రౌడీయిజం.. మోసమే నైజం | Sakshi
Sakshi News home page

రౌడీయిజం.. మోసమే నైజం

Published Fri, May 2 2014 1:28 AM

tdp leaders settlements

  •  దెందులూరులో చింతమనేని దందాలు
  •  సెటిల్‌మెంట్ల కింగ్ ఏలూరు అభ్యర్థి బడేటి బుజ్జి     
  •  మోసాల్లో దిట్ట గన్ని వీరాంజనేయులు
  •  ఇతర ప్రాంతాల్లోని అభ్యర్థులపైనా వెల్లువెత్తుతున్న విమర్శలు
  • సాక్షి ప్రతినిధి, ఏలూరు : రౌడీ కార్యకలాపాలు.. మోసాలు.. సెటిల్‌మెంట్లు.. రాజకీయం ముసుగులో జిల్లాలోని టీడీపీ నేతలు చేస్తున్న అరాచకాలివి. వారే ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దిగడంతో ఆయా నియోజకవర్గాల్లో జనం భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి నెలకొంది. తమకంటే గొప్పవాళ్లు లేరని, తమ పార్టీ కంటే గొప్ప పార్టీ మరొకటి లేదని చెప్పుకునే టీడీపీ తరఫున కొందరు అరాచకవాదులు ఎన్నికల బరిలో ఉండడం గమనార్హం. వారి అరాచకాలను ఎప్పటికప్పుడు కప్పిపుచ్చుతూ వచ్చిన టీడీపీ అధిష్టానం చివరకు వారినే ఎన్నికల్లో పోటీ చేయిస్తోంది.చింతమనేని దౌర్జన్యకాండ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అరాచకాలు అన్నీఇన్నీ కావు. ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో అధికార యంత్రాగాన్ని ఆయన భయభ్రాంతులకు గురిచేశారు.

    గ్రామస్థాయి ఉద్యోగి నుంచి జిల్లాస్థాయి అధికారుల వరకూ అందరిపైనా జులుం ప్రదర్శించారు. అనేక పనులకు సంబంధించిన కాం ట్రాక్టులను సొంత మనుషులతో చేయించి బిల్లుల కోసం అధికారులపై దౌర్జన్యం చేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. పోలవరం ఎడమ కాలువ గట్టు నుంచి గ్రావెల్, తమ్మిలేరు నుంచి ఇసుకను రోడ్లు ఇతర పనులకు వాడిన ఆయన ఆ తర్వాత వాటికి బిల్లులు చేయించుకుని జేబులో వేసుకున్నారు. పలుమార్లు అధికారులను కొట్టి గాయపరిచిన ఉదంతాలున్నాయి. ఏడాది క్రితం పెదవేగిలో ఎస్సైపై దాడి చేశారు. ఇటీవలే అధికారులను దుర్భాషలాడటంతో నియోజకవర్గంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఆయనకు ఎదురుతిరిగారు. వారినీ ఆయన ఇష్టానుసారం తిట్టారు. తన అరాచకానికి ఎదురుతిరిగిన వారిపై దాడి చేయడం, కొట్టడం ఆయన నైజంగా మారింది. ఇలాంటి వ్యవహారాల్లోనే ఆయనపై లెక్కకు మిక్కిలిగా కేసులున్నాయి.

    ఇప్పటికే అనేకసార్లు అరెస్టు కూడా అయ్యారు. ఆయన్ను భరించలేక ఆ నియోజకవర్గం నుంచి పలువురు అధికారులు సెలవుపై వెళ్లిపోయారు. కొంతమంది బదిలీలు చేయించుకుని ఆయనకూ దూరంగా పారిపోయారు. ఆయన అండ చూసుకుని గ్రామాల్లో చింతమనేని అనుచరులు రెచ్చిపోయి ఆగడా లు చేయడం కూడా సర్వసాధారణమే. ఆయన మరోసారి ఎమ్మెల్యే అయితే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయని జనం భయపడుతున్నారు. టీడీపీలోనే అనేక మంది చింతమనేని రౌడీ రాజకీయాలపై అసంతృప్తితో ఆయనకు దూరమై అతనికి సీటివ్వొదని అధిష్టానంపై ఒత్తిడి తెచ్చారు. అయినా చంద్రబాబు అరాచకానికే ఓటువేసి చింతమనేనికి సీటిచ్చారు.
     
     సెటిల్‌మెంట్ల కింగ్ బుజ్జి
     ఏలూరు టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న బడేటి బుజ్జిపై అనేక ఆరోపణలున్నాయి. సెటిల్‌మెంట్ల కింగ్‌గా ఆయన పేరుగడించారు. బుజ్జి బారినపడి అనేక మంది అష్టకష్టాల పాలయ్యారనే విషయం ఏలూరులో బహిరంగ రహస్యం. వివాదాలున్న స్థలాల వ్యవహారాల్లో తలదూర్చి వాటిని సెటిల్ చేసే పేరుతో సామాన్యులను ఇబ్బందిె పట్టడం, వారి ఆస్తులను దోచుకోవడం లేదా ఇతరుల పరం చేయడం ఆయన నైజం. ఏలూరు వన్‌టౌన్‌లోని చాలామంది వ్యాపారులు బుజ్జి పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారు. మునిసిపల్, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ ప్రత్యర్థులను బెదిరించి లొంగదీసుకోవడానికి ఆయన విశ్వప్రయత్నాలు చేశారు. తన మాట వినలేదని పలువురిపై దాడులు కూడా చేయించారు. ఏ పదవీ లేకుండానే ఇంత అరాచకం చేసిన బుజ్జి ఎమ్మెల్యే అయితే తాము బతకలేమనే చర్చ నగరంలో చాలాకాలం నుంచే జరుగుతోంది. కొద్దినెలల క్రితం విజయవాడలోని ఒక ఇంట్లో వ్యభిచారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన ఆయన ఊచలు కూడా లెక్కబెట్టారు. ఈ కేసును ఎలాగోలా మాఫీ చేసుకున్నా ఆయన వ్యవహార శైలి మాత్రం నగరంలో అందరికీ అర్థమైపోయింది. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేస్తుండడం విశేషం.
     
     ‘రియల్’ చీటర్
     ఉంగుటూరు టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు గతంలో చీటింగ్ కేసులో అరెస్టయ్యారు. విశాఖపట్నంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించిన ఒక వ్యవహారంలో ఆయనపై చీటింగ్ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు వీరాంజనేయుల్ని అరెస్టు చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు సంబంధించి ఆయనపై అనేక ఆరోపణలున్నాయి. ఆయన అండ చూసుకుని అనుచరగణం కూడా బెదిరింపులు, దాడులకు దిగుతోంది. నాలుగు రోజుల క్రితం భీమడోలు మండలంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కారును టీడీపీ నేతలు ధ్వంసం చేశారు. ఇలా తీవ్రమైన ఆరోపణలున్న వారిని టీడీపీ అభ్యర్థులుగా నిలబెట్టడంతో స్థానికంగా ఆ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అరాచకవాదులకు అవకాశం ఇస్తే అన్నీ అరాచకాలే జరుగుతాయనే భయం ప్రజల్లో కనిపిస్తోంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement