కు‘యుక్తులు’ | Sakshi
Sakshi News home page

కు‘యుక్తులు’

Published Thu, Mar 20 2014 3:09 AM

To the 'maneuvers'

సాక్షి ప్రతినిధి, కడప: దశాబ్ధాల తరబడి కత్తులు దూసుకుంటూ ప్రత్యర్థులుగా మెలిగిన నేతలు నేడు ఏకమవుతున్నారు. రాజకీయ అవసరాల కోసం పరస్పర అవగాహనతో ముందుకు సాగుతున్నారు. జనం మెచ్చిన నాయకుడిని నియంత్రించేందుకు దుష్టపన్నాగంలో భాగస్వాములు అవుతున్నారు. వెరసి జిల్లా తెలుగుదేశం పార్టీ మినీ కాంగ్రెస్‌గా మారింది.
 
 తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీ నేతలుగా చలామణి అవుతూ  పరస్పర విరుద్ధబావాలతో పయనించారు. అయితే  ప్రత్యర్థులను నిలువరించడమే లక్ష్యంగా ఎత్తులకు పైఎత్తులు వేస్తూ రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నారు. ప్రజా అవసరాలను  పణంగా ఉంచి  రాజకీయాలే ముఖ్యంగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ఈ నేతలంతా ఏకమవుతూ ప్రజలను మభ్యపెడుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఏకమవుతున్న తీరును విశ్లేషకులు పైవిధంగా భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలుగా ఒకే పార్టీలో ఉంటూ అంతర్గతంగా తీవ్ర విభేదాలతో మెలిగిన నేతలంతా నేడు టీడీపీ గూటికి చేరిపోతున్నారు. కడుపులో కత్తులు దాచుకొని పైకి కౌలిగింతలు చేసుకుంటున్నారని పరిశీలకులు పేర్కొంటున్నారు.
 
 నాటి  అనైతిక బంధం ధ్రుడపడింది...
 తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏర్పడిన అనైతిక బంధం నేటికి ధృడ పడినట్లు  విశ్లేషకులు భావిస్తున్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదారుడుగా దేవగుడి నారాయణరెడ్డి పోటీ చేశారు. అప్పట్లో టీడీపీ పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి సహకరించింది. రాజకీయ ప్రత్యర్థులుగా, బద్ధ విరోధులుగా మెలిగిన టీడీపీ ఎమ్మెల్యే లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి లోపాయికారిగా సహకారం అందించుకున్నారు. ఆనాడు ఏర్పడిన అనైతిక బంధం నేటికి ధృడపడిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజకీయ అవసరాల కోసం ఏకమైన ఆ ఇరువురు నేతలు ప్రజా అవసరాలకు అనుగుణంగా చర్చలు నిర్వహించి ఉంటే ఎంతో కొంత ప్రయోజనం ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు.  కుందూ-పెన్నా వరద కాలువ సమస్యను అంతే శ్రద్ధతో  పరిష్కరించి ఉంటే ప్రొద్దుటూరు పట్టణవాసులకు ప్రయోజనం చేకూరేదని పలువురు పేర్కొంటున్నారు. ఆదిశగా చర్యలు లేకపోగా రాజకీయ అవసరాలకు చేతులు కలపడాన్ని విశ్లేషకులు తప్పుబడుతున్నారు.
 
 రాయుడును వంచించిన వారే...
 తన ఓటమికి ఆ కుటుంబీకులే కారణమని, వారి వంచన కారణంగానే ఓటమి చెందానని మాజీ ఎమ్మెల్యే పాలకొండ్రాయుడు మరో మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్‌రెడ్డి కుటుంబంపై ప్రత్యక్షంగా ఆరోపణలు సంధించారు. ఆ ఇరువురు నేతలు సైతం నేడు ఒకే గొడుగు కిందకు చేరారు. మనస్సునిండా స్పర్థలు ఉంచుకున్న నేతలంతా ఏకమవుతున్న వైనాన్ని గమనిస్తున్న ప్రజానీకం నివ్వెరపోతోంది. చంద్రబాబు కారణంగా వంచించిన వారినే పక్కన ఉంచుకుని పయనించాల్సిన దుస్థితి ఏర్పడుతోందని టీడీపీ సీనియర్ నేత ఒక రు అభిప్రాయపడటం గమనార్హం
 
 మినీ కాంగ్రెస్‌గా  టీడీపీ...
 కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే ఒకరంటే ఒకరికి గిట్టని నేతలు సైతం నేడు టీడీపీ గూటికి చేరిపోతున్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారె డ్డి మధ్య  ప్రకటనల యుద్ధం నడిచింది. ఒకరు దొంగ అంటే మరొకరు గజదొంగ అంటూ దుమ్మెత్తి పోసుకున్నారు. అలాంటి నేతలు సైతం నేడు ఏకతాటిపై నడవనున్నారు.  వారి వారి రాజకీయ అవసరాలే ఇందుకు కారణమని  పలువురు అభిప్రాయపడుతున్నారు.  కాంగ్రెస్ పార్టీకి చెందిన మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, రమేష్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అధికారికంగా చేరాల్సి ఉంది. జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ  ఊగిసలాటలో  ఉన్నారు.  నేతల చేరికతో తెలుగుదేశం  మినీ కాంగ్రెస్ పార్టీని తలపిస్తోంది. ప్రత్యక్షంగా వైఎస్సార్‌సీపీని ఎదుర్కోలేమనే భావనతో ఆపార్టీని నిలువరించడమే  లక్ష్యంగా బద్ధ విరోధులు ఏకమవుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  
 

Advertisement
Advertisement