Sakshi News home page

ఏ పార్టీ కోసం పనిచేసినా కఠిన చర్యలు

Published Thu, Apr 10 2014 1:17 AM

ఏ పార్టీ కోసం పనిచేసినా కఠిన చర్యలు

ఉద్యోగులకు భన్వర్‌లాల్ హెచ్చరిక పోలింగ్ సమయం
సాయంత్రం 6 గంటల వరకు పెంపు
ఈ నెల 12 నుంచి సీమాంధ్రలో  నామినేషన్లు ప్రారంభం
సమాంధ్రల లో నామినేషన్లకు ఐదు రోజులే, మిగతా మూడు రోజులు సెలవులే
లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కుడి చేతి చూపుడు వేలుకు ఇంక్

 
 
 కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా పరోక్షంగా పనిచేసినా అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరిగే తెలంగాణ, అలాగే మే 7వ తేదీన పోలింగ్ జరిగే సీమాంధ్రలోని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో షామియానాలను వేస్తామన్నారు. ఎండకు ఓటర్లు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. నక్సలైట్ ప్రభావిత నియోజకవర్గాలు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించినట్లు చెప్పారు. ఆయన బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపిన మరికొన్ని వివరాలు...
 
ప్రతి పోలింగ్ కేంద్రంలో మంచినీరు, విద్యుత్, టాయిలెట్, ర్యాంపు సౌకర్యాలతో పాటు ఓటర్లు ఎండబారిన పడకుండా షామియానాలు ఏర్పాటు. పోలింగ్ సమయం కూడా గతంలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే ఉంది. ఇప్పటి ఎన్నికల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.
 
సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది. అప్పటినుంచి ఈ నెల 19వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. అయితే 19వ తేదీ వరకు నామినేషన్లను సమయం ఉన్నప్పటికీ మధ్యలో మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ సెలవుల్లో నామినేషన్లు స్వీకరించరు. దీంతో సీమాంధ్రలో నామినేషన్ల స్వీకరణ ఐదు రోజులే ఉంటుంది. 13వ తేదీ ఆదివారం, 14వ తేదీ అంబేద్కర్ జయంతి, 18వ తేదీ గుడ్‌ఫ్రైడే సెలవులు వచ్చాయి.
  లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లకు కుడి చేతి చూపుడు వేలుపై ఇంక్ మార్క్ వేస్తారు. ఈ ఇంక్ మార్క్ పోలింగ్ బూత్ నుంచి బయటకు వచ్చేవరకు చెరిపేయకుండా చూస్తారు.
 
రాష్ట్రవ్యాప్తంగా 1800 ఫ్లయింగ్ స్క్వాడ్స్ పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు రూ.90 కోట్ల నగదు, 70 కేజీలు బంగారం, 290 కేజీల వెండి, 3,11,764 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నాయి.

  తెలంగాణలో మార్చి నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి సీమాంధ్రలో ఈ నెల 9వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ పోలింగ్ తేదీలకు ముందే ఓటర్ స్లిప్‌లతో పాటు, గుర్తింపు కార్డులు జారీ చేస్తారు. పోలింగ్ రోజు ఓటర్లు గుర్తింపు కార్డు, ఓటర్ స్లిప్‌లతో పాటు కమిషన్ పేర్కొన్న మరో 16 రకాల కార్డులను చూపించి ఓటు వేయవచ్చు.
 

Advertisement
Advertisement