తాండూరు తుది బరిలో ఎవరో! | Sakshi
Sakshi News home page

తాండూరు తుది బరిలో ఎవరో!

Published Thu, Apr 3 2014 12:34 AM

who victory from tandur

తాండూరు, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తాండూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరనేది ఆసక్తిగా మారింది. బుధవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలైనా అభ్యర్థులను ఖరారు చేయకపోవడమే ఇందుకు ఉదాహరణ. ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచే  పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ అధికారికంగా ప్రకటించకపోవడంతో ఎవరు తుది బరిలో ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల మధ్య పొత్తుల నేపథ్యంలో తుది బరిలో ఎవరు నిలుస్తారనేది ఆసక్తిగా మారింది. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా మహేందర్‌రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది.  

 కాగా గత నెలలో మాజీ మంత్రి, స్వర్గీయ చంద్రశేఖర్ కుమారులు మల్కూడ్ నరేష్, రాకేష్ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలోకి చేరిన విషయం తెలిసిందే. దీంతో నరేష్ టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. కాగా ఆ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాజుగౌడ్ కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో ఆసక్తిగా మారింది. టికెట్ ఎవరికి వచ్చినా కలిసి పని చేస్తామని నరేష్, రాజుగౌడ్ ప్రకటించడం గమనార్హం. ఈ నేపథ్యంలో టీడీపీ, బీజేపీల మధ్య పొత్తు కుదరడంతో తాండూరు సీటు బీజేపీ, టీడీపీలో ఏ పార్టీకి దక్కుతుందనేది సందిగ్ధంగా మారింది.

బీజేపీ నుంచి రాష్ట్ర మాజీ హోంమంత్రి సబితారెడ్డి సోదరుడు నర్సింహారెడ్డి ఇక్కడ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో పొత్తులో ఈ సీటు బీజేపీకి దక్కుతుందా లేదా టీడీపీ తీసుకుంటుందా? అనేది చర్చనీయాంశమైంది. ఇక వైఎస్సార్ సీపీ, ఎంఐఎంతోపాటు వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలు తమ అభ్యర్థులను దించేందుకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement