ఇంటి పేరు శ్రీరాం.. చేసేది ఫ్యాక్షనిజం.. | Sakshi
Sakshi News home page

ఇంటి పేరు శ్రీరాం.. చేసేది ఫ్యాక్షనిజం..

Published Tue, May 6 2014 8:32 AM

ఇంటి పేరు శ్రీరాం.. చేసేది ఫ్యాక్షనిజం.. - Sakshi

నేరచరితులకు ‘తాతయ్య’

 వెన్నుపోటులో చంద్రబాబుకు తమ్ముడే..

 అక్రమాల్లో సోదరుల అండ

సాక్షి, విజయవాడ : ఆయన ఇంటి పేరు శ్రీరాముడు.. రామచంద్రుడంతటి గొప్ప పాలనాదక్షుడనుకుంటే ‘తప్పు’లో కాలేసినట్లే. ఆనాడు మాటకోసం శ్రీరాముడు పదవిని తృణప్రాయంగా త్యజిస్తే.. ఈనాడు శ్రీరాం రాజగోపాలుడు పదవి కోసం ఎంతటి పని చేయడానికైనా వెనుకాడడని ప్రతీతి. మున్సిపల్ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా తన స్వార్థమే తప్ప ప్రజల కష్టసుఖాలు పట్టించుకోని నాయకుడని తెలుగు తమ్ముళ్లే చెప్పుకొంటుంటారు.

తనను రాజకీయంగా పైకి తీసుకొచ్చిన సామినేని ఉదయభానునే వెన్నుపోటు పొడిచి చంద్రబాబుకు రాజకీయ తమ్ముడిని అనిపించుకున్న ‘ఘనుడు’. ఒక్కసారి ఎమ్మెల్యే పదవి రుచిచూశాక తన తమ్ముడి సాయంతో నియోజకవర్గంలో భయభ్రాంతులు సృష్టిస్తూ రెండోసారి ఎమ్మెల్యే కావాలని కలలు కంటున్నాడు. ఆయన అరాచక రాజకీయాలు గమనిస్తున్న నియోజకవర్గ వాసులు ఈసారి తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు.

ప్రజాకంటక పాలనలో కొన్ని నిజాలు...

తన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఉనికే ఉండకూడదని శ్రీరాం తాతాయ్య భావించారు. ఈ సమయంలో నవాబుపేట సర్పంచ్ గింజుపల్లి వీరయ్య స్థానిక శివాలయంలో అత్యంత పాశవికంగా హత్యకు గురయ్యారు. ఈ హత్య కేసులో శ్రీరాం తాతాయ్య సోదరులు శ్రీరాం ధనుంజయ (చిన్నబాబు), శ్రీరాం బదరీనారాయణ నిందితులు. వీరిద్దరిని ముద్దాయిలుగా తప్పించేందుకు ఎమ్మెల్యేగా తనకున్న పరపతిని ఉపయోగించారని నవాబుపేట గ్రామస్తులు నమ్ముతున్నారు. వీరయ్య హత్యకేసులో మొదటి నిందితుడుగా ఉన్న చిన్నబాబు సినిమా ఫక్కీలో ఏడాది పాటు నియోజకవర్గం నుంచి కనుమరుగయ్యాడు. పరిస్థితులు చక్కబడిన తరువాత తిరిగి నియోజకవర్గంలో కాలుపెట్టాడు.
 
పాతికేళ్ల కిందట జయరాజ్ అనే దళితుడిపై స్వయంగా దాడి చేసిన తాతయ్య అతని తల పగలగొట్టి హత్యాయత్నం చేయడం అప్పట్లో పట్టణంలో సంచలనం సృష్టించింది. ఈ తరహా దాడులతోనే చివరికి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారని నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చర్చించుకుంటారు.
 
దళిత నాయకులు ఆలేటి రాజారావు, కనపర్తి బాబు, సేతు, గోపిలను హత్యచేసిన వారికి రాజకీయ ఆశ్రయం కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి.సినీనటుడు పవన్‌కల్యాణ్ అభిమాని బసవల వెంకటేశ్వరరావు అలియాస్ కొండ.. తొర్రగుంటపాలెంలో దారుణ హత్యకు గురైన ఘటన వెనుక రాజకీయ నేపథ్యం ఉందనేది బహిరంగ రహస్యమే. తన మాటలు వినని ఇతర పార్టీ నేతలను, పోలీసు అధికారులను వేధించడం ఆయనకు వెన్నతోపెట్టిన విద్య. జిల్లాలో పేకాట క్లబ్‌లను పోలీసులు అనేక సంవత్సరాల క్రితమే నిషేధించినా ఆయన తన కనుసన్నల్లో అక్రమంగా యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నిర్వాహకుల నుంచి లక్షల రూపాయల్లో మామూళ్ల వసూలు అందరికీ తెలిసిన విషయమే. తన పదవిని అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టించేందుకూ వెనుకాడని నైజం ఆయనది. ఈ నేపథ్యంలోనే ఆయన మాటలు విన్న స్థానిక ఎస్‌ఐ, సీఐలు సస్పెన్షన్‌కు గురవడం గమనార్హం.
 
అక్రమార్జనలో సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలనూ వదిలిపెట్టరని ప్రతీతి. ప్రతి ఫ్యాక్టరీకీ ఒక రేటు ఫిక్స్ చేస్తారని, ఏటా వాటినుంచి మామూళ్లు వసూలు చేస్తారని, చందాలు ఇవ్వని యాజమాన్యాలపై కార్మికులను ఉసిగొల్పుతారని విమర్శలు ఉన్నాయి. కార్మికులకు, యజమానులకు మధ్య సయోధ్య కుదుర్చుతున్నట్లుగా నటించి కోట్లు వెనుకేసుకోవడం ఆయన సోదరులకు వెన్నతో పెట్టిన విద్య. తన అనుచరులకు బినామీ కాంట్రాక్టులు ఇప్పించి అందులోనూ వాటాలు దండుకోవడంలో సిద్ధహస్తుడు. వత్సవాయి మండలం భీమవరం వద్ద కొంగర మల్లయ్య గట్టును తవ్వి నూతనంగా నిర్మించిన హైవే రోడ్డు విషయంలోనూ ఆయనకు కోట్ల రూపాయలు ముట్టినట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement
Advertisement