గులాబీ గాలిలో గెలుపెవరిదో..! | Sakshi
Sakshi News home page

గులాబీ గాలిలో గెలుపెవరిదో..!

Published Thu, May 15 2014 2:53 AM

గులాబీ గాలిలో గెలుపెవరిదో..! - Sakshi

రేపటి ఫలితాలెట్లా ఉంటాయి...? మొన్నటివరకు గెలుస్తామనే ధీమాతో ఉన్న అభ్యర్థులు ఇప్పుడు పునరాలోచనలో పడ్డారు.  ముందస్తుగా వచ్చిన మున్సిపల్ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలతో ప్రధాన పార్టీల అంచనాలు తారుమారయ్యాయి. జిల్లాలో అనూహ్యంగా టీఆర్‌ఎస్ ప్రభంజనంతో కాంగ్రెస్ పార్టీలో కలవరం మొదలైంది. టీడీపీకి చిరునామా కరువైంది. బీజేపీలో కొత్త ఆశలు చిగురించాయి. వరుసగా వెలువడ్డ రెండు ఫలితాల ఆధారంగా... ప్రధాన పార్టీల  ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులందరూ తమ భవితవ్యమేమిటని విశ్లేషించుకుంటున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : పట్టణాలతోపాటు పల్లెల్లో టీఆర్‌ఎస్‌కు ఓటుల పోటెత్తాయి. ఈ తీరు చూస్తే తమ అంచనాలు గల్లంతయ్యే పరిస్థితి కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ తాజా మాజీ ఒకరు అభిప్రాయపడ్డారు. తీర్పు ఇలాగే వెలువడితే గతంలో తమ చేతిలో ఉన్న మూడు అసెంబ్లీ స్థానాల సంఖ్యను నిలబెట్టుకోవటం  కష్టమేనని బాహాటంగా అంగీకరించారు.
 
 స్థానిక ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్లలో పెద్దగా తేడా లేదని... జమిలి ఎన్నికలు కావడం... క్రాస్ ఓటింగ్‌కు అవకాశం ఉండటంతో కొంతమేరకు ఆశించిన ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదని ధీమాతో ఉన్నారు.
 
 మరోవైపు టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నడూ లేనంతగా పుంజుకోవడంతో ఆ పార్టీ శ్రేణుల్లో విజయోత్సాహం ఉరకలేస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికల్లో తాము కూడా ఊహించనన్ని సీట్లు సాధించామని ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే తీర్పు పునరావృతమవుతుందని..  జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలు.. 13 అసెంబ్లీ స్థానాలు క్లీన్‌స్వీప్ చేస్తామంటూ ఎమ్మెల్యే అభ్యర్థులు ధీమాతో ఉన్నారు. జిల్లాలో ఇప్పటికే టీఆర్‌ఎస్‌కు ఏడుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. కేవలం మూడు చోట్ల కాంగ్రెస్, మూడు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలున్నారు. గతంలో బలహీనంగా ఉన్న పట్టణాలు.. పల్లెలన్నింటా ఓటర్లు టీఆర్‌ఎస్‌కు మొగ్గు చూపినట్లు తాజా ఫలితాలు రూఢీ చేశాయి. దీంతో సార్వత్రిక ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ హవా కొనసాగుతుందనే విశ్లేషణలకు బలం చేకూరింది. క్లీన్‌స్వీప్ సాధ్యం కాకున్నా... ఇండిపెండెంట్ అభ్యర్థులు బలంగా ఉన్న రామగుండం, కాంగ్రెస్ తమ సత్తా చాటుకున్న జగిత్యాల నియోజకవర్గాలు తప్ప అన్ని సీట్లు గెలుస్తామని టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
 
 ఏకంగా రాబోయే ప్రభుత్వం తమదేనని, తమలో ఎవరెవరికి మంత్రి పదవులు దక్కుతాయనే దిశగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు తదుపరి ఊహల్లో తేలియాడుతున్నారు. జిల్లాలో తమ గెలుపు లాంఛనప్రాయమేనని భరోసాతో ఉన్నారు. కొత్తగా ఏర్పడే కేబినెట్‌లో ఈటెల రాజేందర్, కొప్పుల ఈశ్వర్, కేటీఆర్‌కు మంత్రి పదవులు వరించి వస్తాయనే చర్చల్లో మునిగి తేలుతున్నారు. ఫలితాల షాక్‌తో పునరాలోచనలో పడ్డ కాంగ్రెస్ పార్టీ కనీసం ఎక్కడెక్కడ గెలిచే అవకాశముందో తేల్చుకోలేకపోతోంది.
 
 మున్సిపల్‌తోపాటు స్థానిక ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేల సొంత ఇలాఖాల్లో టీఆర్‌ఎస్‌కు తిరుగులేని హవా కనిపించింది. ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే కాంగ్రెస్ స్పష్టమైన ఆధిపత్యం చాటుకుంది. అందుకే అక్కడ విజయావకాశం తమదేనని భరోసా వ్యక్తం చేస్తోంది. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కార్పొరేషన్‌తోపాటు సిరిసిల్ల మున్సిపాలిటీ, హుజూరాబాద్, హుస్నాబాద్, జమ్మికుంట నగర పంచాయతీలను టీఆర్‌ఎస్ గెలుచుకుంది. మొత్తం 31 మండలాల్లో ఏకంగా 27 జెడ్పీటీసీలను ఆ పార్టీ కైవసం చేసుకుంది.
 
 దీంతో టీఆర్‌ఎస్ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తున్న చోట... ఈసారి ఎంపీగా ఎవరు గెలుస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీల మధ్య త్రిముఖ పోటీ సాగటంతో.. ఎవరికివారుగా ముగ్గురు అభ్యర్థులు విజయం తమదేననే ధీమాతో ఉన్నారు. దీంతో ఇక్కడి ఫలితం ఆసక్తి రేపుతోంది. పెద్దపల్లి ఎంపీ సీటుకు కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య నువ్వా నేనా అన్నట్లుగా పోటీ జరిగింది. అక్కడి స్థానిక ఫలితాలు సైతం టీఆర్‌ఎస్‌కు మొగ్గు చూపడంతో అక్కడి ఎంపీ సీటు తమదేనని గులాబీ సేన ధీమా ప్రదర్శిస్తోంది. స్థానిక ఎన్నికల వరకు టీఆర్‌ఎస్‌లో ఉన్న సిట్టింగ్ ఎంపీ వివేక్.. తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీకి దిగారు. దీంతో ముందుగా వెలువడ్డ ఫలితాలతో ఒక అంచనాకు వచ్చే అవకాశం లేదని, ఎంపీ సీటును తక్కువ మెజారిటీతోనైనా విజయం సాధిస్తామనే ధీమా కాంగ్రెస్‌లో వ్యక్తమవుతోంది. వేములవాడ నగర పంచాయతీతోపాటు.. ఒక జెడ్పీటీసీ సీటును గెలుచుకున్న బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లోనూ తమకు కలిసి వస్తుందనే అంచనాలు వేసుకుంది.
 
 తమ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చిన కరీంనగర్, వేములవాడ నియోజకవర్గాల్లో ఏదో ఒకటి గెలుచుకోవటం ఖాయమని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నప్పటికీ వరుసగా వెలువడ్డ రెండు ఫలితాల్లోనూ టీడీపీ ఘోర పరాభవాన్ని చవిచూసింది. జిల్లాలో కేవలం ఒక జెడ్పీటీసీ సీటు గెలుచుకుంది. దీంతో సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లోనూ ఆశలు వదులుకుంది.
 

Advertisement
Advertisement