ఆడపిల్లకు ‘సేఫ్ జోన్’ లేదు | Sakshi
Sakshi News home page

ఆడపిల్లకు ‘సేఫ్ జోన్’ లేదు

Published Sun, Jul 31 2016 10:44 PM

ఆడపిల్లకు  ‘సేఫ్ జోన్’ లేదు

 ధీర దత్

 

పదేళ్లప్పుడు తనతో తను యుద్ధం.
పీజీలో ప్రేమలోంచి బయట పడేందుకు యుద్ధం.
జర్నలిస్ట్‌గా అవినీతి, అక్రమాలతో యుద్ధం.
వ్యక్తిగతంగా విసుర్లు, విమర్శలతో యుద్ధం.
ప్రస్తుతం ఆర్ణబ్ గోస్వామితో మాటల యుద్ధం!
వార్ కరస్పాండెంట్ బర్ఖాదత్.. ఎప్పుడూ...
ఏదో ఒక వార్ జోన్‌లో ఉంటూనే ఉంటారు.
ఆ మాటే అని చూడండి...
‘అసలు వార్ జోన్‌లో లేని ఆడపిల్ల ఎవరో చెప్పండి’
అని అడుగుతారు బర్ఖా.
బర్ఖాదత్.. ధీర వనిత! ధీర దత్!!


ఆడపిల్లకు అమ్మ ఒడి తప్ప ప్రపంచంలో వేరే ‘సేఫ్ జోన్’ లేదు. ఒడిలో ఉన్నంత వరకే అభయం. ఒడి దిగితే అరణ్యం. ఇల్లు, కాలేజ్, కెరియర్... చెడు చూపు ఏ వైపు నుంచి మెల్లిగా చెట్టు దిగి వస్తుందో చెప్పలేం. ఏ పుట్టలోంచి చల్లగా పాక్కుంటూ వస్తుందో కనిపెట్టలేం. ఏ పాతాళంలోంచి పువ్వులా పరిమళమై విరుస్తుందో, ఏ గగనంలోంచి నవ్వులా పరవశమై కురుస్తుందో అస్సలు ఊహించలేం.

   
ప్రభాదత్‌కి ఇలాంటి భయాలేం లేవు. పిల్లని ఒడిలోంచి తోసేసింది! చెట్టు పుట్టా ఎక్కడం నేర్చుకో. కొండల్నీ గుట్టల్నీ తొలుచుకుంటూ వెళ్లిపో. నింగిలోకి విహంగమై ఎగిరిపో. ఎక్కడా.. నిలవకు, తడవకు, జడవకు. ఇదీ ఆ ఇంట్లో ఫస్ట్ చైల్డ్‌కి ఫస్ట్ లెసన్. ప్రభాదత్ జర్నలిస్ట్. బర్ఖాదత్ కూడా జర్నలిస్టే అయింది. తండ్రిలా ఆమె ఎయిర్ ఫోర్స్‌ని ఎంచుకోలేదు. అన్ని ఫోర్సులను రాత్రీపగలు మునివేళ్లపై నిలిపి ఉంచే మీడియా ఫోర్స్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు ఇండియన్ మీడియాలోనే.. ఒక శక్తిమంతమైన క్షిపణి.. బర్ఘాదత్. ఆ క్షిపణి ఇప్పుడు.. సాటి జర్నలిస్ట్ ఆర్ణబ్ గోస్వామిపై నిప్పులు కురిపిస్తూ విరుచుకు పడడం దాదాపుగా ఒక యుద్ధవార్తే అయింది.

 

‘గ్రౌండ్ జీరో’ జర్నలిస్ట్!
కేట్ ఆడీ, లిండ్సే హిల్సమ్, అలెక్స్ క్రాఫోర్డ్, ఆర్లా గ్యూరిన్, జీనా కోడర్, మార్తా గెల్హార్న్, బర్ఖాదత్... అంతా ఒకే బెంచ్ స్టూడెంట్స్. ఒకే కాలంలో కాకపోవచ్చు. యుద్ధ కాలాల్లో.. ‘గ్రౌండ్ జీరో’ (విస్ఫోటస్థలి) లోకి వెళ్లి పోయి అక్కడి నుంచి వార్తల్ని ప్రత్యక్షంగా అందించిన మహిళా జర్నలిస్టులు. దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, ఆ దేశాల మధ్యలోకి వెళ్లి యుద్ధాన్ని కవర్ చెయ్యడానికి గట్స్‌తో పని లేదు. జర్నలిజం మీద భక్తి ఉంటే చాలు. భక్తితో పాటు బర్ఖాకు జర్నలిజంపై ప్రేమ, గౌరవం ఉన్నాయి. వాటిని శంకిస్తే మాత్రం ఆమె అపరకాళే అవుతుంది. అయింది.

