'ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే....పులి పులే' | Sakshi
Sakshi News home page

'ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే....పులి పులే'

Published Sat, Apr 26 2014 12:08 PM

'ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే....పులి పులే' - Sakshi

అనంతపురం : జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలను మళ్లీ అద్భుతంగా చేసి చూపిస్తామని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. వైఎస్సార్ జనభేరిలో భాగంగా ఆమె శనివారం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఓబుళదేవర చెరువులో రోడ్షో నిర్వహించిన షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాసేవకు జగనన్న తన జీవితాన్ని...అంకితం చేసేందుకు సిద్ధంగా ఉన్నాడని... ఎన్నికల్లో అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుకు  వేసి జగనన్న నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే.... వైఎస్ఆర్ 31 లక్షలమందికి పెన్షన్లు ఇచ్చారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేదవాడి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారని... అన్ని సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ వైఎస్ఆర్ ఏ ఒక్క ఛార్జీలు పెంచలేదన్నారు.చంద్రబాబు నాయుడు ఎనిమిదేళ్ల ప్రభుత్వంలో ఎనిమిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని షర్మిల ధ్వజమెత్తారు. ప్రతిపక్ష హోదాలో ఉన్న బాబు ప్రభుత్వాన్ని నిలదీయాల్సింది పోయి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తన భుజాన మోశారని ఆమె విమర్శించారు. పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుది అన్నారు. చంద్రబాబు చేస్తున్న వాగ్దానాల్లో నిజం లేదని షర్మిల పేర్కొన్నారు.

అధికారం ఇస్తే అది చేస్తాం ఇది చేస్తామని చంద్రబాబు బూటకపు వాగ్దానాలు చేస్తున్నారని షర్మిల అన్నారు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తామంటే... ఆ తీగలపై బట్టలు ఆరేసుకోవాలన్న బాబు ...ఇప్పుడు తామూ అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ ఇస్తామని చెబుతున్నారన్నారు. నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే....పులి ...పులేనని షర్మిల వ్యాఖ్యానించారు. మే 7వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు.

Advertisement
Advertisement