మలి ‘పోరు’నేడే | Sakshi
Sakshi News home page

మలి ‘పోరు’నేడే

Published Fri, Apr 11 2014 1:34 AM

ఆలూరు: పోలింగ్ బాక్సులను తీసుకెళ్తున్న సిబ్బంది, ఎమ్మిగనూరు: బ్యాలెట్ పత్రాలను సరిచూసుకుంటున్న పీవో, ఏపీవోలు - Sakshi

ఆదోని రెవెన్యూ డివిజన్‌లో పటిష్ట బందోబస్తు
17 మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్
123 సమస్యాత్మక  పోలింగ్ కేంద్రాల గుర్తింపు
 ఇంజనీరింగ్ విద్యార్థులతో వెబ్ కాస్టింగ్

 రెండో విడత ప్రాదేశిక ఎన్నికలకు సర్వం సిద్ధం
 

 కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: మలి విడత ప్రాదేశిక పోరుకు అంతా సిద్ధమైంది. ఆదోని రెవెన్యూ డివిజన్‌లో శుక్రవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలతో సహా అవసరమైన ఎన్నికల సామగ్రి తీసుకొని ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. కర్నూలు, నంద్యాల రెవెన్యూ డివిజన్లలో మొదటి విడత ప్రాదేశిక ఎన్నికలు ఈ నెల 6వ తేదీన పూర్తయిన విషయం విదితమే.

 ఆదోని డివిజన్‌లోని  
 17 జెడ్పీటీసీ, 289 ఎంపీటీసీ స్థానాలకు శుక్రవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల నిర్వహణకు 859 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 123 సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వీటిలో పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు ఇంజనీరింగ్ విద్యార్థులతో వెబ్‌కాస్టింగ్‌ను నిర్వహిస్తున్నారు.



అలాగే 191 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. పోలింగ్ విధుల్లో 4,295 మంది పీఓ, ఏపీఓ, క్లరికల్ సిబ్బంది పాల్గొంటున్నారు. ఆదోని డివిజన్‌ను 50 జోన్లగా విభజించారు. 98 రూట్లను ఏర్పాటు చేశారు. ఈ డివిజన్‌లో పురుషుల కంటే దాదాపు మహిళా ఓటర్లు 2,000 మంది ఎక్కువగా ఉన్నారు. పలు చోట్ల అభ్యర్థుల గెలుపోటముల్లో వీరు కీలక పాత్ర పోషించనున్నారు.

 గట్టి బందోబస్తు..
 ఆదోని, న్యూస్‌లైన్,  రెండో విడత ప్రాదేశిక సమరానికి ఆరుగురు డీఎస్పీలు, 16 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, రెండు వేల మంది పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించనున్నారు. వీరితోపాటు 17స్ట్రైకింగ్ మొబైల్ ఫోర్స్, 98 స్ట్రైకింగ్ ఫోర్స్ బృందాలు పనిచేయనున్నాయి. ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఎన్‌సీసీ కేడెట్స్ సేవలను కూడా వినియోగించుకుంటున్నారు.



ఎన్నికల్లో అల్లర్లు సృష్టించ వచ్చని భావిస్తున్న 2500 మందిపై ఇప్పటికే బైండోవర్ కేసులు బనాయించారు. మరో 53 మందికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. పోలింగ్ రోజున ముఖ్యమైన నాయకులను హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పోలింగ్‌కు రెండు రోజుల ముందే ఆదోని రెవెన్యూ డివిజన్‌లో మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement