ఓటమిపై ‘పోల్’మార్టం | Sakshi
Sakshi News home page

ఓటమిపై ‘పోల్’మార్టం

Published Sun, May 18 2014 3:47 AM

ఓటమిపై ‘పోల్’మార్టం - Sakshi

 - పరాజయాన్ని  జీర్ణించుకోలేకపోతున్న నేతలు
 - తప్పిన లెక్కలపై బేరీజు
 - నష్టమెక్కడో వెతుకులాట

 
 వరంగల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓటమిపై ప్రధాన పార్టీల అభ్యర్థుల పోస్ట్‌మార్టం మొదలైంది. గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్న నేతలైతే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరిగిందని మథన పడుతున్నారు. ఫలితాలు వెల్లడై ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయో తేలిడంతో లోటుపాట్లపై బేరీజు వేసుకుంటున్నారు. నమ్మకమైన పార్టీ నాయకులు, అనుచరులతో జరిగిన నష్టంపై చర్చల్లో నిమగ్నమయ్యారు. ఓడిపోయిన నేతల ఇళ్ల వద్ద ఓదార్పులు, ఇలా చేసుంటే బాగుండేదనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నేతల్లో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తుండగా గులాబీ గాలివీచినా గెలవకపోవడంపై టీఆర్‌ఎస్ నాయకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఇక మోడీ ప్రభంజనంలోనూ ఓటమి మూటగట్టుకోవడంపై బీజేపీ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది.

కాంగ్రెస్‌లో నిర్వేదం
ఓటమిపాలైన కాంగ్రెస్ నేతల్లో నిర్వేదం కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామలో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. టీపీసీసీ అధ్యక్షుడిగా గెలిస్తే తెలంగాణ సీఎం అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగినా పొన్నాల ఓటమి చెందడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వరంగల్ తూర్పులో బలమైన నేతగా ఉన్న సారయ్య భారీ మెజార్టీతో ఓటమిపాలవడం తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలను ఎదుర్కొవడంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన వ్యవహరించిన తీరు అతివిశ్వాసమా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది.

నిన్నటి వరకు కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాలుగా ఉన్న చోట్ల కూడా టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఓటింగ్ జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భూపాలపల్లిలో మాజీ చీఫ్‌విప్ గండ్రను తెలంగాణవాదం కొంపముంచింది. ఆయన సర్వశక్తులొడ్డినప్పటికీ  కోల్‌బెల్ట్‌లో నష్టం జరిగింది. దీనికి స్థానిక నాయకుల అతివిశ్వాసమే కారణమంటున్నారు.  ప్రభుత్వ వ్యతిరేకత ఎదురైనప్పటికీ సకాలంలో సరిదిద్దుకోలేక పోవడంతో పరిస్థితి చేయిదాటిపోయిందనే చర్చ పార్టీ వర్గాల్లోసాగుతోంది. హోరాహోరీ పోరులో పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్యాల ఓటమిచెందడంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది.

తెలంగాణ అనుకూల వాతావరణంలో టీడీపీ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబాబాద్‌లో కవిత తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపులు, వర్ధన్నపేటలో శ్రీధర్‌కు, ములుగులో  వీరయ్యకు ప్రభుత్వ వ్యతిరేకత దెబ్బతీసినట్లు భావిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో విజయరామారావు, వరంగల్ పశ్చిమలో స్వర్ణ, పరకాలలో వెంకట్రాంరెడ్డి, నర్సంపేటలో వెంకటస్వామిప్రజాభిమానాన్ని పొందలేక పోయారంటున్నారు.

గులాబీల్లో ఆవేదన
గులాబీ పవనాలు వీచినప్పటికీ విజయం సాధించకపోవడంతో నర్సంపేట టీఆర్‌ఎస్ శ్రేణుల్లో నిర్వేదం వ్యక్తమవుతోంది. ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఇక్కడ ప్రజల్లో పట్టున్నప్పటికీ  ఓటమిపాలు కావడం మింగుడుపడడంలేదు.  కాంగ్రెస్‌పై వ్యతిరేకత స్థానంలో సానుభూతి పవనాలు వీయడంతో ఓటమితప్పలేదు. అనుభవరాహిత్యం ఇక్కడ నష్టం చేసిందంటున్నారు.    పాలకుర్తిలో సుధాకర్‌రావు సానుకూల వాతావరణానికి తగిన విధంగా ఎత్తులు వేయకపోవడం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొలేకపోవడం వల్లే కారు పరుగులు తీసిందంటున్నారు.

పరకాలలో సహోదర్‌రెడ్డికి  పట్టులేక పోవడంతో నష్టం వాటిల్లింది. పార్టీలో గ్రూపులు కొంత నష్టం చేశాయి.  పరకాల పట్టణంలో పట్టుకోల్పోవడం టీఆర్‌ఎస్‌ను దెబ్బతీసిందని భావిస్తున్నారు. డోర్నకల్‌లో పార్టీ మారినప్పటికీ ఇక్కడ గులాబీ బలంగా లేకపోవడంతో నష్టం వాటిల్లింది. ఓటుమార్పులో లోటుపాట్లతో సత్యవతి ఓటమితప్పలేదంటున్నారు.

టీడీపీ విఫలం
నర్సంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు అనుసరించిన తీరుకు తగిన విధంగా స్పందించకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్ రాజకీయ దాడితో కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపలేక చతికిలపడ్డామనే అంచనాకు వచ్చారు. ములుగులో పార్టీపై వ్యతిరేకత  సీతక్క ఓటమికి కారణమైంది. అయితే పార్టీని తిరిగి పట్టాలెక్కించే సత్తా తనకుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేడర్‌లో విశ్వాసం పెంచేయత్నం చేస్తున్నారు. మహబూబాబాద్, డోర్నకల్‌లలో టీడీపీ అభ్యర్థులు బాలుచౌహాన్, రామచంద్రునాయక్‌ల ప్రయోగం ఫలించలేదు. పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసం పెంచలేకపోయారు.

బీజేపీకి కలిసిరాని పొత్తు
టీడీపీతో పొత్తు జిల్లాలో కలిసిరాలేదనే అభిప్రాయం బీజేపీ అభ్యర్థులో ఉంది. తూర్పు, పశ్చిమ, జనగామ, భూపాల్‌పల్లి నుంచి బరిలో నిలిచిన రావు పద్మ, ధర్మారావు, ప్రతాపరెడ్డి, సత్యనారాయణరావుల్లో ఆవేదన నెలకొంది. ఓట్ల మార్పు సాధ్యం కాలేదంటున్నారు. ఇక టీడీపీ ఏ మేరకు సహకరించిందో పోస్ట్‌మార్టమ్ చేస్తున్నారు. టీడీపీపై వ్యతిరేకత తమకు నష్టం చేసిందనే అంచనాకొచ్చారు.

Advertisement
Advertisement