జన ఉప్పెన | Sakshi
Sakshi News home page

జన ఉప్పెన

Published Mon, May 5 2014 3:28 AM

Y.S jagan mohan reddy janabheri tour in Nellore district

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నేపథ్యంలో కావలి పట్టణం జనసంద్రంగా మారింది. నియోజకవర్గం నలుమాలల నుంచి జగన్‌ను చూసేందుకు జనం పోటెత్తారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు జరగాల్సిన సభ  దాదాపు 5 గంటలు ఆలస్యమైనా జనం జగ న్ కోసం ఎదురుచూశారు. సాయంత్రం 4:30 గంటలకు జగన్ హెలికాప్టర్‌లో కావలికి చేరుకున్నారు.
 
 అప్పటికే కావలి వీధులతో పాటు మిద్దెలు, మేడలు జనంతో కిక్కిరిశాయి. మండుటెండను సైతం లెక్కచేయక వృద్ధులు, మహిళలు, యువకులు , చిన్నారులతో పాటు అన్ని వర్గాల వారు జన నేత జగన్‌ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనను చూడగానే జనం కేరింతలు కొట్టారు. పూలతో ఘనస్వాగతం పలికారు.                  
 
 సాక్షి, నెల్లూరు:  జగనన్న జిందాబాద్, ముఖ్యమంత్రి జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో కావలి పట్టణాన్ని హోరెత్తించారు. కిక్కిరిసిన జనాన్ని చూసిన జగన్ హెలిప్యాడ్ నుంచి సభ జరిగే కూడలి వరకూ  కాన్వాయ్‌లో వస్తూ అడుగడుగునా అందరినీ బాగున్నారా అంటూ ఆత్మీయంగా పలకరించారు. ఫ్యాను గుర్తుకు ఓట్లేయాలని విన్నవించారు. అనంతరం బస్టాండ్ సెంటర్‌లో జరిగిన సభలో జగన్ ప్రసంగించారు. జగన్ ప్రసంగం ఆద్యంతం ఉత్తేజపూరితంగా సాగింది. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనపై జగన్ విమర్శల దాడి జనాన్ని ఆలోచింపజేయడంతో పాటు ఉర్రూత లూగించింది. తనను ముఖ్యమంత్రిని చేస్తే అన్నీ ఫ్రీగా ఇస్తానంటున్న చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ఇవన్నీ ఎందుకు చేయలేదంటూ  జగన్ ప్రశ్నలు సంధించారు.
 
 బాబు హయాంలో ఉన్నత విద్య, వైద్యం పేదలకు  ఖరీదుగా మారాయన్నారు.  ఆనాడు ఆయన ఎందుకు పట్టించుకోలేదని జగన్ వేసిన ప్రశ్న జనాన్ని ఆలోచింప చేసింది. కిలో రెండురూపాయల బియ్యాన్ని రూ.5కు పెంచిన ఘనత చంద్రబాబుది కాదా అని జగన్ జనాన్ని ప్రశ్నించారు. అలాగే మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి ఊరూరా బెల్టుషాపులు పెట్టి మహిళల ఉసురుపోసుకున్న వ్యక్తి టీడీపీ అధినేత కాదా అంటూ జగన్ ప్రశ్నలు కురిపించి జనంతోనే సమాధానాలు చెప్పించారు. పేదలు, విద్యార్థులు, వృద్ధులు, మహిళల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని జగన్ ధ్వజమెత్తారు. ఇవాళ అధికారం కోసం సెల్‌ఫోన్లు, టీవీలు, లక్షా 27కోట్ల రుణమాఫీ, 20 వేల కోట్ల డ్వాక్రా రుణాల రద్దు, ఇంటికొక ఉద్యోగమంటూ అమలుకాని హామీలను గుప్పిస్తున్నాడని, తొమ్మిదేళ్ల పాలనలో ఇవన్నీ బాబుకు ఎందుకు గుర్తురాలేదని జగన్ ప్రశ్నించగా ‘బాబు రాష్ట్రాన్ని నాశనం చేశాడు’ అని అంటూ జనం ఈలలు, కేకలతో స్పందించారు. తాను చంద్రబాబులా అబద్ధాలు ఆడనని, విశ్వసనీయతలేని రాజకీయాలు చేయనంటూ జగన్ చెప్పారు. ఎన్నికల తర్వాత బాబు ఉండడు, ఆ పార్టీ ఉండదంటూ పేర్కొనడంతో సభకు వచ్చిన జనం పెద్ద ఎత్తున స్పందించారు.
 
 తాను ముఖ్యమంత్రి కావడం ఖాయమని, ప్రమాణ స్వీకారం రోజే ఐదు సంతకాలు, ఆరు పనులు కలిపి మొత్తం 11 పనులను చేస్తానని చెప్పడంతో జనం ఈలలు, కేకలతో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేశారు. నరేంద్రమోడీకి ఓటేయమని చంద్రబాబు అడుగుతున్నాడని, మనం తెలుగుజాతి ఆత్మగౌరవానికి ఓటేయాలని జగన్ పిలుపునిచ్చారు. 25 పార్లమెంట్ స్థానాలు గెలిచి ప్రధాని కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలో మనమే నిర్ణయిద్దామని జగన్ పేర్కొనడం జనంలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అలాగే చేస్తాం.. ఫ్యాన్ గుర్తుకు ఓట్లేస్తామంటూ జనం స్పందించారు.
 
 అరగంటపాటు సాగిన జగన్ ప్రసంగం జనాన్ని మరింత ఉత్తేజితులను చేసింది. సభ ముగిసినా జనం మాత్రం కదలకపోవడం విశేషం. మొత్తంగా కావలి ఎన్నికల ప్రచారసభ పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి అసెంబ్లీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, ఉదయగిరి అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, ఆత్మకూరు అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డి, స్థానిక నేతలు కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి, అబ్దుల్ అజీజ్, పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 మేకపాటి తండ్రి సమానుడిగా
 నాకు అండగా నిలిచారు
 నెల్లూరు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. తాను తండ్రిని కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో రాజమోహన్‌రెడ్డి తండ్రి సమానుడిలా తన వెన్నంటి నడిచారని జగన్ పేర్కొన్నారు.  కావలి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మంచి వ్యక్తి, ప్రజలకు మంచి చేస్తాడన్న నమ్మకం తనకుందన్నారు. రామిరెడ్డిని సైతం అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జగన్ ప్రజలను కోరారు.
 
 జగన్ ఫ్యాన్ గుర్తు ప్రచారం
 ‘అవ్వా మన గుర్తు ఫ్యాన్, తల్లీ మన గుర్తు ఫ్యాన్, అన్నా మన గుర్తు ఫ్యాన్, ఫ్యాన్ గుర్తును మరవద్దన్నా’ అంటూ కావలి సభలో జగన్ ఫ్యాన్‌చేత బట్టి అందరినీ ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించారు. అందరినీ పేరుపేరునా పలకరిస్తూ ‘బిల్డింగ్‌పై ఉన్న తాతా మన గుర్తు ఫ్యాన్, గోడపైనున్న అన్నా మన గుర్తు ఫ్యాన్, మిద్దెపైనున్న అక్కయ్యలు మన గుర్తు ఫ్యాన్. ఫ్యాన్ గుర్తుకు ఓటేయండన్నయ్యా’ అంటూ జగన్ చేసిన ప్రచారం అందరినీ మరింతగా ఆకట్టుకుంది.
 
 కావలి కెనాల్ పూర్తి చేస్తాం
 అధికారంలోకి వచ్చిన వెంటనే  సోమశిల పరిధిలోని కావలికెనాల్‌ను పూర్తిచేసి ఈ ప్రాంత వాసులకు సాగునీరు, తాగునీరు అందిస్తామని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి  హామీ ఇచ్చారు. కావలి ఎన్నికల ప్రచార సభలో జగన్ మాట్లాడుతూ నెల్లూరు ఎంపీగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి, కావలి ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిని గెలిపిస్తే కావలి కెనాల్‌తో పాటు మిగిలిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తవు తాయన్నారు.
 
 జగన్ పాలనతోనే రాష్ట్రాభివృద్ధి : ఎంపీ
  వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం ఖాయమని, ఆయన పాలనలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆ పార్టీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. కావలిలో ఆదివారం జరిగిన జగన్ ఎన్నికల ప్రచార సభలో మేకపాటి ప్రసంగించారు. రాష్ట్రాన్ని పాలించే నేతలు సద్గుణం కలిగి ఉండాలన్నారు. అలాగే ధీరోదాత్తుడిగా, ఆరోగ్యవంతుడిగా ఉండాలని, అప్పుడే రాష్ట్రం బాగుంటుందని మేకపాటి అన్నారు. చంద్రబాబుకు సద్గుణం లేదు, ధీరోదాత్తుడు కాదు, ఆరోగ్యవంతుడు కాదన్నారు. అందుకే బాబుకు పాలించే అర్హత లేదని మేకపాటి చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపి అందరి మన్ననలు పొందిన  మహానేత వైఎస్ తనయుడిగా జగన్‌కు అన్ని అర్హతలతో పాటు ప్రజాభిమానం మెండుగా ఉందన్నారు.

Advertisement
Advertisement