మీట నొక్కుడే | Sakshi
Sakshi News home page

మీట నొక్కుడే

Published Wed, Apr 30 2014 2:02 AM

మీట నొక్కుడే - Sakshi

 నేటి పోలింగ్‌కు సర్వం సిద్ధం

  •  ఓటేయనున్న 25,61,171 మంది ఓటర్లు
  • బరిలో 184 మంది అభ్యర్థులు
  • పార్లమెంట్‌కు 29.. అసెంబీకి 155 మంది
  • ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
  •  ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే...

  కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టమైన పోలింగ్ బుధవారం జరగ నుంది. రెండు నెలలుగా ఎన్నికల సన్నా హాల్లో ఉన్న యంత్రాంగం పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసింది. మొత్తంగా ఇక ఓటరు బూత్‌లోకి వెళ్లి ఈవీఎం మీట నొక్కడమే తరువాయి అన్నట్లు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. జిల్లాలో 25,61,171 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12 శాసన సభ, రెండు పార్లమెంట్ స్థానాలుండగా.. పార్లమెంట్ స్థానాల నుంచి 29మంది, అసెంబ్లీ స్థానాల నుంచి 155మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోన్నారు.
 
 ఏర్పాట్లు పూర్తి
 పోలింగ్ కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున పోలింగ్ కేంద్రల వద్ద షామియానాలు, తాగునీరు, వైద్య సదుపాయానికి ఏర్పాట్లు చేశారు. మొత్తం 3007 పోలింగ్ కేంద్రాలు ఉండగా.. వీటిలో 303 కేంద్రాలు సమస్యాత్మకం, 124 అతి సమస్యాత్మాకం, 142 కేంద్రాలు నక్సల్స్ ప్రభావిత కేంద్రాలుగా గుర్తించారు. వీటిలో 300 కేంద్రాల్లో వీడియోగ్రఫీ, 833 కేంద్రాల్లో సూక్ష్మపరీశీలకులు, 1030 కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్‌కు ఏర్పాట్లు చేశారు. పోలింగ్ విధుల్లో మొత్తం 26,629 మంది ఉద్యోగులు పాల్గొంటున్నారు. వీరిలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. సిబ్బందిని పోలింగ్ కేంద్రాలకు తరలించేందుకు మొత్తం 1527 వాహనాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌కు 8350 బ్యాలెట్ యూనిట్లు, 6900 కంట్రోల్ యూనిట్లు సిద్ధం చేశారు.
 
 రెండు చోట్ల 4గంటలవరకే పోలింగ్
 జిల్లాలో మారుమూల ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల పరిదిలో పోలింగ్‌ను ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు మాత్రమే కొనసాగించనున్నారు. మిగతా నియోజకవర్గాల పరిధిలో యథావిధిగా సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది.
 
  ప్రత్యక్ష ప్రసారాలు
 పోలింగ్ ప్రక్రియను ప్రజలు ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఈసారి యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రతి నియోజకవర్గ కేంద్రంలో స్రీన్ ఏర్పాటు చేసి పోలింగ్ కేంద్రాల వెబ్ కెమెరాలకు కనెక్ట్ చేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూడనున్నారు. కలెక్టరేట్‌లో కూడా పోలింగ్ ప్రక్రియ సమాచారం కోసం స్రీన్ ఏర్పాటు చేశారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేవరకు ఇది కొనసాగుతుంది. ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ శాతం సమాచారం ప్రజలకు తెలియజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
 
  ఓటుపై విసృ్తత ప్రచారం
 జిల్లాలో ఈసారి 100శాతం పోలింగ్ నమోదును లక్ష్యంగా పెట్టుకున్న యత్రాంగం ఆ దిశగా ఓటర్లను సిద్ధం చేసేందుకు గ్రామ గ్రామాన ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. ఈవీఎం వినియోగంపై కూడా ప్రత్యేక బృందాలతో అవగాహన కల్పించారు. పోలింగ్ కేంద్రాల్లో చేపట్టిన సౌకర్యాల గురించి ప్రజలకు వివరించారు. బరిలో ఉన్న అభ్యర్థులపై వ్యతిరేకత ఉంటే పోలింగ్ కేంద్రానికి వచ్చి ‘నోటా’ నొక్కి తమ అభిప్రాయం వ్యక్తంచేయాలని అధికారులు చెపుతున్నారు.
 
 ఏడు వేల మందితో భద్రత
 పోలింగ్ సందర్బంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మొత్తం 7వేల మంది భద్రతా సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, స్కౌట్స్ వలంటీర్ల సేవలు వినియోగించుకుంటున్నారు.  
 
 ఎన్నికల పర్యవేక్షణకు హెలికాప్టర్‌లు
 మడికొండ, న్యూస్‌లైన్ : జిల్లా వ్యాప్తంగా బుధవారం జరుగనున్న సార్వత్రిక ఎన్నికల పర్యవేక్షణకు రెండు ప్రత్యేక హెలికాప్టర్లను అధికారులు అందుబాటులో ఉంచారు. ఏదైనా అత్యవసర సమయంలో వాటిని ఉపయోగించడానికి మడికొండలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్‌లో సిద్ధంగా ఉంచారు. వరంగల్ జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలకు వినియోగించే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. హెలికాప్టర్‌తో పాటు ప్రత్యేక బలగాలను సైతం అందుబాటులో ఉంచారు.

Advertisement
Advertisement