వెంకయ్యకు రైల్వేశాఖ? | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు రైల్వేశాఖ?

Published Sat, May 24 2014 1:28 AM

వెంకయ్యకు రైల్వేశాఖ? - Sakshi

దత్తన్నకూ ముఖ్యమైన పదవి..
 
 సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకార ముహూర్తం సమీపిస్తున్న నేపథ్యంలో, ఆయన తన మంత్రివర్గంలో ఎవరెవరికి చోటు కల్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. జాబితాకు తుది రూపమిచ్చే పనిలో ప్రస్తుతం మోడీ  తలమునకలుగా ఉన్నట్టు సమాచారం. ఈ విషయమై బీజేపీ అగ్ర నాయకత్వానికి, మోడీకి మధ్య చర్చలు శుక్రవారం ఊపందుకున్నాయి. గురువారం సాయంత్రం హస్తిన చేరుకున్న మోడీ... పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు నేతలు నితిన్ గడ్కరీ, అరుణ్ జైట్లీ, తన సన్నిహితుడు అమిత్ షా తదితరులతో గుజరాత్ భవన్‌లో నాలుగు గంటలకు పైగా చర్చోపచర్చలతో గడిపారు. మోడీ వారందరి సలహాలూ సూచనలూ విన్నారే తప్ప తన మనోగతాన్ని మాత్రం బయట పెట్టలేదని తెలిసింది. ఆరెస్సెస్ నేత రాం మాధవ్ కూడా రాజ్‌నాథ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
 
 గడ్కరీకి పట్టణాభివృద్ధి?
 
 బీజేపీ అగ్ర నేత వెంకయ్య నాయుడుకు కర్ణాటక కోటా నుంచి రైల్వే శాఖ దక్కవచ్చని తెలుస్తోంది. మోడీ సోమవారం ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనుండటం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల్లో అతి కీలకంగా మారిన ఆర్థిక శాఖకు అరుణ్ జైట్లీ, అరుణ్ శౌరి, సుబ్రమణ్యస్వామి పేర్లు విన్పిస్తున్నాయి. విదేశాంగ శాఖ విషయంలో కూడా జైట్లీ పేరు పరిగణనలోకి వస్తున్నట్టు సమాచారం. సుష్మా స్వరాజ్‌కు రక్షణ గానీ, మానవ వనరుల అభివృద్ధి గానీ దక్కుతుందంటున్నారు.
 
 అయితే ‘భద్రతపై కేబినెట్ కమిటీ’లో భాగమైన హోం, ఆర్థిక, విదేశాంగ, రక్షణ వంటి ప్రధాన శాఖల్లో ఒకదాన్ని ఆమె ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. రాజ్‌నాథ్‌ను కూడా మంత్రివర్గంలోకి తీసుకుని హోం లేదా ఇతర కీలక శాఖ అప్పగిస్తారని సమాచారం. ఆయన స్థానంలో జేపీ నద్దా బీజేపీ పగ్గాలు చేపట్టే అవకాశముందంటున్నారు. ఇక బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి పట్టణాభివృద్ధి శాఖ ఇస్తారంటున్నారు. ఇక షానవాజ్ హుసేన్, ముక్తార్ అబ్బాస్ నక్వీలకూ అవకాశం ఖాయమే. ఇక బీజేపీ భీష్ముడు ఎల్‌కే అద్వానీకి ఆయన సీనియారిటీకి తగినట్టుగా లోక్‌సభ స్పీకర్ పదవి గానీ, ఎన్డీఏ కన్వీనర్ పాత్రను గానీ అప్పజెప్పవచ్చు. ఏకంగా 282 లోక్‌సభ సీట్లతో సొంతంగానే మెజారిటీ సాధించినా, మిత్రపక్షాలను కూడా మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తోంది. అందులో భాగంగా టీడీపీ, శివసేన, లోక్ జనశక్తి ఇప్పటికే పలు బెర్తులను ఆశిస్తున్న విషయం తెలిసిందే. పంజాబ్‌లో బీజేపీ మిత్రపక్షమైన అకాలీదళ్ అధినేత, ఆ రాష్ట్ర సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం సుఖ్‌బీర్ బాదల్ కూడా శుక్రవారం రాజ్‌నాథ్‌తో భేటీ అయ్యారు. తమకూ ఓ బెర్తు కావాలని వారు కోరినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వంలో చేరబోమని అకాలీదళ్ ప్రకటించడం విశేషం.
 
 ‘ప్రమాణానికి జోరుగా ఏర్పాట్లు
 
 మోడీ ప్రమాణ స్వీకారానికి ఇంకా ఆహ్వానించాల్సిన వారి వివరాలు తదితరాలపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఆహ్వానితుల జాబితాతో పాటు ప్రమాణ స్వీకారోత్సవ ఏర్పాట్లు తదితరాలపై రాంలాల్, అనంత్‌కుమార్, జేపీ నద్దా వంటి బీజేపీ సీనియర్లు రాష్ట్రపతి భవన్ అధికారులతో చర్చించారు. పార్టీ నుంచి 1,500, ప్రభుత్వం నుంచి 1,500... మొత్తం 3,000 మందిని ఆహ్వానించాలని బీజేపీ భావిస్తోంది. సార్క్ దేశాల సారథులకు ఇప్పటికే ఆహ్వానాలు వెళ్లడం తెలిసిందే. వారితో పాటు ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, పలు పార్టీల అధినేతలు, ఢిల్లీలోని పలు దేశాల రాయబారులు, ఎంపీలు, మాజీ ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల పార్టీ చీఫ్‌లు, మంత్రులు తదితరులను కూడా ఆహ్వానించారు.
 
 రాజపక్సను పిలవొద్దు: తమిళ పార్టీలు
 
 ప్రమాణ స్వీకారానికి శ్రీలంక అధ్యక్షుడు మహింద రాజపక్సను ఆహ్వానించడం వివాదాస్పదంగా మారుతోంది. అన్నాడీఎంకే, డీఎంకే సహా తమిళ పార్టీలన్నీ ఈ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాల్సిందిగా ఎన్డీఏ మిత్రపక్షమైన ఎండీఎంకే అధినేత వైగో మోడీని కలిసి కోరారు.
 
 నిష్కళంకులనే ఎంచుకోండి
 
 సచ్చరితులను, నిష్కళంకులను మాత్రమే మంత్రివర్గంలోకి తీసుకోవాల్సిందిగా ప్రముఖ స్వచ్ఛంద సంస్థలు నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ మోడీకి సూచించాయి. నేర చరితులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వొద్దని కోరాయి. అలాంటి వారిని పార్లమెంటు స్థాయీ సంఘాల్లోకి కూడా తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ఆయనకు లేఖ రాశాయి. కొత్త లోక్‌సభలో 21 శాతం మంది, అంటే 112 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నాయి. రాజకీయాలను నేర చరితుల బారి నుంచి విముక్తం చేస్తానంటూ మోడీ ఇచ్చిన హామీని ఈ సందర్భంగా గుర్తు చేశాయి. 282 మంది బీజేపీ ఎంపీల్లో ఏకంగా 98 మంది (38 శాతం) తమపై క్రిమినల్ కేసులున్నట్టు స్వయంగా ప్రకటించారన్నాయి. వారిలోనూ 63 మంది హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, బందిపోటు దొంగతనం వంటి తీవ్ర అభియోగాలున్నట్టు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశాయి. క్రిమినల్ అభియోగాలున్న లోక్‌సభ సభ్యులు 2004లో 24 శాతముండగా 2009లో 30 శాతానికి, తాజాగా 34 శాతానికి పెరిగారంటూ ఆవేదన వెలిబుచ్చాయి.

Advertisement
Advertisement