అభివృద్ధి చేశాం..ఆదరించండి | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చేశాం..ఆదరించండి

Published Sun, Apr 27 2014 11:49 PM

అభివృద్ధి చేశాం..ఆదరించండి - Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘మా హయాంలో జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందింది. రూ. ఆరు వేల కోట్లతో ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, వికారాబాద్‌ను శాటిలైట్ సిటీగా ఆధునీకరించాం’ అని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పష్టం చేశారు. పదేళ్లలో జిల్లాలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేశామని, వచ్చే ఎన్నికల్లో మరోసారి ఆదరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం చేవెళ్లలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సోనియా 19 నిమిషాలపాటు ప్రసంగించారు.

 తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన ఘనత మాదేనని, ప్రత్యేక రాష్ట్రం అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. అధికారంలోకివస్తే జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ఉద్ధేశించిన చేవెళ్ల- ప్రాణహిత, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని సోనియా వెల్లడించారు. ఎన్నికల మేనిఫెస్టోలో రూ.40వేల కోట్ల వ్యయంతో ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టాలని ప్రతిపాదించామని, ఇవన్నీ కార్యరూపం దాల్చాలంటే కాంగ్రెస్‌కే ఓటేయాలని స్పష్టం చేశారు.

 టీఆర్‌ఎస్‌పై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించిన సోనియా.. ఆ పార్టీ అధినేత అవకాశవాద, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు మారుపేరు అని విమర్శించారు. ఎవరో చెబితే తెలంగాణ ఇవ్వలేదని, 60 ఏళ్ల పోరాటాన్ని గుర్తించే ఇచ్చామని చెప్పుకొచ్చారు. బహిరంగసభలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ పరిశీలకులు వాయిలార్ రవి, టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రసాద్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పార్టీ అభ్యర్థులను సోనియాకు పొన్నాల పరిచయం చేశారు.

 భారీగా జనసమీకరణ
 సోనియా సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ నాయకత్వం.. భారీగా జనసమీకరణ చేసింది. సుమారు 700 ప్రత్యేక బస్సులతో జిల్లా నలుమూలల నుంచి జనాలను చేవెళ్లకు తరలించారు. ఇటీవల తెలంగాణలో వివిధ చోట్ల జరిగిన అగ్రనేతల సమావేశాలు పేలవంగా జరిగిన నేపథ్యంలో జనసమీకరణపై మాజీ మంత్రి సబిత ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నేపథ్యంలోనే భారీ ఏర్పాట్లను చేశారు.

 పార్టీశ్రేణుల్లో ఉత్సాహం
 ఎన్నికల ప్రచారం ముగింపు వేళ అధినేత్రి ప్రసంగం నూతనోత్తేజాన్ని ఇచ్చింది. తెలంగాణ కోసం పోరాడింది ఎవరో కాదని, మీరే నిజమైన హీరోలని సోనియా పేర్కొనడం శ్రేణుల్లో ఉత్సాహాన్ని పెంచింది. కొన్ని పార్టీలు కల్లిబొల్లి మాటలతో దగా చేసేందుకు ముందుకొస్తున్నాయని, అవి చేసే తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలనే పిలుపునకు కార్యకర్తల నుంచి మంచి స్పందన లభించింది. కాగా, సోనియా రాకమునుపు కొందరు నేతలు చేసిన ఊకదంపుడు ఉపన్యాసాలు ప్రజలను విసుగెత్తించాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement