సమయానికి మించి రోడ్‌షో | Sakshi
Sakshi News home page

సమయానికి మించి రోడ్‌షో

Published Tue, Apr 22 2014 2:28 AM

TDP Election code violation complaint ysrcp leaders

 నరసన్నపేట, న్యూస్‌లైన్ : నరసన్నపేట నియోజకవర్గం పరిధిలో సోమవారం సినీ నటుడు, టీడీపీ నేత బాలకృష్ణ నిర్వహించిన రోడ్‌షో నిర్దేశిత సమయానికి మించి కొనసాగింది. ఈ విషయమై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్ ప్రతినిధి శాస్త్రి్గ రిటర్నింగ్ అధికారి తనూజారాణి, ఎస్పీ నవీన్ గులాఠీలకు ఫిర్యాదు చేశారు. నిర్దేశిత సమయం తర్వాత కూడా రోడ్‌షో కొనసాగినా కాన్వాయ్ వెంట ఉన్న ఎన్నికల పరిశీలకులు పట్టించుకోకపోవటం గమనార్హం. వాస్తవానికి బాలకృష్ణ రోడ్‌షోను సాయంత్రం 4 గంటలకల్లా ముగించాలి. కానీ 4.20 గంటల వరకు ఉర్లాంలో కొనసాగింది.
 
 రోడ్‌షో సమయానికి మించి కొనసాగే పరిస్థితి కనిపిస్తోందని మధ్యాహ్నం 3 గంటలకే కృష్ణదాస్ ప్రతినిధి శాస్త్రి ఆర్‌వో తనూజారాణికి తెలిపారు. బాలకృష్ణ కాన్వాయ్ వెంట ఇద్దరు ఎన్నికల పరిశీలకులు ఉన్నారని, గడువులోగా రోడ్‌షో ముగిసేలా వారు చూస్తారని ఆమె చెప్పారు. 4.20 గంటలకు కూడా రోడ్‌షో కొనసాగటంతో ఈ విషయాన్ని శాస్త్రి ఆర్‌వో, ఎస్పీలకు తెలిపారు. వారి సూచన మేరకు స్పెషల్ బ్రాంచ్ సీఐ సతీష్‌కుమార్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ విషయమై శాస్త్రి విలేకరులతో మాట్లాడుతూ సమావేశ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నామని, వారి వివరణ వచ్చాక కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తామని ఆర్‌వో తమకు చెప్పారని వెల్లడించారు. కోడ్ ఉల్లంఘనపై వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్‌కు ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారని తెలిపారు.
 

Advertisement
Advertisement