ఆమె మెజారిటీ 31 ఓట్లే!! | Sakshi
Sakshi News home page

ఆమె మెజారిటీ 31 ఓట్లే!!

Published Fri, Apr 4 2014 3:53 PM

ఆమె మెజారిటీ 31 ఓట్లే!! - Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో 50 ఓట్ల లోపు మెజారిటీ రావడం ఎప్పుడైనా చూశారా? పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో దిగ్గజ నాయకుడిగా పేరొందిన ఈలి ఆంజనేయులు సతీమణి ఈలి వరలక్ష్మి 50 కంటే కూడా తక్కువ ఓట్ల తేడాతో ఒకసారి ఎన్నికల్లో నెగ్గారు. 1983 సంవత్సరంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈలి ఆంజనేయులు సతీమణి ఈలి వరలక్ష్మి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పసల కనకసుందరరావు పోటీపడ్డారు. అభ్యర్థులు ఇద్దరి మధ్య పోటాపోటీగా ప్రచారం జరిగింది.

ఇక ఓట్ల లెక్కింపు రానే వచ్చింది. గూడెం టౌన్హాల్లో లెక్కింపు జరిగింది. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి (ఎమ్మార్సీ), వంగవీటి రంగా లాంటి ఉద్దండ నాయకులంతా తాడేపల్లిగూడెంలోనే మోహరించారు. చివరి రౌండు వరకు ఉత్కంఠభరితంగా లెక్కింపు జరిగింది. చంద్రబాబు కూడా తణుకులోని షుగర్ ఫ్యాక్టరీ గెస్ట్హౌస్లో ఉండి.. ఇక్కడి ఫలితం ఏమవుతుందా అని ఎదురుచూశారు. టీడీపీ గెలిచిందనే వార్త మొదట్లో బయటకు వచ్చింది. అంతలోనే రీకౌంటింగ్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థిని ఈలి వరలక్ష్మి గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఆమెకు వచ్చిన ఆధిక్యం.. కేవలం 31 ఓట్లు మాత్రమే!!

టీడీపీ అభ్యర్థి పసల కనక సుందరరావుకు 42,031 ఓట్లు రాగా, వరలక్ష్మికి 42,062 ఓట్లు వచ్చాయి. లెక్కింపు సమయంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో అప్పట్లో 144 సెక్షన్ విధించి, ఓవర్ బ్రిడ్జిపై లాఠీఛార్జి కూడా చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement