ఓట్ల బదిలీ రాజీకీయం | Sakshi
Sakshi News home page

ఓట్ల బదిలీ రాజీకీయం

Published Wed, Apr 30 2014 3:00 AM

Votes transfer politics

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పక్కోడు ఎలా పోతేనేం. మనం గెలవాలి. ఎన్నికల్లో గెలుపే ప్రధానం. ఇందుకు ఎవరితోనైనా ఏ రకమైన ఒప్పందాలైనా చేసుకోవాలి. అవి చీకటి ఒప్పందాలైనా సరే. తెరచాటు ఒప్పందాలైనా ఓ.కే. ఆత్మకూరు, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఇదే సూత్రంతో చెయ్యి(కాంగ్రెస్)కు చేయూతనిచ్చి లోక్‌సభకు ఆ ఓట్లు బదిలీ చేయించుకోవడానికి రెండు పార్టీల మధ్య తెరచాటు మంతనాలు ప్రారంభమయ్యాయి. మాజీ  ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, వివేకానందరెడ్డి,
 నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డికి సన్నిహితుడైన ఒక నాయకుడు ఈ మిలాఖత్ రాజకీయం నడుపుతున్నారు.
 
 మిలాఖత్ ఎందుకంటే..?
 కావలి అసెంబ్లీ టికెట్ మీద గురిపెట్టి అది సాధ్యం కాకపోవడంతో ఆదాల ప్రభాకరరెడ్డి అనివార్యంగా నెల్లూరు లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావాలనుకున్న సమయంలో అంతా బాగుంది. టీడీపీ వెలిగిపోతుంది అనే ఆశ ఆయనలో ఉండేది. అందుకే నెల్లూరు లోక్‌సభ పోటీకైనా సై అనేశారు. టీడీపీలో టికెట్ల కేటాయింపు, పార్టీలో చాపకింద నీరులా సాగుతున్న అసమ్మతి రాజకీయాలు, బీజేపీతో పొత్తు వల్ల ముస్లిం మైనారిటీ ఓట్లు పూర్తిగా దూరమైన సమీకరణలతో ఆదాలకు కళ్లెదుటే సినిమా కనిపిస్తోంది.
 
 నామినేషన్ల దాఖలు కార్యక్రమం ముగిశాక టీడీపీలో ఆవహించిన నైరాశ్యం, ఆ పార్టీ నాయకులు, అభ్యర్థుల మనసుల్లో బయటకు చెప్పలేని భయం, మరో వైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జోరు ఇవన్నీ ఆదాలకు చెమటలు పట్టిస్తున్నాయి. జిల్లాలో ఎవరు ఎలా పోయినా తాను ఎంపీగా గెలిచేందుకు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని భావించిన ఆదాల ఆత్మకూరు అసెంబ్లీ సెగ్మెంట్‌లో ప్రస్తుతం ఉన్న గూటూరు కన్నబాబును మార్చాలని శతవిధాల ప్రయత్నించారు.
 
 అనేక మంది నాయకులకు గాలం విసిరి తాయిలాలు ఆశ చూపారు. అయినా ఫలితం దక్కలేదు. దీంతో అక్కడ కన్నబాబునే అభ్యర్థిగా నిలపాల్సిన పరిస్థి తి తలెత్తింది. ఆత్మకూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి రోజు రోజుకూ జనాల్లోకి చొచ్చుకుని పోతుండటం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద ఎన్ని అవినీతి ఆరోపణలు చేసినా జనం నమ్మక పోవడంతో ఆ నియోజకవర్గం మీద టీడీపీ ఆశలు వదులుకుంది. దీంతో ఇక్కడ అసెంబ్లీకి తమ ఓట్లు కాంగ్రెస్‌కు బదిలీ చేసి లోక్‌సభకు వారి ఓట్లు తమకు బదిలీ చేయించుకునేలా ఆదాలతో సహా టీడీపీ ముఖ్యులు ఆలోచన చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ కలయిక వల్ల ఆత్మకూరులో వైస్సార్‌సీపీని కట్టడి చేయొచ్చనే అంచనాలకు వచ్చినట్లు చెబుతున్నారు.
 
