ఈ రోజులు మాకొద్దు.. డొక్కలెండి.. ‘వలస’ బండి | Sakshi
Sakshi News home page

ఈ రోజులు మాకొద్దు.. డొక్కలెండి.. ‘వలస’ బండి

Published Wed, Apr 9 2014 12:28 AM

ఈ రోజులు మాకొద్దు.. డొక్కలెండి.. ‘వలస’ బండి - Sakshi

 తెలుగునేల నుంచి ఎడారి దేశాలకు.. పాలమూరు నుంచి ముంబై..  శ్రీకాకుళం నుంచి సూరత్.. రాయలసీమ నుంచి బెంగళూరు..
 రోజూ వలసలే.. నిత్యకృత్యాలే..  కన్నతల్లి లాంటి పల్లె అన్నం పెట్టలేక మాడిపోవాలా?.. పనులు లేక బతుకులు వాడిపోవాలా?.. ఆరుగాలం కష్టపడ్డా ఐదు వేళ్లూ మూడు పూటలా నోట్లోకెళ్లని స్థితిలోనే బతకాలా?.. కాయకష్టం చేసుకుందామన్నా.. కళ్లెదుట పనేమీ లేకపోతే వలసబాట పట్టాలా?.. ఏ బాయిలో పడలేక, బొగ్గుబాయిలోనూ పనిదొరకక.. ముంబయి, దుబాయి పోవాలా?
 ఉన్న ఊరిని, కన్నవారిని.. కట్టుకున్నదానిని, కడుపున పుట్టినవారిని వదిలేసి వెళ్లాలా?.. అయినవారందరూ ఉన్నా.. ఎవరూ లేని అనాథలా బతకాలా?

కడుపు చేతబట్టుకుని పరాయి రాష్ట్రంలో.. కానివారిలా జీవించాలా?
 పట్టెడన్నం కోసం.. పది రూకల కోసం దేశాలు పట్టిపోవాలా?
 లేక.. బువ్వ కరువై గంజికేడుస్తూ రోజులు వెళ్లదీయాలా?
 కన్నీళ్లు దిగమింగుకుంటూ కడుపులో కాళ్లు పెట్టుకుని కాలం గడపాలా? .

... వద్దు.. వద్దే వద్దు.. ఈ రోజులు మాకొద్దు అంటున్నారు కష్టజీవులు. పేదలను పట్టించుకోని పాలకులు అసలే వద్దంటున్నారు సగటు మనుషులు. ఉన్న ఊరు పచ్చగా కళకళలాడాలి.. పనులు చేసుకుంటూ హాయిగా బతికాలి అంటున్నారు.
 - సాక్షి నెట్‌వర్క్.

Advertisement
Advertisement