ప్రో-పాకిస్థానీ పావురం?!
ఆర్ణబ్ గోస్వామి సంగతి తెలిసిందే. ‘టైమ్స్ నౌ’ న్యూస్ రూమ్‌లో రంకెలేస్తూ, డిబేట్ కి వచ్చినవాళ్ల పీక నొక్కేస్తుంటాడు. అరవడం ఆయన యు.ఎస్.పి. (యునీక్ సెల్లింగ్ పాయింట్). జూలై 8న కశ్మీర్‌లో హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాది బర్హన్ వాని ఎన్‌కౌంటర్ జరిగిన తర్వాత టీవీలన్నీ ఎన్‌కౌంటర్‌పై డిబేట్ పెట్టాయి. ఆర్ణబ్ తన డిబేట్‌లో జర్నలిస్టుల్ని ఉతికేశారు. భారతదేశంలో ఉంటున్న ప్రో-పాకిస్థానీ జర్నలిస్టు పావురాల్ని జైల్లో పడేసి రెక్కలు కత్తిరించేయాలి అనేశారాయన! ఆ మాట ఎన్డీటీవీలో పనిచేస్తున్న బర్ఖాదత్‌కు తగిలింది. వెంటనే రియాక్ట్ అయ్యారు. ఆర్ణబ్ పని చేస్తున్న ఫీల్డులోనే తను పనిచేస్తున్నందుకు సిగ్గుపడుతున్నానని ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టేశారు. ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యా మాటల వార్ నడుస్తోంది. ‘‘న్యూస్ రూమ్‌లో కూర్చొని చెత్తను పోగేసుకునే నీలాంటి వ్యక్తికి జనం మధ్య తిరిగి వాస్తవాలను చూస్తుండే జర్నలిస్టులను అనే అర్హత లేదు’’ అని ఆర్ణబ్‌పై విరుచుకుపడ్డారు బర్ఖాదత్. బర్హన్ ఎన్‌కౌంటర్ విషయంలో బర్ఖా మన సైనికుల్ని తప్పుపట్టే విధంగా మాట్లాడారన్నది ఆర్ణబ్ ఆరోపణ.


పోరాటమే ఊపిరి
రాజకీయ నాయకులతో యుద్ధం. అధికార యంత్రాంగంతో యుద్ధం. అవినీతి, అక్రమాలపై యుద్ధం. అప్పుడప్పుడు ఆర్ణబ్‌లాంటి వాళ్లతో యుద్ధం. ఆ యుద్ధంలో ఆమె గెలిచారా లేదా అన్నది కాదు, పోరాడారా లేదా అన్నదే ముఖ్యం. బర్ఖా పోరాట యోధురాలు. ఆమె దేశభక్తిపై అనుమానాలు రేకెత్తించడానికి, ఆమె శీల ప్రతిష్టను భంగపరచడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. వాటన్నిటినీ తట్టుకుని నిలబడ్డారు బర్ఖా. రెండేళ్ల క్రితం ఆమెపై ఒక రూమర్ వచ్చింది. ఆమె రెండు పెళ్లిళ్లు చేసుకున్నారని, వాళ్లిద్దరూ కశ్మీర్ ముస్లింలని! బర్ఖా వాటిని పట్టించుకోలేదు.

 

తనతో తను తొలి యుద్ధం!
పట్టించుకోకుండా ఉండడానికి కూడా ఒకోసారి పెద్ద యుద్ధమే చెయ్యాల్సి వస్తుంది! ప్రత్యర్థులను, విరోధులను, పనిలేనివాళ్లను తన మాటలతో, తన నిర్లక్ష్యంతో, తన పరిణతితో తేలిగ్గా మట్టి కరిపించగల బర్ఖా.. బాల్యంలో ఒక్క విషయంలో మాత్రం తనతో తనే తలపడలేకపోయారు! అప్పుడు తనకు పదేళ్లు. పదేళ్లు కూడా ఉన్నాయో లేవో. ఆ సంఘటన మాత్రం బర్ఖాకు బాగా గుర్తుంది. అత్తయ్యలు, మామయ్యలు; పిన్నమ్మలు, బాబాయిలు; బంధువులు, స్నేహితులు, ఆ స్నేహితుల స్నేహితులు... పంజాబీ ఇళ్లల్లో సందడికి కొదవేముంది?

