కోట్ల నోట్లతో.. బేరసారాలు | Sakshi
Sakshi News home page

కోట్ల నోట్లతో.. బేరసారాలు

Published Fri, May 2 2014 12:38 AM

కోట్ల నోట్లతో..  బేరసారాలు - Sakshi

  •  ఓటమి భయంతో టీడీపీ బరితెగింపు
  •  ద్వితీయశ్రేణి నేతల కొనుగోలుకు యత్నం
  •  పలుచోట్ల ప్యాకేజీల ఆఫర్‌తో ఊరింపు
  •  అయినా పాచిక పారక.. నిరాశానిస్పృహలు
  •  తెలుగుదేశం విలువలకు నిస్సిగ్గుగా వెల కడుతోంది. విచ్చలవిడిగా కోట్లను కుమ్మరిస్తూ జిల్లాలో ఎన్నికల పోరును తనకనుకూలంగా మలచుకోవాలని ఆరాటపడుతోంది. ‘ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు.. మీరు బయటకు రాకపోయినా ఫర్వాలేదు.. మీ రేటెంత?’ అంటూ వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయశ్రేణి నేతలతో బేరసారాలు సాగిస్తూ.. బరి తెగిస్తోంది. ‘డబ్బుంటే కొండ మీది కోతినైనా కిందికి దింపవచ్చు’ అన్న సామెత చందంగా.. కోట్లు కుమ్మరిస్తే చాలు.. గెలుపు వచ్చేస్తుందన్న ఆ పార్టీ నమ్మకం వమ్ము అవుతోంది.
     
    సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాలో రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు నియోజకవర్గాలు, ముమ్మిడివరం, మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు కోట్ల రూపాయలను కుమ్మరించేస్తున్నారు. జిల్లాలోని ఎస్సీ, బీసీ వర్గాలు మొదటి నుంచీ వైఎస్సార్ కాంగ్రెస్‌పై మంచి ఆదరణ చూపిస్తున్నాయి. బలమైన కాపు సామాజికవర్గానికి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక పార్లమెంటు, ఎనిమిది అసెంబ్లీ స్థానాల్ని కేటాయించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలోనే జగన్ కూడా కాపులకు ప్రాధాన్యం ఇవ్వడంతో కోనసీమలోని ఆ సామాజికవర్గం నుంచి వైఎస్సార్ సీపీకి వలసలు ముమ్మరమయ్యాయి. బలమైన సామాజికవర్గాలన్నీ మొగ్గు చూపడంతో దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ బలీయమైన శక్తిగా మారింది. పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో ఈ పరిణామాలన్నింటినీ బేరీజు వేసుకుంటున్న టీడీపీ.. వైఎస్సార్ సీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో అన్ని రకాల ప్రలోభాలకూ తెగబడుతోంది.
     
     రాజమండ్రిలో పంపిణీకి దిగిన ‘పచ్చ’దండు    
     రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గంలో గత సార్వత్రిక ఎన్నికలప్పుడు ప్రత్యేకంగా రప్పించుకున్న ‘పచ్చదండు’తో టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ కోట్లు కుమ్మరించినా జనాభిమానం ముందు ఓటమి తప్పలేదు. గత అనుభవం స్పష్టంగా కనిపిస్తున్నా ఈ ఎన్నికల్లో కూడా అదే పంథాలో వెళ్లేందుకు ఆ పార్టీ వెంపర్లాడుతోంది. హైదరాబాద్ నుంచి రప్పించిన ‘పచ్చదండు’లో ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు పాతిక మందిని వినియోగిస్తూ, వారితోనే పంపకాలకు శ్రీకారం చుట్టారని తెలియవచ్చింది. ఇక అమలాపురం ఎంపీ అభ్యర్థి పండుల రవీంద్రబాబు కనీసం ఆ పార్టీ శ్రేణులకే తెలియని వింత పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన మాటల కంటే నోట్లనే నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. అన్నీ తానై చూసుకుంటున్న ఒక కార్పొరేట్ దిగ్గజం అండతో ప్రతి సెగ్మెంట్‌కూ ఏడెనిమిది కోట్లుపైనే కుమ్మరిస్తున్నారని తెలుస్తోంది.
     
     పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు లక్ష్యంగా నేతల కొనుగోలుకు బరితెగిస్తోంది. కోనసీమలో ఒక బలమైన నాయకుడు బరి నుంచి తప్పుకొనేందుకు భారీ ప్యాకేజీ ఇవ్వజూపినట్టు తెలుస్తోంది. ఇదే పంథాను ముమ్మిడివరం, రాజోలు, కొత్తపేట, మండపేట నియోజకవర్గాల్లో టీడీపీ అనుసరిస్తోంది. పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ మారిన రాజకీయ సమీకరణలతో వైఎస్సార్ సీపీ బలమైన శక్తిగా మారింది. ఇదే విషయాన్ని జాతీయస్థాయి సర్వే నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులే లక్ష్యంగా టీడీపీ ప్రలోభాలకు తెరతీసింది. గత మూడు రోజులుగా టీడీపీ నేతలు వైఎస్సార్ సీపీ ద్వితీయశ్రేణి నాయకులను ప్రలోభ పెట్టాలని ప్రయత్నించి, బోర్లాపడింది.
     
     విధం చెడ్డా.. దక్కని ఫలితం
    ముమ్మిడివరం నియోజకవర్గంలో వివిధ వర్గాల ఆదరణ, మారిన రాజకీయ సమీకరణలతో వైఎస్సార్ సీపీ అభ్యర్థి గుత్తుల సాయి ముందంజలో ఉన్నారు. ఈ పరిణామంతో బెంబేలెత్తిపోతున్న టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు విచ్చలవిడిగా డబ్బు కుమ్మరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో ఒక వర్గానికి చెందిన 70 మంది ప్రతినిధులకు భారీ ప్యాకేజీ ఆఫర్ చేశారని నియోజకవర్గం కోడై కూస్తోంది. ఆ ఆఫర్‌ను ఆ వర్గాల ప్రతినిధులు నిర్ద్వంద్వంగా తిరస్కరించడంతో కంగుతిన్న టీడీపీ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. మండపేటలో కూడా దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైఎస్సార్ సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ  ముందు.. టీడీపీ కుప్పిగంతులు సాగడం లేదు.
     
    రామచంద్రపురం, కొత్తపేట నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పోకడను అనుసరించబోయిన టీడీపీ నేతలకు తలబొప్పి కట్టిందంటున్నారు. నిన్నమొన్నటి వరకు అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్‌ను వీడి పలువురు నేతలు.. టీడీపీ పంచన చేరడంతో ఎదురవుతున్న ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు ఇక్కడ కూడా ప్యాకేజీల జాతరకు తెరతీసింది. సామాజికవర్గాల నేతలకు ఎర వేసే ప్రయత్నాలు ఈ రెండుచోట్లా తీవ్ర వ్యతిరేకతను మూట గట్టుకునేలా చేస్తున్నాయి. నామినేటెడ్ పోస్టులు, కాంట్రాక్టులు ఇస్తామని ఊరిస్తున్నా వారి మాటలను ఎవరూ విశ్వసించకపోవడంతో.. టీడీపీ పని విధం చెడ్డా ఫలం దక్కని బాపతుగా మిగులుతోంది.

Advertisement
Advertisement