ఆత్మస్తుతి.. పరనింద | Sakshi
Sakshi News home page

ఆత్మస్తుతి.. పరనింద

Published Wed, Mar 26 2014 4:20 AM

Telugu desham party prajagarjna become fail

 తెలుగుదేశం జిల్లా కేడరుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు సాగించిన ‘ప్రజా గర్జన’ అంత ఊపునివ్వలేదు. టీఆర్‌ఎస్ లక్ష్యంగా సాగించిన ఎదురుదాడి వ్యూహం, బీసీలకు పెద్ద పీట నినాదం కూడా శ్రేణులను కదిలించిన దాఖలాలు లేవు. ఆ పార్టీ నేతలు ఎదుటి పక్షాలపై విరుచుకు పడుతూ చేసిన ప్రసంగాలకూ స్పందన కానరాలేదు. చివరికి బాబు ప్రసంగం వచ్చేసరికి చాలామంది జారుకున్నారు. అంతా కలిపి సభ అయ్యిందనిపించారు మినహా పార్టీ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపలేక పోయారు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : వరుస వలసలతో ఉక్కిరి బిక్కిరవుతున్న పార్టీ శ్రేణుల్లో ఆత్మ విశ్వాసం కల్పించేందుకు ఉద్దేశించిన మహబూబ్‌నగర్ ‘ప్రజాగర్జన’ సభ ‘ఆత్మస్తుతి’, ‘పరనింద’ వ్యూహంతో కొనసాగింది. తెలంగాణలోనే గట్టి పట్టువున్న మహబూబ్‌నగర్‌లో సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ద్వితీయ శ్రేణి కేడర్ ఇతర పార్టీల్లోకి వలస వెళ్తుండటంతో ఎదురు దాడి వ్యూహాన్ని అమలు చేసేందుకు ప్రయత్నించారు. మంగళవారం నాడు నిర్వహించిన సభలో తెలుగుదేశం పార్టీ నేతలు టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా తిట్ల దండకం అందుకున్నారు. తమ్ముళ్లతో గొంతు కలుపుతూ చంద్రబాబు కూడా టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ అభివృద్ది తన వల్లే జరిగిందంటూ పదే పదే చెప్పిన బాబు తెలంగాణ అభివృద్ది టీడీపీ వల్లే సాధ్యమని నొక్కి చెప్పేందుకు యత్నించారు.
 
 తెలంగాణ వాదాన్ని ఎదుర్కొనేందుకు ‘బీసీ ముఖ్యమంత్రి’ నినాదం ఎత్తుగడగా పనికొస్తుందని ఆయన భావిస్తున్నట్లు సభ జరిగిన తీరు స్పష్టం చేసింది. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని ఎత్తుకోవడం ద్వారా టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లను ఇరుకున పెట్టవచ్చని  వ్యూహంగా కనిపిస్తోంది. టీఆర్‌ఎస్ విధానాల్లోని లోపాలను పెద్దవిగా చేసి చూపించడమనే ఎత్తుగడను పార్టీ ఎమ్మెల్యేల ద్వారా చంద్రబాబు ఆచరణలో పెడుతున్నట్లు ప్రజాగర్జన సభ స్పష్టం చేసింది.
 
 ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులును టీఆర్‌ఎస్‌లో విమర్శలు చేయడంలో ముందు వరుసలో చంద్రబాబు మోహరించారు. దమ్ముంటే మహబూబ్‌నగర్ నుంచి మరోమారు పోటీ చేయాలని కేసీఆర్‌కు సవాలు విసరడం ద్వారా పార్టీ శ్రేణులను రెచ్చగొట్టే వ్యూహానికి తెరలేపారు. ‘మొగోడివైతే మహబూబ్‌నగర్ నుంచి పోటీ చేయాలంటూ’ ఎమ్మెల్యే దయాకర్‌రెడ్డి చేసిన సవాలు ఇదే రీతిలో సాగింది. తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలుగుదేశం పాత్ర కూడా వుందని చెప్పేందుకు మోత్కుపల్లి ప్రయత్నించారు. చంద్రబాబు మాత్రం హైదరాబాద్ అభివృద్ది, సాగునీరు, విద్యుత్, సాఫ్ట్‌వేర్ తదితర రంగాల అభివృద్దికి తానే కారణమంటూ చెప్పుకున్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణయ్యకు అత్యంత ప్రాధాన్యమివ్వడం ద్వారా బీసీలకు సీఎం అనే నినాదానికి విస్తృత ప్రచారం కల్పించాలనే ఎత్తుగడ వేశారు.
 
  ముందే జారుకున్న జనం
 ఖమ్మం ప్రజాగర్జనతో తెలంగాణలో ఆరంగేట్రం చేసిన చంద్రబాబు మహబూబ్‌నగర్ సభతో మరింత ఆత్మ విశ్వాసం కూడగట్టుకునే ప్రయత్నం చేశారు. పార్టీకి ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉండటంతో జన సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. జనాన్ని ఓ మోస్తరుగా తరలించగలిగినా సభ పూర్తయ్యేంత వరకు మైదానంలో ఉండేలా చేయడంలో పార్టీ నేతలు విఫలమయ్యారు.
 
 చంద్రబాబు ప్రసంగించే సమయానికే జనం తిరుగు ముఖం పట్టారు. సభ ముగిసే సమయానికి కనీసం వేయి మంది కూడా మైదానంలో కనిపించలేదు. పార్టీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించినా జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. ఎలాగోలా మహబూబ్‌నగర్‌లోనూ సభ జరిపగలిగామనే భావన పార్టీ యంత్రాంగంలో కనిపించింది.
 
 పాలమూరులో పారిశ్రామిక కారిడార్
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహబూబ్‌నగర్ జిల్లాలోని 44 జాతీయ రహదారిని అనుకుని వున్న ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నా యుడు ప్రకటించారు. ‘ప్రజాగర్జన’ పేరిట మహబూబ్‌నగర్ స్టేడియంలో మంగళవారం నిర్వహిం చిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మహబూబ్‌నగర్‌ను మహానగరంలా మార్చేలా ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు. ‘పాలమూరు లేబర్ దేశంలో ఏ ప్రాంతానికి వెళ్లినా కనిపిస్తారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టిన ఘనత మాకే దక్కుతుంది. కృష్ణా డెల్టాను ఆధునికీకరించి బీమా ప్రాజెక్టుకు నీళ్లు ఇచ్చాం.

నెట్టెంపాడు, కోయిలసాగర్‌తో పాటు రామన్‌పాడు తాగునీటి పథకం తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని’ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘తెలుగుదేశం పార్టీ హయాంలోనే వ్యవసాయానికి తొమ్మిది గంటలు కరెంటు ఇచ్చాం. పాలమూరు జిల్లాలో ఇంటికో ఉద్యోగం ఇస్తాం. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, దేవాదుల వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను తెలుగుదేశం పార్టీ ఆచరణలోకి తెస్తుంది. వ్యవసాయ అభివృద్ది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని’ చంద్రబాబు నాయుడు తన ప్రసంగంలో పదే పదే గుర్తు చేశారు.
 

Advertisement
Advertisement