ఓటరు దేవుని తీర్పు నేడే | Sakshi
Sakshi News home page

ఓటరు దేవుని తీర్పు నేడే

Published Fri, May 16 2014 2:21 AM

today general election counting at 8 o'clock

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఉత్కంఠకు నేటితో తెరపడనుంది....సార్వత్రిక ఫలితం కోసం పదహారు రోజుల నిరీక్షణ ముగియనుంది....అయితే, జాతకాలు తేలేసమయం రోజుల నుంచి గంటల్లోకి రావడంతో రాజకీయవర్గాల్లో అంతులేని టెన్షన్ నెలకొంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ ప్రారంభం కానుండడంతో ఫలితం ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో, ఏ పార్టీకి, ఏ అభ్యర్థికి ప్రజలు పట్టం కడతారోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు తెలంగాణలోనే జిల్లా ఫలితంపై జోరుగా చర్చ సాగుతోంది. జిల్లాలో నెలకొన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితుల్లో ఇక్కడి ఫలితంపైనే అందరి అంచనాలు ఉన్నాయి... బెట్టింగ్‌లు జోరుగా సాగుతున్నాయి. మొత్తంమీద ఖమ్మం జిల్లా భావి పాలకులెవరనేది నేడు ఓటరుదేవుడు తేల్చనున్నాడు.

 ఉదయం 8 నుంచి కౌంటింగ్....
 గత నెల 30న  జిల్లాలోని 10 అసెంబ్లీ, రెండు పార్లమెంటు స్థానాలకు జరిగిన పోలింగ్‌కు సంబంధించి కౌంటింగ్ శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరగడంతో మధ్యాహ్నానికి పూర్తిస్థాయి ఫలితాలు వస్తాయని అధికారులు చెబుతున్నారు. అసెంబ్లీ స్థానాలతో పాటే పార్లమెంటు కౌంటింగ్ కూడా ప్రారంభించనున్నారు.

ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ కోసం ఏర్పాటు చేసిన టేబుళ్లపై లెక్కించిన ఈవీఎంలన్నింటిలో ఎంపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి ఒక్కో రౌండ్‌గా పరిగణించనున్నారు. మొత్తం మీద ఖమ్మం పార్లమెంటు ఫలితం అసెంబ్లీలయిపోయిన తర్వాత అర్ధగంటలోపు ఇచ్చేస్తామని అధికారులు చెబుతున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు స్థానానికి మాత్రం ఫలితం అక్కడే ప్రకటించనున్నారు.

 అన్ని పార్టీలకు కీలకం
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో జరిగిన ఎన్నికల ఫలితాలు జిల్లాలో వివిధ ప్రధాన పార్టీలకు కీలకం కానున్నాయి. జిల్లాలో బలంగా ఉన్న వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం, సీపీఐలు భవిష్యత్‌పై గంపెడాశతో ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ ముగిసిన 16 రోజుల తర్వాత ఫలితం వస్తుండడంతో ప్రధాన పార్టీల తరఫున పోటీచేసిన అభ్యర్థులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.

మొన్నటి వరకు గుంభనంగా ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు ఫలితాలొచ్చే సమయం దగ్గరపడుతున్న కొద్దీ గాభరాకు లోనయ్యారు. శుక్రవారం ఉదయం ఫలితాలు రానుండడంతో గురువారం రాత్రి వారికి కాళరాత్రిగానే మిగిలిపోయింది. చిన్నాచితకా పార్టీలు, స్వతంత్రంగా బరిలో ఉన్న వారు కూడా తమకు ఎన్ని ఓట్లు వస్తాయోనని అంచనాల్లో మునిగిపోయారు. అన్ని పార్టీల శ్రేణులు కూడా విజయంపై ఓ వైపు ధీమా వ్యక్తం చేస్తూనే మరోవైపు ఏం జరుగుతుందోననే ఆందోళనలో ఉన్నాయి. మొత్తంమీద వీరి టెన్షన్‌కు శుక్రవారం మధ్యాహ్నం కల్లా తెరపడనుంది.

Advertisement
Advertisement