మళ్లీ కుమ్మక్కు రాజకీయాలు | Sakshi
Sakshi News home page

మళ్లీ కుమ్మక్కు రాజకీయాలు

Published Fri, May 2 2014 2:41 AM

The nexus of politics

  • ఎంపీ ఓటు టీడీపీకి వేద్దాం
  •  కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారం
  •  సాక్షి, విజయవాడ : అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీల మధ్య మూడేళ్లుగా సాగుతున్న కుమ్మక్కు రాజకీయాలు ఈ ఎన్నికల్లోనూ అమలవుతున్నాయి. తమ ప్రభుత్వం మూడేళ్లపాటు కొనసాగడానికి సహకరించిన టీడీపీ రుణం తీర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధమవుతున్నారు. లోపాయికారీగా విజయవాడ ఎంపీ సీటుకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ప్రకటించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు సహకారం అందిస్తున్నారు.

    ఎమ్మెల్యే ఓటు తమకు, ఎంపీ ఓటు తెలుగుదేశానికి వేయాలని ప్రచారం చేస్తున్నారు. మూడేళ్లుగా కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం పడిపోకుండా తెలుగుదేశం పార్టీ కాపాడుకుంటూ వచ్చిన సంగతి తెలిసిందే. కిరణ్ సర్కార్ 32 వేల కోట్ల రూపాయల విద్యుత్ చార్జీల భారం ప్రజలపై మోపడాన్ని నిరసిస్తూ మిగిలిన ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వకుండా, టీడీపీ అధినేత విప్ జారీ చేసి మరీ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటువేసి కాపాడిన సంగతి ప్రజలు ఇంకా మరిచిపోలేదు.
     
     2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన చనుమోలు రాజీవ్ కాంగ్రెస్ ఓటింగ్‌ను దెబ్బకొట్టే విధంగా నామినేషన్ వేసి నామమాత్రంగా ప్రచారం చేసి ఊరుకున్నారు.
     
     ప్రస్తుతం అదే పద్ధతిని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అవలంబిస్తున్నారనే ఆరోపణలు సొంతపార్టీ అభ్యర్థుల నుంచే వినిపిస్తున్నాయి.
     
     రాజకీయ ఆరంగ్రేటం చేసి తొలిసారి ఎన్నికల బరిలో దిగినా గెలుపు సాధ్యం కాదు కాబట్టి వైఎస్సార్ కాంగ్రెస్‌ను ఓడించడమే లక్ష్యంగా అనినాష్ పనిచేస్తున్నాని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
     
     తన తండ్రి దేవినేని నెహ్రూ బరిలో ఉన్న తూర్పు నియోజకవర్గంపైనే ఆయన పూర్తి దృష్టిని కేంద్రీకరించి ప్రచారం జరపడం ఈ అనుమానాలను బలపరుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల్లో మొక్కుబడిగానే ప్రచారం జరుగుతోంది.
     
     మైలవరం, తిరువూరు రోడ్‌షోలలో ఒక్కొక్కరోజు పాల్గొనగా, జగ్గయ్యపేట, నందిగామలో కార్యకర్తల సమావేశానికి పరిమితమయ్యారు.
     
     కాంగ్రెస్ అసంతృప్తివాదులను బుజ్జగించడం, వారిని తమకు అనుకూలంగా మార్చుకోవడంపై దృష్టి పెట్టడం లేదు. దీంతో డివిజన్ స్థాయి నాయకత్వం వేరేపార్టీల్లో చేరిపోతోంది.
     
     పశ్చిమ నియోజకవర్గంలో మాజీ మేయర్ మల్లికబేగం తనకు ప్రాధాన్యత దక్కకపోవడంతో అలిగి తెలుగుదేశంలో చేరిపోయారు.
     
     ఎంపీ సీటు కోసం అడిగినపుడు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ వద్ద పార్లమెంట్‌లో గెలుపుకోసం రూ.20 కోట్లైనా ఖర్చు పెడతామని, ఒక్కొక్క నియోజకవర్గానికి కోటి రూపాయలు ఇస్తామని దేవినేని నెహ్రూ, అవినాష్ చెప్పినట్లు సమాచారం.
     
     అయితే ఇప్పుడు నియోజకవర్గ అభ్యర్థులను పట్టించుకోవడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును మినహాయిస్తే మిగిలిన నియోజకవర్గాల్లో బరిలోకి దిగిన అభ్యర్థుల ఆర్థిక స్థితి అంతంత మాత్రమే.
     
     పార్టీ నుంచి, ఎంపీ అభ్యర్థి ఇస్తానన్న డబ్బు అందకపోవడంతో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రచారంలో వెనుకబడిపోయారు. కొన్ని నియోజకవర్గాల్లో మొక్కుబడిగా ప్రచారం చేస్తున్నారు.
     
     ఈ నేపథ్యంలో ఆయా పార్టీల అభ్యర్థులను తెలుగుదేశం నాయకులు కలిసి ఎంపీ ఓటు తమకు వేసేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఇప్పటికే నగరంలో పోటీచేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకరు ఒక ఓటు తనకు, రెండో ఓటు తెలుగుదేశం పార్టీకి వేయాలని ప్రచారం చేస్తున్నారు.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement