తుది పోరుకు సై | Sakshi
Sakshi News home page

తుది పోరుకు సై

Published Tue, Mar 25 2014 2:21 AM

తుది పోరుకు సై - Sakshi

 శ్రీకాకుళం, న్యూస్‌లైన్: ప్రాదేశిక ఎన్నికల పోరులో తొలి ఘట్టం విజయవంతంగా ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ ముగి సింది. సోమవారం సాయంత్రం 3 గంట లకు ఉపసంహరణ గడువు ముగియడం తో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ప్రధాన పోటీదారులతోపాటు, మొత్తం అభ్యర్థుల సంఖ్య ఎంతన్నది తేలిపోయింది. ఇక ప్రచారంతో హోరెత్తించి.. పోలింగ్‌లో అదృష్టం పరీక్షించుకోవడమే మిగిలింది.
 
 జిల్లా లో 38 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా ఒకటి ఏకగ్రీవమైంది. మిగిలిన 37 స్థానాలకు 139 మంది రంగంలో ఉన్నారు. అలాగే 675 ఎంపీటీసీలు ఉండగా 26 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 649 స్థానాలకు 1511 మంది అభ్యర్థులు రంగంలో మిగిలారు. జెడ్పీటీసీలకు మొత్తం 296 నామినేషన్లు దాఖల య్యాయి.
 
 వాటిలో 12 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీనిపై నలుగురు అభ్యర్థులు కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోగా ఒకరి నామినేషన్ మాత్రమే తీసుకున్నారు. దీంతో 285 మంది అభ్యర్థులు తుది పోరుకు సై మిగిలారు. కాగా ఆదివారం 17 మంది, సోమవారం 128 మంది(మొత్తం 145) నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో తుదిపోరులో 139 మంది  మిగి లారు.
 
 675 ఎంపీటీసీలకు 3550 నామినేషన్లు దాఖల య్యాయి. తిరస్కరణలు, ఉపసంహరణలు పోగా 24 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించా రు. మిగిలిన 651 ఎంపీటీసీలకు ఎన్నిక జరగనుండా 1511 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
 
 24 ఎంపీటీసీలు ఏకగ్రీవం
 జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం 24 ఎంపీటీసీలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు. జిల్లాలో 675 ఎంపీటీసీలు ఉండగా.. 3,550 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత సింగిల్ నామినేషన్లు మిగిలిన 24 స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
 
 అత్యధికంగా వజ్రపుకొత్తూరు మండలంలో 5 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. సోంపేటలో 3, పాతపట్నం, కొత్తూరు, కవిటి, కంచిలి, నరసన్నపేట మండలాల్లో రెండు చొప్పున, సీతంపేట, హిరమండలం, జలుమూరు, సంతబొమ్మాళి, శ్రీకాకుళం, బూర్జ మండలాల్లో ఒక్కొక్కటి చొప్పున ఏకగ్రీవమయ్యాయి.
 
 కాంగ్రెస్ పరిస్థితి దారుణం
 జిల్లా ఇటీవలి వరకు ఒక వెలుగు వెలిగిన కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా దిగజారిపోయింది. ఏకంగా 23 జెడ్పీటీసీల్లో ఆ పార్టీకి అభ్యర్థులు లేకుండాపోయారు. ఈ నెల 20న నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసేనాటికి 18 మండలాల్లో ఆ పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయలేదు.
 
 అయితే మరో 5 జెడ్పీటీసీల అభ్యర్థులు సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 23 జెడ్పీటీసీల్లో కాంగ్రెస్ పోటీలో లేకుండాపోయింది. నరసన్నపేట ఇప్పటికే ఏకగ్రీవం కాగా 15 మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ, కాంగ్రెస్‌ల మధ్య త్రిముఖ, 22 మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీల మధ్య ముఖాముఖీ పోరు జరగనుంది. కాగా నరసన్నపేట జెడ్పీటీసీ స్థానానికి వైఎస్‌ఆర్‌సీపీ తరఫున శిమ్మ ఉషారాణి, టీడీపీ తరఫున చింతు శకుంతల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అఫిడవిట్‌పై సంతకాలు లేకపోవడంతో ఉషారాణి నామినేషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. దీంతో ఈ స్థానం ఏకగ్రీవమైంది.
 
 ఇక ప్రచార పోరు
 ఇప్పటి వరకు నామినేషన్ల ఘట్టంతో బీజీగా ఉన్న అభ్యర్ధులు, నాయకులు మంగళవారం నుంచి అసలు పోరు ప్రారంభించనున్నారు. అన్ని మండలాల్లోనూ ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే పోటీ నెలకొననుంది. గ్రామీణ ఓట్లను కొల్లగొట్టేందుకు పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమయ్యాయి.
 
 కాంగ్రెస్ 15 మండలాలకే పరిమితమైంది. అయితే ఆ మండలాల్లోనూ ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. కాగా తెలుగుదేశం పార్టీలో చాలా మండలాల్లో అసంతృప్తి నెలకొంది. అసంతృప్తవాదులను బుజ్జగించేందుకు జిల్లా నాయకులు ప్రయత్నిస్తున్నా అవి ఫలించే సూచనలు కనిపించడం లేదు.
 
 నామినేషన్ల ఉపసంహరణ సందర్భంలోనే పలువురు అభ్యర్థులు, వారి బంధువులు తమ నాయకులపై దుమ్మెత్తిపోస్తూ కనిపించారు. ఇటువంటి పరిణామాలతో తెలుగుదేశం బెంబేలెత్తుతున్న టీడీపీ నేతలు ఈ విషయంలో రాష్ట్ర నాయకత్వం సహకారం తీసుకోవాలని యోచిస్తున్నారు.

వైఎస్సార్‌సీపీకి ప్రజాదరణ ఉందని గ్రహించిన కాంగ్రెస్, టీడీపీ నాయకులు లోపాయికారి ఒప్పందాలతో ప్రయోజనం పొందాలని ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ శ్రేణులు మాత్రం ప్రజల్లో తమకున్న ఆదరణే కొండంత అండగా భావిస్తూ.. అదే భరోసాతో ప్రచారపర్వంలోకి దూకుతున్నారు.
 
నేడు గుర్తుల కేటాయింపు
జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ బరిలో నిలిచిన అభ్యర్థులకు మంగళవారం గుర్తులు కేటాయించనున్నారు. నామినేషన్లు ప్రక్రియ ముగియడంతో గుర్తులు కేటాయింపుపై అధికారులు దృష్టి సారించారు. బీ ఫారాలు సమర్పించిన ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తులు కేటాయిస్తారు.
 
మిగిలిన స్వతంత్ర అభ్యర్థులకు వారు కోరిన గుర్తులు, అవి లేని పక్షంలో వేరొక గుర్తు కేటాయిస్తారు.సోమవారం రాత్రంతా ఈ కసరత్తు పూర్తి చేసి మంగళవారం మధ్యాహ్నంలోగా అభ్యర్థుల తుది జాబితాను గుర్తులతో సహా ప్రకటిస్తామని అధికారవర్గాలు పేర్కొన్నాయి.

Advertisement
Advertisement