‘కోడ్’ సడలింపు | Sakshi
Sakshi News home page

‘కోడ్’ సడలింపు

Published Wed, Apr 23 2014 4:53 AM

The Code of Conduct is a little relaxed.

  • అత్యవసర సమస్యలపై సర్కార్ స్పందించవచ్చు
  • అధికారులతో సమావేశాలకూ అనుమతి
  • మంత్రులు జిల్లాల పర్యటనకు ఓకే
  • ఎన్నికల విధులకు నియమించిన అధికారులతో సమావేశాలొద్దు
  • యథావిధిగా కొనసాగనున్న ప్రభుత్వ కార్యకలాపాలు
  • సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఎన్నికల నియమావళిని కొద్దిగా సడలించారు. పోలింగ్ ముగిసిన సుమారు నెల తర్వాత ఓట్ల లెక్కింపు ఉన్నందున, అప్పటి వరకు నియమావళిని కొనసాగిస్తే అభివృద్ధి పనులు కుంటు పడతాయని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన సీఈసీ నియమావళికి సడలింపునిస్తూ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. దాని ప్రకారం.. కరువు, తాగు నీటి సమస్య, అకాల వర్షం లాంటి అత్యవసర సందర్భాల్లో ప్రభుత్వం తగు చర్యలు చేపట్టవచ్చు.

    అధికారులతో సమావేశాలను కూడా నిర్వహించవచ్చు. శాఖల వారీగా కూడా సమావేశాలను ఏర్పాటు చేసుకోవచ్చు. అత్యవసర పనులను చేపట్టడానికి నియమావళి అడ్డుకాబోదు. మంత్రులు జిల్లాల పర్యటనకు వెళ్లవచ్చు. ఇప్పటికే చేపట్టిన పనుల ప్రగతిపై సమీక్షించవచ్చు. అయితే ఎన్నికల విధులకు నియమించిన అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేయరాదు. నియమావళి వర్తించే విషయాల్లో సైతం అత్యవసరంగా ఏవైనా పనులుంటే, సీఈసీ అంగీకారంతో చేపట్టవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి అనిల్ కుమార్ ఝా తెలిపారు.

    కాగా నియమావళి కారణంగా అభిృద్ధి కుంటు పడుతోందని, కనుక వెంటనే దానిని సడలించాలని ప్రతిపక్ష బీజేపీ కూడా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే తాము కూడా సీఈసీకి లేఖ రాస్తామని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ వెల్లడించారు. ప్రస్తుతం నియమావళి కారణంగా మంత్రులు ఉత్సవ విగ్రహాల్లాగా తయారయ్యారు. అధికారులతో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విశ్రాంతి కోసం ఏకంగా కేరళకు వెళ్లారు. ప్రస్తుత సడలింపు కారణంగా ప్రభుత్వ  కార్యకలాపాలు యథావిధిగా సాగనున్నాయి.

Advertisement
Advertisement