తొలి ఎన్నికల్లోనే సత్తా | Sakshi
Sakshi News home page

తొలి ఎన్నికల్లోనే సత్తా

Published Wed, May 14 2014 11:52 PM

తొలి ఎన్నికల్లోనే సత్తా - Sakshi

సాక్షి, కాకినాడ :వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టి మూడేళ్లు కూడా నిండలేదు. మహానేత మరణంతో చుక్కాని లేని నావలా తయారైన ప్రజలకు అండగా నిలిచేం దుకు ఆవిర్భవించిన ఈ పార్టీ పుట్టుకే ఒక చరిత్ర సృష్టించింది. నిత్యం ప్రజల సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషిస్తూ ఉద్యమాలే ఊపిరిగా ఎదుగుతూ వచ్చింది. అలాంటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘స్థానిక’ పోరులో ప్రజల ఆదరణ చూరగొంది. మొన్న జరిగిన ‘పుర’పోరులో 36 శాతం మంది పట్టణ ప్రజలు వైఎస్సార్ సీపీని అక్కున చేర్చుకుంటే ‘ప్రాదేశిక’ పోరులో 43 శాతం మంది ఆదరించారు. మూడు దశాబ్దాల చరిత్రతో పాటు గ్రామస్థాయిలో బలమైన క్యాడర్ కలిగిన తెలుగుదేశం పార్టీకి తన తొలి ఎన్నికల్లోనే వైఎస్సార్‌సీపీ చుక్కలు చూపించింది. పుర పోరులోనే కాదు..పరిషత్ పోరులో కూడా జిల్లాలో ‘దేశం’కు గట్టి పోటీనివ్వగలిగింది. టీడీపీకి పట్టణాల్లో 48 శాతం ఓట్లు వస్తే..పల్లెలకొచ్చేసరికి రెండు శాతం మాత్రమే ఓటు శాతం పెరిగింది. అదే వైఎస్సార్‌సీపీకి పట్టణాల్లో 36 శాతం ఓట్లు పోలైతే పల్లెల్లో 43 శాతం ఓట్లు పోలయ్యాయి. అంటే పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఏడు శాతం ఓటింగ్ వైఎస్సార్‌సీపీకి పెరిగింది.
 
 ప్రాదేశిక పోరులో 21.15 లక్షల ఓట్లు పోలవగా, వాటిలో టీడీపీకి 10.70 లక్షల ఓట్లు, వైఎస్సార్ సీపీకి 9.10 లక్షల ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లతో పోలిస్తే టీడీపీని 50.64 శాతంమంది ఆదరిస్తే వైఎస్సార్ సీపీని 43 శాతం మంది అక్కున చేర్చుకున్నారు. ప్రాదేశిక పోరులో టీడీపీకీ వైఎస్సార్ సీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం 1.60 లక్షలుగా ఉంది. సుమారు ఏడు జెడ్పీటీసీ స్థానాలతో పాటు సుమారు 180కు పైగా ఎంపీటీసీ స్థానాల్లో స్వల్ప ఓట్ల తేడాతోనే వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఓటమి చవిచూశారు. అంటే రెండు లేదా మూడు శాతం లోపు ఓట్ల తేడాతోనే మెజార్టీ స్థానాలను వైఎస్సార్‌సీపీ చేజార్చుకుంది. నియోజకవర్గాల వారీగా చూస్తే వైఎస్సార్ సీపీ, టీడీపీ అభ్యర్థులు సాధించిన ఓట్ల వ్యత్యాసం కేవలం ఐదారువందల నుంచి పదివేల ఓట్ల వరకు ఉంది. మెజార్టీ నియోజకవర్గాల్లో ఈ రెండు పార్టీల మధ్య ఐదారు వేల ఓట్ల తేడాయే ఉంది. మొత్తమ్మీద మెజార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. అయితే టీడీపీకి దీటుగా ఇటు పట్టణాల్లోనూ...అటు పల్లెల్లో కూడా గణనీయమైన రీతిలోనే వైఎస్సార్ సీపీ ఓటు బ్యాంకును సాధించగలిగింది.
 
 గత ముప్పై ఏళ్లలో ఎన్నో ‘స్థానిక’ ఎన్నికలను చూసిన టీడీపీ సాధించిన ఓట్లతో పోలిస్తే కనీసం మూడేళ్లు కూడా నిండని     వెఎస్సార్‌సీపీ గణనీయమైన ఓట్లు సాధించిందని రాజకీయ విశ్లేషకులు సైతం అంగీకరిస్తున్నారు. గ్రామస్థాయిలో క్యాడర్ నిర్మాణం జరగని వైఎస్సార్‌సీపీ ఈ స్థాయిలో ఓట్లు సాధించడం చూస్తుంటే భవిష్యత్‌లో వైఎస్సార్‌సీపీ గ్రామస్థాయిలో కూడా బలమైన శక్తిగా ఎదుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. పట్టణాలతో పోలిస్తే పల్లెల్లో ఏడు శాతం ఓటు బ్యాంకు పెంచుకోగల్గిన వైఎస్సార్ సీపీ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అంచనాలకందని రీతిలో అద్భుత ఫలితాలను సాధించగలుగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. మున్సిపల్, ప్రాదేశిక పోరులో స్వల్ప ఓట్ల శాతం తేడాతో టీడీపీ ఏ విధంగా మెరుగైన ఫలితాలు సాధించగలిగిందో అదే రీతిలో సార్వత్రిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌సీపీ టీడీపీ మీద పై చేయి సాధిస్తుందనడంలో సందేహం లేదని వారు అంచనా వేస్తున్నారు.
 

Advertisement
Advertisement