భవితపైనే పెట్టుబడి | Sakshi
Sakshi News home page

భవితపైనే పెట్టుబడి

Published Fri, Mar 21 2014 11:32 PM

భవితపైనే పెట్టుబడి

  •      మీకు ఏది నచ్చితే అదే మీ భవిష్యత్
  •      నేను అలా చేయటం వల్ల ఇంట్లో గొడవలూ జరిగాయి
  •      కానీ అదే నన్ను ఇంతవాణ్ణి చేసింది
  •      ఇదీ... ఎ.ఆర్.రెహమాన్ పర్సనల్ ఫైనాన్స్
  •  ఎ.ఆర్.రెహమాన్. మన సంగీతానికి ఆస్కార్ గుర్తింపు తెచ్చిన స్వర మాంత్రికుడు. మ్యూజిక్‌లోనే కాదు. చాలా తక్కువగా మాట్లాడినా... ఆయన మాటల్లోనూ ఏదో మ్యాజిక్ కనిపిస్తుంది. ఓ వైవిధ్యం ప్రస్ఫుటమవుతుంది. పొదుపు, పెట్టుబడులు తదితర పర్సనల్ ఫైనాన్స్ గురించి ఆయన చెబుతున్న మాటలు వింటే ఇది మరింత తేటతెల్లమవుతుంది. కావాలంటే మీరూ చూడండి ఆయనేమంటున్నారో...
     
    ‘‘నా ఉద్దేశం ప్రకారం మీరు దేన్నయితే పిచ్చిగా ప్రేమిస్తారో, దేన్నయితే ఒక వ్యసనంలా భావిస్తారో దానిపైనే ఇన్వెస్ట్ చేయండి. ఏదైతే మీకు మక్కువో దాన్లోనే మీ సంపాదన పెట్టండి. నేనైతే అలానే చేశా. అందుకే చెబుతున్నా. ఎందుకంటే నేను అప్పుడప్పుడే పైకొస్తున్న రోజుల్లో నాతో కలిసి పనిచేసే వారంతా వాళ్ల సంపాదనను ఫ్లాట్లు, విల్లాలు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో పెట్టుబడిగా పెట్టేవారు.

    మేమంతా కలసినపుడల్లా... వాళ్లేం కొన్నారో చెబుతూ ఉండేవారు. మరోవంక నేనేమో నా సంపాదనంతా స్టూడియోలకు, కీబోర్డ్‌లకు ఇత రత్రా సంగీత సామగ్రికి ఖర్చుపెట్టేవాడిని. ఈ విషయంలో మా ఇంట్లో తరచు గొడవలు కూడా జరిగేవి. ఎందుకంత వృథా చేస్తున్నావని మా అమ్మ గట్టిగా అడిగేది. ఇలా చేస్తే నీ భవిష్యత్తేంటని నిలదీసేది కూడా. అయినా నేను నా దార్లోనే వెళ్లా. నా ఉద్దేశం ప్రకారం మనం దేన్నయితే పిచ్చిగా ప్రేమిస్తున్నామో అదే మన భవిష్యత్!. భవిష్యత్‌పైనే కదా ఇన్వెస్ట్ చేయాల్సింది!!.
     
    నా సంగతే తీసుకుంటే... నేను మ్యూజిక్‌పై ఇన్వెస్ట్ చేయటం వల్ల సంగీతం గురించి చాలా తెలుసుకున్నా. నా నైపుణ్యాన్ని మరింత పెంచుకున్నా. ఆధునిక టెక్నాలజీ, పరికరాల గురించి కూడా చాలా తెలుసుకున్నా. అదే నాకు కలిసొచ్చింది. అలా తెలుసుకోవటం వల్లే నేను లాభపడ్డానని అనుకుంటున్నా.
     
    అయితే మీరు గనక కుటుంబం ఉన్నవారైతే ఆ కుటుంబం కోసం కొంత సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్లు చేయకతప్పదు. కొంత ఆదా చేయాలి కూడా. ఈ రోజుల్లో మేధో పరమైన సంపత్తి కూడా పెట్టుబడి కిందే లెక్క. కొంత సొమ్ము ఖర్చుపెట్టడం వల్ల మరిన్ని కంపోజిషన్స్ చేయగలిగితే అది కూడా పెట్టుబడే. మిమ్మల్ని మీరు ముందుకు తీసుకు వెళ్లడానికి ఎంత ఖర్చు పెట్టినా అది పెట్టుబడే. ఇలా చేసే పెట్టుబడులు ఒకోసారి వెంటనే ఫలితాన్నివ్వకపోవచ్చు. కానీ మన ప్రయత్నం ఉంటే దానికి దైవ సంకల్పం కూడా తోడవుతుంది. ఈ రెండూ కలసి ఫలితాన్నిస్తాయన్నది నా నమ్మకం.
     

Advertisement
Advertisement