 రూరల్‌లోనూ అంతే
 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బీజేపీకి బలం లేదని టీడీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. ఈ సీటు బీజేపీకి కేటాయించడంతో వైఎస్సార్ సీపీకి బంగారుపళ్లెంలో పెట్టి అప్పగించినట్లేనని టీడీపీ నేతలు అంతర్గత చర్చల్లో స్పష్టంగా చెబుతున్నారు. రూరల్‌లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కమలం వికసించే అవకాశం లేదనీ అందువల్ల తమ వ్యూహమేంటో తాము అమలు చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ కారణంగానే రూరల్‌లో టీడీపీ ముఖ్య నేతలతో పాటు లోక్‌సభ అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి  బీజేపీ అభ్యర్థి సురేష్‌రెడ్డి, ఆ పార్టీ కేడర్‌తో కూడా టచ్‌మీ నాట్‌గానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో కూడా అసెంబ్లీకి తమ పార్టీ ఓట్లు కాంగ్రెస్‌కు, లోక్‌సభకు కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి బదిలీ  తాను  గట్టెక్కే అవకాశాలు ఉండవని ఆదాల గట్టిగా నమ్ముతున్నారు. ఆనం కుటుంబంతో పాటు ఆదాలకు కూడా ఈ పథకం రాజకీయ ప్రయోజనం కలిగిస్తుందనే అంచనాతో రెండు పార్టీలకు సన్నిహితుడైన ఒక నాయకుడిని రంగంలోకి దించారు. తెర చాటుగా సాగుతున్న ఈ వ్యవహారం కొందరు బీజేపీ నేతల చెవిలో పడ టంతో వారు టీడీపీ అధర్మ పొత్తుపై పొగలు కక్కుతున్నారని తెలిసింది. బయటకు ఎక్కడా మాట్లాడక పోయినా తమ పార్టీ రాష్ట్ర, జాతీయ స్థాయి నేతల చెవిలో ఈ సమాచారం వేసి బావురుమంటున్నారని తెలిసింది.
 
 ఆనం సోదరులకూ అనివార్యం
 ఆత్మకూరులో విజయంపై దాదాపు ఆశలు వదిలేసుకున్న మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కనీసం గౌరవప్రదమైన ఓట్లు సంపాదించడానికైనా పోరాడుతున్నారు. మున్సిపల్, ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల్లో అభ్యర్థులు, పార్టీ బాగుగోల గురించి అసలు పట్టించుకోని రామనారాయణరెడ్డికి ఇప్పుడక్కడ సొంత పార్టీ కేడర్ నుంచే నిరసన ఎదురవుతోంది. ప్రజల్లో కూడా కాంగ్రెస్ పట్ల, తన పట్ల కూడా అంత సానుకూల స్పందన కనిపించండం లేదు. పార్టీని పక్కన పెట్టి కనీసం తమ ముఖమైనా చూసి ఈ సారికి సాయం చేయాలని రామనారాయణరెడ్డి ప్రజలను, పార్టీ కేడర్‌ను అభ్యర్థిస్తున్నారు.
 
  నెల్లూరు రూరల్ బరిలో కాంగ్రెస్ అభ్యర్థిగా ఉన్న ఆనం విజయకుమార్‌రెడ్డికి సైతం విజయం మీద ఆశలు ఆవిరయ్యాయి. అయినా ఏదో ఒక విధంగా పోరాడుతున్నందున ఇక్కడ కూడా అసెంబ్లీకి టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు, లోక్‌సభకు కాంగ్రెస్ ఓట్లు టీడీపీకి బదలాయింపు చేసుకోగలిగితే ఇద్దరికీ మంచిదనే నిర్ణయానికి వచ్చారు ఆనం సోదరులు. ఈ కారణంగానే ఆనం, ఆదాలకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తికి వీరు ఓకే చెప్పినట్లు సమాచారం. పోలింగ్‌కు రెండు, మూడు రోజుల ముందు నుంచి ఈ వ్యూహం ఆచరణలోకి తెచ్చేందుకు ఇరువర్గాలు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
 

Advertisement
Advertisement