ్య మాటామాట పెరగడంతో మిగిలిన వారు కలుగచేసుకుని వారించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
 
 పార్టీ వ్యతిరేకులపై చర్యలు
 ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనున్నట్లు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. ఈ మేరకు పార్టీ వ్యతిరేకులను గుర్తించి నివేదిక సమర్పించాలని డీసీసీ బాధ్యులను ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే క్యాంప్‌లు నిర్వహించి చైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేలా శ్రద్ధ వహించాలని నాయకులకు ఆయన సూచించినట్లు తెలిసింది.
 
 ముగ్గురు గైర్హాజరు
 ఈ సమావేశానికి టీ పీసీసీ అధ్యక్షుడి సొంత జిల్లాకు చెందిన ముగ్గురు అభ్యర్థులు డుమ్మా కొట్టారు. స్టేషన్‌ఘన్‌పూర్, మహబూబాబాద్, వర్ధన్నపేట నుంచి ఎమ్మెల్యేలుగా పోటీచేసిన డాక్టర్ విజయరామారావు, మాలోతు కవిత, కొండేటి శ్రీధర్ గైర్హాజరయ్యారు. విజయరామారావు, శ్రీధర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా కవిత తిరుపతికి దైవదర్శనానికి వెళ్లారు. సమావేశంలో మాజీ మంత్రులు బస్వరాజు సారయ్య, డీఎస్. రెడ్యానాయక్, మాజీ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులు పొదెం వీరయ్య, దుగ్యాల శ్రీనివాసరావు, కత్తి వెంకటస్వామి, ఎర్రబెల్లిస్వర్ణ, ఇనుగాల వెంకట్రాంరెడ్డి, ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి డాక్టర్ హరిరమాదేవి, శ్రీరాంభద్రయ్య, పి.లక్ష్మణ్‌గౌడ్, కృష్ణమూర్తి, జిల్లా నాయకులు వరద రాజేశ్వర్‌రావు, ఈవీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
 
 కొండేటికి పరామర్శ

 సమావేశం అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కొండేటి శ్రీధర్, విజయరామారావును  జిల్లా కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.

Advertisement
Advertisement