పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ | Sakshi
Sakshi News home page

పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ

Published Fri, Apr 25 2014 1:32 AM

పాతబస్తీకి ప్రత్యేక ప్యాకేజీ - Sakshi

చంద్రబాబు పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పాతబస్తీని వైఎస్ ఎంతగానో అభివృద్ధి చేశారు. ప్రత్యేక నిధులు కేటాయించారు. నిజాం కాలంనాటి డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరించడానికి ప్రత్యేక చొరవ చూపారు. 2009లో వైఎస్ రెండోసారి అధికారంలోకి రాగానే  పాతబస్తీలో పలు దఫాలుగా పర్యటించి అభివృద్ధి కోసం రూ.రెండువేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ఫలితంగా అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సీసీరోడ్లు, రహదారులు, ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు, మంచినీటి రిజర్వాయర్లు, పైప్‌లైన్లు, పాఠశాలల భవనాలు.. తదితర ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పాతబస్తీలో డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం కిర్లోస్కర్ నివేదిక మేరకు వైఎస్ రూ.800 కోట్లు కేటాయించారు. వెటర్నరీ ఆస్పత్రి ఏర్పాటు చేయడంతో పాటు స్కూలు భవనాల కోసం రూ.20 కోట్లు మంజూరు చేశారు. అలాగే అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులను, 11 సబ్‌స్టేషన్లను మంజూరు చేశారు. చాంద్రాయణగుట్ట, లంగర్‌హౌజ్, ఉప్పుగూడ ఫ్లైఓవర్లను వైఎస్ హయాంలోనే మంజూరు చేశారు.
 
 ఫ్లై ఓవర్‌కు పాతర
 సికింద్రాబాద్- బేగంపేట ప్రాంతంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రసూల్‌పురాలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని పీవీఘాట్ వరకు రూ.35కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మాణానికి వైఎస్ శ్రీకారం చుట్టారు. ఇందుకయ్యే వ్యయాన్ని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీలు సమానంగా భరించాలని అప్పట్లో నిర్దేశించారు. అయితే... వైఎస్ అకాల మృతితో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసింది. శిలాఫలకం ఆనవాళ్లు కూడా లేకుండా తొలగించడం ప్రభుత్వ పెద్దల దుర్మార్గానికి నిదర్శనం.
 
 కలగానే బస్ టెర్మినళ్లు
 ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను నగరంలో రోడ్ల వెంట పార్క్ చేస్తుండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గమనించిన వైఎస్ మియాపూర్‌లో ఇంటర్ బస్ టెర్మినల్, ఔటర్‌పై మూడుచోట్ల ట్రక్‌పార్కులు ఏర్పాటు చేయాలనుకున్నారు. వీటికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయినా తర్వాతి ప్రభుత్వాల తీరు వల్ల ఆ ప్రాజెక్టులు ఇంత వరకు పట్టాలపైకి ఎక్కలేకపోయాయి.

Advertisement
Advertisement