తొలిపోరు నేడే | Sakshi
Sakshi News home page

తొలిపోరు నేడే

Published Sun, Apr 6 2014 3:24 AM

today first poling

సాక్షి, నెల్లూరు : ప్రచార, ప్రలోభాల పర్వం ముగిసింది. తొలివిడత పరిషత్ సమరానికి తెరలేచింది. జిల్లాలోని 21 మండలాల పరిధిలో జరుగుతున్న తొలివిడత పరిషత్ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. 21 మండలాలకు చెందిన జెడ్పీటీసీ స్థానాలతోపాటు ఆ మండలాల పరిధిలోని 267 ఎంపీటీసీ స్థానాలకుగాను తొమ్మిది స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 258 ఎంపీటీసీ స్థానాలకు మాత్రమే ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 698 మంది అభ్యర్థులు బరిలో నిలవగా, జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందుకోసం 911 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 7,04,671 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 3,47,992 మంది పురుషులు కాగా, 3,56,669 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 10 మంది  ఉన్నారు. తొలి విడత ఎన్నికల కోసం 1,740 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఐదు వేల మందికిపైగా అధికారులు పోలింగ్ నిర్వహణలో పాల్గొననున్నారు.

 ఈ మేరకు అధికారులు పోలింగ్‌కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో 148 అతి సమస్యాత్మక, 158 సమస్యాత్మక, 11 తీవ్రవాదుల అలికిడి ఉన్న పోలింగ్ కేంద్రాలుగా అధికారులు గుర్తించారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు 47 చోట్ల వెబ్‌కెమెరాలు, 152 చోట్ల వీడియోగ్రాఫర్లను నియమించారు. తొలి విడత పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.

 తొలిదశ పోలింగ్...

 జిల్లాలోని ఆత్మకూరు, అనంతసాగరం, అనుమసముద్రంపేట, మర్రి పాడు, సంగం, ఉదయగిరి, సీతారామపురం, వింజమూరు, కావలి, బోగోలు, అల్లూరు, దగదర్తి, జలదంకి, కలిగిరి, వరికుంటపాడు, కొండాపురం, దుత్తలూరు, బుచ్చిరెడ్డిపాళెం, కోవూరు, కొడవలూరు, విడవలూరు, మండలాల పరిధిలో ఎన్నికలు జరగనున్నాయి.

 బరిలో ఉన్న అభ్యర్థులు

 జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 21 మంది పోటీలో ఉండగా టీడీపీకి సంబంధించి 21 మంది బరిలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కేవలం ఆరు చోట్ల మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు రెండు చోట్ల, బీఎస్పీ అభ్యర్థులు నాలుగు చోట్ల, సీపీఎం రెండు చోట్ల, ఇండిపెండెంట్లు 17 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 73 మంది జెడ్పీటీసీ ఎన్నికల బరిలో ఉన్నారు.

ఇక ఎంపీటీసీలకు సంబంధించి 21 మండలాల పరిధిలో వైఎస్సార్‌సీపీ తరపున 255 మంది పోటీలో ఉండగా, టీడీపీ తరపున 243 మంది పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 44 మంది అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. బీజేపీ నుంచి తొమ్మిది మంది, బీఎస్పీ నుంచి నలుగురు, సీపీఐ నుంచి ఐదుగురు పోటీలో ఉండగా, సీపీఎం నుంచి 27 మంది, 111 మంది ఇండిపెండెంట్లు ఎన్నికల బరిలో నిలిచారు. మొత్తం 698 మంది పోటీలో ఉన్నారు.
 
 బ్యాలెట్ వివరాలు...


 జెడ్పీటీసీకి సంబంధించి మొదటి విడత ఎన్నికల్లో 7,85,350 బ్యాలెట్ పేపర్లు సిద్ధం చేయగా, ఎంపీటీసీకి సంబంధించి 7,63,300 బ్యాలెట్ పేపర్లను తొలివిడత ముద్రించి సిద్ధంగా ఉంచారు.

Advertisement
Advertisement