500 కిలోల చందనం పూత... | Sakshi
Sakshi News home page

500 కిలోల చందనం పూత...

Published Tue, May 3 2016 10:57 PM

500 కిలోల చందనం పూత...

సింహాచలం ఆలయానికి ఏ రోజు వెళ్లినా స్వామిని చాలా దగ్గరగా దర్శించుకోవచ్చు. చందనం అలమిన దేహం, పట్టుబట్టలూ, వజ్రాల నగలూ, తులసి మాలలూ... ఆయన ఆకారం పెద్ద లింగంలా ఉంటుంది. కానీ, ఆ చందనపు పొరల క్రింద చిన్న నిజరూప విగ్రహం ఉంటుంది. వరాహ-నరసింహుని విగ్రహం. స్వామి నిజరూప దర్శనభాగ్యం సంవత్సరంలో కేవలం ఒక్క వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే లభిస్తుంది. ఆ పుణ్య తిథి ఈ నెల 9వ తేదీ.. సోమవారం.  ఆ రోజే చందనోత్సవం.
 
వరాహ ముఖం, మనిషి మొండెం, సింహం తోక, రెండు చేతులు, నేలలో దాగివున్న పాదాలు... ఈ నిజరూప స్వామి దర్శనం ఏడాదికి ఒక్కసారి కేవలం అక్షయ తృతీయ నాడు మాత్రమే కొన్ని గంటల సేపు చందనం తీసి వేయగా లభిస్తుంది. ఆ వేళకు లక్షలాది భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని తరిస్తారు. టన్నుల కొద్దీ చందనం మొక్కులు తీర్చుకుంటారు. మళ్లీ అర్చనాదులు పూర్తిచేసి, దర్శన భాగ్యం భక్తులకు కల్పించి తిరిగి చందనం లేపనం చేస్తారు. చందనం లేపనం తర్వాత స్వామి లింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. స్వామి నుంచి తీసిన చందన ప్రసాదాన్ని ముఖాన ధరించి, కొంత చందనాన్ని నీటిలో కలిపి తీర్థంగా సేవిస్తే దీర్ఘరోగాలు తగ్గిపోతాయని భక్తుల అపార నమ్మకం.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో సింహాచల పుణ్యక్షేత్రం ఒకటి. అత్యంత ప్రాచీనమైన క్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం క్షేత్రం విశాఖపట్నానికి 16 కిలోమీటర్ల దూరంలో, సముద్రమట్టానికి 800 అడుగుల ఎత్తులో ఉంది. సింహాకారంలో ఉన్న కొండపై వరాహ, నారసింహ రూపాలను ఒక్కటిగా చేసుకుని శ్రీమహా విష్ణువు శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిగా దర్శనమిచ్చే మహా పుణ్యక్షేత్రం ఇది. సుజల, సుఫల, సస్యశ్యామల ప్రశాంత వాతావరణంలో ఈ క్షేత్రం నెలకొని ఉంది. చుట్టూ కొండలు, అనాస, జీడి, మామిడి, సంపెంగ వనాల మధ్య ఈ క్షేత్రం విరాజిల్లుతోంది.
 
వరాహం, నారసింహం...
హిరణ్యాక్షుణ్ణి సంహరించిన వరాహావతారం, హిరణ్యకశిపుని సంహరించిన నారసింహ అవతారాల కలయికే శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి. హిరణ్యకశిపుని వధించాక లక్ష్మీదేవితో కలిసి ప్రహ్లాదునితో పూజలందుకుంటూ సింహాచల క్షేత్రంలో శాంతమూర్తిగా ఉంటానన్నాడట స్వామి. ఆ విధంగా శ్రీ లక్ష్మీ వరాహ నారసింహ స్వామి సింహాచల క్షేత్రంపై వెలసి భక్త సులభుడుగా పూజలందుకుంటున్నాడు. విహంగవీక్షణంలో సింహాకారంలో ఈ కొండ ఉండటంతో సింహగిరిగా కూడా ఈ క్షేత్రం పిలువబడుతోంది. అద్భుతమైన శిల్పసంపద, రాతి కట్టడాలతో ఆలయం కనువిందు చేస్తుంది.

ఆలయంలోని బేడా మండపం, కల్యాణమండపం, ఆస్థానమండపం, భోగమండపం, అంతరాలయంలో  ప్రహ్లాదమండపం, రాజగోపురం ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఆలయంలోనే ఎంతో మహిమ గల కప్పస్తంభం ఉంది. సంతాన వేణుగోపాలస్వామి యంత్రాన్ని ప్రతిష్ఠించిన ఈ స్తంభాన్ని మొక్కుకుంటే కోరిన కోర్కెలు ఫలిస్తాయన్న నమ్మకం. ఈ క్షేత్రంలోనే ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న గంగధార నిత్యం నీటితో కళకళలాడుతుంటుంది.
 
