సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం

Published Sun, Apr 27 2014 4:45 AM

సీమాంధ్ర అభివృద్ధి జగన్‌తోనే సాధ్యం - Sakshi

- ఒంగోలు పార్లమెంటు వైఎస్సార్ సీపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి
 
మార్కాపురం, న్యూస్‌లైన్ : సీమాంధ్ర అభివృద్ధి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ ఒంగోలు పార్లమెంటు అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పట్టణంలోని నాదెళ్ల కల్యాణ మండపంలో ప్రముఖ పారిశ్రామికవేత్త నాదెళ్ల సుబ్రహ్మణ్యం శనివారం ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సుకు వైవీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టుతో సహా పట్టణంలో తాగునీటి సమస్యను అధికారంలోకి వచ్చిన  వెంటనే పరిష్కరిస్తామని వైవీ హామీ ఇచ్చారు.
 
 ఆర్యవైశ్యులకు వైఎస్సార్ సీపీ వ్యతిరేకం కాదు : కేపీ కొండారెడ్డి
 తాను 25 ఏళ్లు ఎమ్మెల్యేగా, జంకె వెంకటరెడ్డి ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పట్టణంలోని ఆర్యవైశ్యులను బెదిరించటం,బ్లాక్‌మెయిల్ చేయటం, లెసైన్స్‌లు రద్దు చేయించటం, అధికారులతో దాడులు చేయించటం వంటి నీచ పనులు చేయలేదని మాజీ ఎమ్మెల్యే కేపీ కొండారెడ్డి అన్నారు.

ఆర్యవైశ్యులకు వైఎస్సార్ సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఎవరికీ భయపడకుండా నిర్భయంగా ఓటు వేసుకోవాలని సూచించారు. ఏ సమయంలో ఎలాంటి కష్టం వచ్చినా పరిష్కరించేందుకు తనతో పాటు జంకె వెంకటరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి మీ వెంట ఉంటారని హామీ ఇచ్చారు.

 మా వద్ద ‘హిమ్’ డబ్బుల్లేవ్..
 వైఎస్సార్ సీపీ నేతలెవరూ పేద ప్రజలు దాచి పెట్టుకున్న హిమ్ సంస్థలోని డబ్బును తినలేదని పరోక్షంగా టీడీపీ అభ్యర్థి కందుల నారాయణరెడ్డిని ఉద్దేశించి కేపీ కొండారెడ్డి అన్నారు. ఎన్నికల్లో ఆర్యవైశ్యులంతా జంకె వెంకటరెడ్డితో పాటు వైవీ సుబ్డారెడ్డికి ఓటు వేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికల్లో చైర్ పర్సన్ పదవిని తొలుత ఆర్యవైశ్యులకే కేటాయించామని, పోటీ చేసేందుకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో డాక్టర్ కనకదుర్గను ఎంపిక చేశామని కొండారెడ్డి వివరణ ఇచ్చారు.

 అభివృద్ధి చేస్తా : జంకె
 తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, నీతి నిజాయితీగా పనిచేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే అభ్యర్థి జంకె వెంకటరెడ్డి అన్నారు. తనకు, వైవీకి ఓట్లు వేయాలని జంకె కోరారు. ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని దృష్టిలో ఉంచుకుని ఆర్యవైశ్యులంతా వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని మాజీ కౌన్సిలర్, ఆర్యవైశ్య సంఘ నాయకుడు చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, మేడా సుబ్బారావులు పిలుపునిచ్చారు. అనంతరం ఆర్యవైశ్య నాయకులు నాదెళ్ల సుబ్రహ్మణ్యం, నాదెళ్ల చంద్రమౌళి, హరగోపాల్, సురేష్‌లు కలిసి ఒంగోలు ఎంపీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డి.

జంకె వెంకటరెడ్డి, కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, తాటిశెట్టి వినయ్‌కుమార్‌లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పార్టీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖాజా, మార్కాపురం, పొదిలి మార్కెట్ యార్డు చైర్మన్‌లు గుంటక సుబ్బారెడ్డి, రమణారెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, ఆర్యవైశ్య సంఘ నాయకులు గార్లపాటి ఆంజనేయులు, వూటుకూరి రామకృష్ణ, పరుచూరి చంద్ర, మొగిలి సుబ్బరత్నం, నేరెళ్ల భద్రి, గుంపల్లి రత్నంశెట్టి, గ్రంధే రవి, ఇమ్మడిశెట్టి వీరారావు, చాటకొండ చంద్రశేఖర్, తాళ్లపల్లి ప్రసాద్, కాళ్ల ఆది, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement