తెలంగాణ - రాజులెవరు? తరాజులెవరు? | Sakshi
Sakshi News home page

తెలంగాణ - రాజులెవరు? తరాజులెవరు?

Published Thu, May 1 2014 10:01 PM

తెలంగాణ - రాజులెవరు? తరాజులెవరు? - Sakshi

వయసులో అతి పిన్న రాష్ట్రమైన తెలంగాణలో తొలి ఎన్నికలు ఎలాంటి ఫలితాలను వెలువరించబోతున్నాయి? ఎవరు రాజవుతారు? ఎవరు తరాజవుతారు? పుష్కరకాలం పాటు తెలంగాణ కోసం పోరాడిన గులాబీ దండు జయపతాకం రెపరెపలాడిస్తుందా? లేక తెలంగాణ ఇస్తాం, తెస్తాం అన్న కాంగ్రెస్ పార్టీ వోట్ ను క్యాష్ చేసుకుంటుందా? ఎన్నికలకు ముందు ఎలాగోలా కలిసి ఎదో లాభం పొందుదామనుకుంటున్న టీడీపీ-బీజేపీ కూటమి లెక్కలు తప్పుతాయా? తెలంగాణలో తొలిసారి అసెంబ్లీ, లోకసభ ఎన్నికల బరిలోకి దిగిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతోంది? పాతబస్తీ కంచుకోటలో మజ్లిస్ రణనీతి ఎలా ఉండబోతోంది? తెలంగాణ తొలి గవర్నమెంట్ ఎవరిది?

ఇప్పుడందరి దృష్టీ ఈ ఆసక్తికరమైన ప్రశ్నలపైనే ఉంది. బుధవారం జరిగిన భారీ పోలింగ్ దేనికి సంకేతం అన్న విషయంపై ఎవరి విశ్లేషణలు వారు చేస్తున్నారు. పోలింగ్ సరళిని చూసి వివిధ రాజకీయ పార్టీలు తమతమ అంచనాలు వేసుకుంటున్నాయి.

ఊహించినదాని కన్నా టీఆర్ఎస్ ఎక్కువ ప్రజా మద్దతును కూడగట్టుకున్నట్టు ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. బూత్ స్థాయిలో ఓటింగ్ సరళిని అంచనావేసుకున్న టీఆర్ఎస్ మొత్తం మీద అతిపెద్ద పార్టీగా అవతరించే పరిస్థితి ఉందని వారు అంటున్నారు.

మరో వైపు కాంగ్రెస్ నేతలు తాము ఆశించిన మేరకు ఫలితాలు ఉండకపోవచ్చునని చెబుతున్నారు. బుధవారం సాయంత్రానికి చాలా మంది నేతలు ఓటింగ్ సరళిని చూసి దిగులు చెందారు. తాము తెలంగాణ, తెచ్చినా, ఇచ్చినా యాంటీ ఇన్ కంబెన్సీ తమ కొంప ముంచిందేమోనన్నది కాంగ్రెస్ అనుమానం. అంతర్గత విభేదాలు, ఒకరిని ఓడించేందుకు మరొక నేత ప్రయత్నించడం, ముఖ్యమంత్రి అభ్యర్థులందరూ తమ గెలుపుకన్నా పోటీదారుల ఓటమిపై ఎక్కువ దృష్టి సారించడం, పార్టీ ప్రచారానికి ఒక దృఢమైన కేంద్ర బిందువు లేకపోవడం పార్టీకి ఇబ్బందికరంగా మారిందని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇదే నిజమైతే కాంగ్రెస్ తెలంగాణలో, సీమాంధ్రలో దెబ్బతింటుందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇక టీడీపీ, బీజేపీ పొత్తు కూడా ఇద్దరు బలహీనుల దోస్తీ గా నిలిచిపోతుందా? బిజెపితో కలిసినందుకు ఉన్న కొద్ది మంది ముస్లింలూ దూరమయ్యారని, టీడీపీతో కలిసినందుకు బిజెపికి భారీ నష్టం జరిగిందని నిపుణులు చెబుతున్నారు. బిజెపి టీడీపీ కూటమికి 15-16 కి మించి సీట్లు రాకపోవచ్చునని అంచనా వేస్తున్నారు. టీడీపీకి ఇక గతమే తప్ప భవిష్యత్తు ఉండబోదని కూడా విశ్లేషకులు ఘంటాపథంగా చెబుతున్నారు.

మొత్తం మీద రాబోయే రోజుల్లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ సీమాంధ్రలో కింగ్ గా, తెలంగాణలో కింగ్ మేకర్ గా వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతరిస్తుందా? తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ ఆర్ సీపీ కీలకపాత్ర పోషిస్తుందా? మొత్తం మీద అంతా ఒక పదిహేను రోజుల్లో తేలిపోనుంది.

Advertisement
Advertisement