 ఆ బంధువుల్లో.. ఓ ‘మంచి మామయ్య’ బర్ఖాను ఒకరోజు ఆడుకుందాం రమ్మని తన గదికి తీసుకెళ్లి మీద చెయ్యి వేశాడు. బ్యాడ్ టచ్‌కీ, గుడ్ టచ్‌కీ తేడా తెలియని వయసు. కానీ ఆ టచ్‌లో అసహజత్వం ఉందని మాత్రం బర్ఖాకు అర్థమవుతోంది. మంచి మామయ్య ఏదో డర్టీ పని చేస్తున్నాడు. భయపడిపోయింది. అక్కడి నుంచి పరుగెత్తింది. ఆ తర్వాత ఆ మంచి మామయ్య దగ్గరికి వెళ్లలేదు. అమ్మకు చెప్పలేదు. నాన్నకు చెప్పలేదు. అలాగని ఆ ‘డర్టీ’ నుంచి తనూ బయటికి రాలేదు. తనేదో తప్పు చేసిన ఫీలింగ్! కొన్నేళ్ల పాటు ఆ ఫీలింగ్ బర్ఖాను వెంటాడింది. ఎంతవరకు అంటే... ఇంకో డర్టీ ఫెలో ఆమె జీవితంలోకి ప్రవేశించేంత వరకు.


కాలేజ్‌లో... ప్రేమ వయెలెన్స్
జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్శిటీలో మూస్ కమ్యూనికేషన్ పీజీ కోర్సులో చేరింది బర్ఖా. అప్పటికామె పరిపూర్ణమైన స్త్రీ. తన జీవితం ఎలా ఉండాలన్న దానిపై ఆమెకు స్థిరమైన నిర్ణయాలు ఉన్నాయి. ఒక్కమాటలో... లోకం తెలిసిన పిల్ల. అప్పుడొచ్చాడు కో-స్టూడెంట్ ఒకడు. వచ్చి, ‘‘నిన్ను ప్రేమిస్తున్నాను’’ అన్నాడు. అంత లోకాన్ని చూసిన పిల్ల, అన్ని పుస్తకాలను చదివిన పిల్ల.. అతడి ప్రేమలో పడిపోయింది! తర్వాత అతడు బర్ఖాను సాధించడం మొదలు పెట్టాడు. ఓరోజు చెంప పగలగొట్టాడు. చెయ్యి మెలితిప్పాడు. కిందపడేసి, తలను నేలకేసి కొట్టాడు! ఇదంతా కాలేజ్‌లోనే. కాలేజ్‌లో డొమెస్టిక్ వయలెన్స్! ఎలాగో అతడిని వదిలించుకుంది. పీజీ అయ్యాక ఎన్డీటీవీ ఇంటర్వ్యూకి వెళితే.. అక్కడికి అతడు కూడా వచ్చాడు! కెమెరామెన్‌గా అప్లై చేశాడని తెలిసింది బర్ఖాకు. ‘అతడికి ఉద్యోగం ఇచ్చేపనైతే.. నేనిక్కడ ఉద్యోగం చెయ్యాల్సిన పని లేదు’ అని గట్టిగా చెప్పేసింది బర్ఖా. ఆమె కోసం అతడిని వద్దనుకుంది ఎన్డీటీవీ.

 

ప్రతి ఆడపిల్లా ఒక యోధురాలు
ఆడపిల్ల జీవితమే ఒక యుద్ధం అంటారు బర్ఖాదత్. ఆమె ఉద్దేశం.. పరిస్థితులు స్త్రీని యుద్ధ సైనికురాలిగా మార్చేస్తాయని. దేశాలకు యుద్ధాలు రావచ్చు రాకపోవచ్చు. హద్దుల్ని చెరిపేసుకుంటే, స్వేచ్ఛను కాపాడుకునే ప్రయత్నంలో స్త్రీ.. బాల్యంలో, యవ్వనంలో, ఆ తర్వాత కూడా యుద్ధం చేస్తూనే ఉండాల్సి వస్తుందని చెప్పడానికి బర్ఖా జీవితం ఒక నిదర్శనం.


రచనలు
బర్ఖాదత్  2015లో  ‘ది అన్‌క్వైట్ లాండ్’ అనే పుస్తకం రాశారు. భారతదేశపు తప్పొప్పులపై రిపోర్టర్‌గా బర్ఖా పరిశీలన, విశ్లేషణల సంకలనం ఈ పుస్తకం.  అంతకుముందు 2002 నాటి గుజరాత్ అల్లర్లపై ప్రముఖ ఇండో-అమెరికన్ జర్నలిస్టు రాసిన ‘గుజరాత్: ది మేకింగ్ ఆఫ్ ట్రాజెడీ’ పుస్తకంలో బర్ఖా.. ‘నథింగ్ న్యూ?: ఉమెన్ యాజ్ విక్టిమ్స్’ అనే విమర్శనాత్మక అధ్యాయం రాశారు.

 

విమర్శలు, వివాదాలు
2008లో ముంబై దాడుల ప్రత్యక్ష వార్తాసేకరణకు (లైవ్ కవరేజీకి) వెళ్లినప్పుడు బర్ఖాదత్ అక్కడి తాజ్‌మహల్, ఒబెరాయ్ ట్రైడెంట్ హోటళ్లలో బస చేసిన కొందరిని ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రత్యక్షసాక్షులుగా టీవీలో చూపించి, వారి ప్రాణాలకు ముప్పు కలిగేలా రిపోర్టింగ్‌ను సంచలనాత్మకం చెయ్యడం ఆమెపై విమర్శలకు దారితీసింది. పనులు నడిపించడంలో మోరుమోసిన లాబీయిస్టు నీరా రాడియాతో  2జి స్ప్రెక్ట్రమ్ అమ్మకాలకు సంబంధించి సంభాషణ జరిపిన వారిలో బర్ఖా దత్‌కూడా ఉన్నట్లు సీబీఐ వెల్లడించడంతో బర్ఖా దత్ తను నిర్దోషినని నిరూపించుకోవలసి వచ్చింది.

 

బర్ఖాదత్ - బాలీవుడ్
బర్ఖాదత్ స్ఫూర్తితో బాలీవుడ్‌లో ‘లక్ష్య’, ‘ఫిరాక్’, ‘పీప్లీ లైవ్’, ‘నో వన్ కిల్డ్ జెస్సీకా’ చిత్రాలు వచ్చాయి. మలయాళంలో వచ్చిన ‘కీర్తిచక్ర’ చిత్రంలోని జర్నలిస్ట్ పాత్రకు కూడా బర్ఖానే ప్రేరణ.


అవార్డులు: పద్మశ్రీ, అసోసియేషన్ ఫర్ ఇంటర్నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డ్, ఇండియన్ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ అవార్డ్, కామన్‌వెల్త్ బ్రాడ్‌కాస్టింగ్ అసోసియేషన్ అవార్డ్. 



బర్ఖా దత్ (44), టీవీ జర్నలిస్ట్
జననం   :      18 డిసెంబర్ 1971
జన్మస్థలం      :      న్యూ ఢిల్లీ
తల్లిదండ్రులు   :      ఎస్.పి.దత్ (ఎయిర్ ఇండియా అధికారి){పభాదత్  (హిందూస్థాన్ టైమ్స్ జర్నలిస్ట్)
తోబుట్టువు     :      బహర్ దత్  (చెల్లెలు)   (సి.ఎన్.ఎన్.-ఐ.బి.ఎన్. జర్నలిస్ట్)
చదువు   :      ఇంగ్లిష్ లిటరేచర్ (డిగ్రీ) ఢిల్లీ
మాస్ కమ్యూనికేషన్ (రెండు పీజీలు) జామియా మిల్లియా, కొలంబియా
కెరీర్ ప్రారంభం  :      ఎన్డీటీవీతో.
ప్రస్తుతం  :      ఎన్డీటీవీలోనే న్యూస్ యాంకర్, కన్సల్టింగ్ ఎడిటర్
ప్రతిష్ట     :      కార్గిల్ యుద్ధక్షేత్రంలో రిపోర్టింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రాతో ఇంటర్వ్యూ  (కశ్మీర్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్ యుద్ధక్షేత్రాల రిపోర్టింగ్)
వైవాహిక స్థితి  :      అవివాహిత

 

Advertisement
Advertisement