పురూరవుడు నిర్మించిన ఆలయం
హిరణ్యకశిపుడి కోపోద్రేకానికి గురై, విశాఖ పూర్వ సముద్రంలో పడవేయబడ్డ ప్రహ్లాదుణ్ణి రక్షించేందుకు శ్రీమహావిష్ణువు అవతారమైన శ్రీవరాహ లక్ష్మీనృసింహస్వామి జారుతున్న వస్త్రాన్ని ఒక చేతితోను, మరొక చేతితో గరుత్మంతునికి అమృతాన్ని అందిస్తూ అమితవేగంతో ఒక్కసారిగా సింహగిరిపైకి దూకి ప్రహ్లాదుణ్ణి రక్షించాడు. ప్రహ్లాదుడి కోరిక మేరకు స్వామి సింహగిరిపైనే ఉండి, కొంతకాలం పూజలు అందుకున్నాడు.

ప్రహ్లాదుడు అనంతరం పూజలు చేసేవారు కరువై మరుగునపడ్డ స్వామిపై పెద్ద పుట్ట వెలసింది. కొంత కాలానికి షట్చక్రవర్తులో ఒకరైన పురూరవ చక్రవర్తి ఆకాశమార్గంలో విహరిస్తున్నప్పుడు ఆయన వాహనం ఈ కొండపై ఆగిపోయింది. ఆ రోజు రాత్రి పురూరవుడు సింహగిరిపైనే నిద్రించినప్పుడు స్వప్నంలో సాక్షాత్కరించిన స్వామి పుట్టలో తాను దాగివున్న విషయాన్ని తెలిపాడు. పుట్టను తొలగించి ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించాడు.

పుట్ట మన్నుకు బదులుగా తనపై చందనాన్ని వేయాలని, ఏడాదంతా చందనంతో నిత్యరూపంతోనూ, ఒక్క వైశాఖ శుద్ధ తదియనాడు మాత్రం చందనం మణుగుల్లో నుంచి బయటకి వచ్చి నిజరూప దర్శనమిస్తానని తెలియజేశాడు. స్వామి ఆజ్ఞ ప్రకారం పురూరవుడు పుట్టను తొలగించి స్వామిని సేవించాడు. స్వామికి ఆలయాన్ని నిర్మించాడు. పురూరవుడు స్వామిపై ఉన్న పుట్టను తొలగించిన రోజే వైశాఖ శుద్ధ తదియ పర్వదినం. దీంతో ఈ రోజున ప్రతీ ఏటా ఈ క్షేత్రంలో చందనోత్సవంను వైభవంగా నిర్వహిస్తారు.  
 
ఏడాదిలో నాలుగు విడతల్లో చందన సమర్పణ...
ఏడాదిలో నాలుగు విడతలుగా మూడు మణుగుల (సుమారు 125 కిలోలు) చొప్పున చందనాన్ని (మొత్తం 500 కిలోలు) స్వామికి సమర్పిస్తారు. చందనోత్సవం రోజు రాత్రి, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో ఉదయం వేళల్లో మరో మూడు విడతలుగా మూడేసి మణుగుల చొప్పున చందనాన్ని సమర్పిస్తారు. నాలుగు పర్యాయాల్లో సుమారు 15 మంది చొప్పున సిబ్బంది ఆలయ బేడా మండపంలో ఐదేసి రోజులపాటు కావాల్సిన చందనాన్ని అరగదీస్తారు. ఈ చందనంలో అర్చకులు సుగంధ ద్రవ్యాలను కలిపి స్వామికి సమర్పిస్తారు.
- అవసరాల గోపాలరావు, సాక్షి, సింహాచలం
 
చేరుకోవడం ఇలా!
* సింహాచలం చేరుకోవడానికి విశాఖపట్నం ఆర్టీసి కాంప్లెక్స్, రైల్వేస్టేషన్‌ల నుంచి పది నిమిషాలకు ఒక ఆర్టీసి బస్సు అందుబాటులో ఉంటుంది.
* విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి బయటకు వస్తే బస్సులు అందుబాటులో ఉన్నాయి.
* సింహాచలంలో కొండపై నుంచి కొండదిగువకు దేవస్థానం బస్సులు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇతర టూరిస్టు వెహికల్స్ కూడా విరివిగా లభిస్తాయి.

Advertisement
Advertisement