ఐదోసారి | Sakshi
Sakshi News home page

ఐదోసారి

Published Wed, Apr 16 2014 2:44 AM

ఐదోసారి

నేడు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాక
 కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో బహిరంగ సభ
 సాయంత్రం 4-45 గంటల వరకు..
 
 కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఐదోసారి కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జిల్లాలో అడుగుపెడుతున్నారు. ఉద్యమానికి కంచుకోటగా నిలిచిన కరీంనగర్ నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు.
 
  కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలో బుధవారం సాయంత్రం 4గంటలకు నిర్వహించే బహిరంగ సభలో సోనియాగాంధీ పాల్గొంటారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఆమె కరీంనగర్ రానున్నారు. 3.50 గంటలకు కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు. 4.45 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు. 45 నిమిషాల్లోనే సభను ముగించనున్నారు. సోనియాగాంధీ రాక కోసం కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ను ఇప్పటికే సిద్ధం చేశారు. పోలీసు ఉన్నతాధికారులు హెలిప్యాడ్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్ నుంచి స్టేడి యంలోని వేదిక వద్దకు సోనియాను ప్రత్యేక వాహనంలో తీసుకువస్తారు.
 
 భారీ ఏర్పాట్లు
 సోనియా సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. కనీసం లక్షమందిని తరలించేందుకు పార్టీ నేతలు కసరత్తు చేశారు. నియోజకవర్గాల వారీగా లక్ష్యాలను నిర్ధేశించారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన ఖ్యాతిని తమ ఖాతాలో వేసుకొనేందుకు టీఆర్‌ఎస్‌తో పోటీపడుతున్న కాంగ్రెస్.. సోనియా సభను భారీ స్థాయిలో విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ చాంపియన్ తామేనని నిరూపించేందుకు ఉవ్విళ్లూరుతోంది. సభపై ప్రత్యేక దృష్టిసారించిన టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఇప్పటికే కరీంనగర్‌కు వచ్చి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. జిల్లా నేతలు మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్ తదితరులు ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.
 
 అభ్యర్థుల పరిచయం
 సోనియా సభకు పార్టీ సీనియర్లంతా హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రా జనర్సింహ, ఏఐసీసీ కార్యదర్శి కుంతియా, పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, సీ నియర్లు డి.శ్రీనివాస్, జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో పాటు తెలంగాణలోని 119 మంది అసెంబ్లీ అభ్యర్థులు, 17 మంది లోకసభ అభ్యర్థులు సభలో పాల్గొననున్నారు. సభలో సోనియాగాంధీ తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థులను సభకు పరిచయం చేయనున్నారు. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇదే అంబేద్కర్ స్టేడియం వేదిక నుంచి తెలంగాణ ప్రజల ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం ఉంటుందని, ప్రత్యేక రాష్ట్రానికి సానుకూలతను ప్రకటించారు. ఇచ్చిన మాటన నిలబెట్టుకున్నామని చాటిచెప్పేందుకు అదే వేదికను ఎంచుకున్నారు.
 
 గతంలో 1999లో రెండుసార్లు, 2004లో ఒకసారి, 2009లో మరోసారి మొత్తం నాలుగు పర్యాయాలు సోనియా జిల్లాలో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ నాలుగు పర్యటనలు కూడా ఎన్నికల ప్రచార సభలే కావడం విశేషం. 1999లో కరీంనగర్ బైపాస్‌రోడ్డు ప్రాంతంలోని మైదానంలో, గోదావరిఖనిలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభల్లో రాహుల్‌గాంధీతో కలిసి పాల్గొన్నారు. ఆ తరువాత 2004 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో తొలిసారి సభ నిర్వహించారు. 2009లో ఇదే అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సభలో సోనియా పాల్గొన్నారు. ముచ్చటగా మూడోసారి ప్రస్తుతం అదే స్టేడియం నుంచి సోనియాగాంధీ ప్రచార శంఖారావాన్ని పూరించనున్నారు. 2009లో అంబేద్కర్ స్టేడియం మైదానం నుంచే తెలంగాణకు అనుకూలమని ప్రకటన చేసినందున, సెంటిమెంట్‌గా సోనియా సభకు అదే మైదానాన్ని ఎంచుకున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement