ప్రణాళికా బద్ధంగా నడుచుకోవాలి | Sakshi
Sakshi News home page

ప్రణాళికా బద్ధంగా నడుచుకోవాలి

Published Sat, Jan 2 2016 12:20 AM

ప్రణాళికా బద్ధంగా నడుచుకోవాలి

2016 వార్షిక ఫలాలు
టారో బాణి

 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ప్రేమికులు లేదా దంపతుల మధ్య అన్యోన్యత కుదురుతుంది. ముందుకు దూసుకెళతారు. శక్తిసామర్థ్యాలను పుంజుకుంటారు. మీ మనసు చెప్పినట్లుగా నడుచుకుంటారు. సంప్రదాయ విలువలవైపు మొగ్గు చూపుతారు. ఔదార్యాన్ని అలవరచుకుంటారు. విజయాలు వరిస్తాయి. అయితే మీ విజయంలో ప్రేమ, కమ్యూనికేషన్‌లదే కీలక పాత్ర అని గుర్తించండి. భాగస్వామ్య వ్యవహారాలు మెరుగుపడతాయి. వివాహం లేదా నిశ్చితార్థం జరగవచ్చు. ప్రేమ ఫలిస్తుంది. బాస్‌ని మంచి చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తొందరగా ఎడ్జస్ట్ అయ్యే ధోరణి మీకు మంచి చేస్తుంది. ఆగస్ట్,సెప్టెంబర్, అక్టోబర్‌లలో పెద్ద పెట్టుబడులు, ముఖ్యనిర్ణయాలు వద్దు. లక్కీ కలర్: గ్రీన్; లక్కీ నంబర్:8    
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)

ఈ సంవత్సరం మీకెంతో అదృష్టాన్నిస్తుంది. అయితే కీలకనిర్ణయాలలో  తొందరవద్దు. ఆచితూచి ఆలోచించడం అవసరం. బంధుమిత్రులతో ఉన్న మనస్పర్థలను పరిష్కరించుకోవడం మంచిది. గుడ్డిగా మనసిచ్చేయడం మంచిది కాదు. ప్రేమ వ్యవహారంలో నిదానించడమే మేలు.  పత్రాలు రాసుకోవడమంటే మీకు ముందు నుంచి ఉన్న బెరుకు లేదా బద్ధకం వల్ల మీరు పెద్ద మూల్యాన్నే చెల్లించవలసి వస్తుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. జనవరి మీకు అదృష్టాన్నిస్తుంది. మార్చి, ఏప్రిల్, సెప్టెంబర్, అక్టోబర్‌లలో కీలక నిర్ణయాలు వద్దు. మే, ఆగస్ట్ ప్రోత్సాహకరంగా ఉంటాయి. పెళ్లి ప్రతిపాదనల్లో తొందరపాటు వద్దు. కలిసొచ్చే రంగు: పర్పుల్; అదృష్ట సంఖ్య: 10
 
జెమిని (మే 21-జూన్ 21)
ఈ సంవత్సరం మీ జీవితంలో మైలురాయిగా నిలుస్తుంది. మీ కలలన్నీ నెరవేరతాయి. మీ నమ్మకాలు, నిర్ణయాల విషయంలో స్థిరంగా ఉండండి. జీవితంలో కొత్త మలుపులు సంభవించవచ్చు. మీ ప్రేమ ఫలిస్తుంది. వివాహితులైతే మీ జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిమ్మల్ని సదా అంటి పెట్టుకుని ఉండే కొందరు హితుల మూలంగా  మీరు ప్రమాదంలో పడకుండా తప్పించుకోగలుగుతారు. మేలో మీకు ఫారిన్ చాన్స్ ఉంది. జనవరి నుంచి జూన్ వరకు, నవంబర్, డిసెంబర్ నెలలు మీకు మంచివి. జులై నుంచి అక్టోబర్ వరకు కీలక నిర్ణయాలు వాయిదా వేయండి. ఆయా నెలల్లో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. లక్కీ కలర్: ఎల్లో; లక్కీ నంబర్: 7.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
కొత్తసంవత్సరం ప్రజాసంబంధాలు పెరగడంలోనూ, గుర్తింపును తీసుకు రావడంలోనూ సాయం చేస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అవకాశాలను జారవిడుచుకోవద్దు. మీరు రచయితలయితే మీ రచనల గురించి బ్లాగులో పెట్టుకోండి. పాకశాస్త్ర ప్రవీణులైతే మీరు చేసిన కొత్త వంటకాలను యూ ట్యూబులో అప్‌లోడ్ చేయడం, విదేశీయానం చేసే వారయితే ప్రయాణంలో పాటించవలసిన మెలకువల వంటివి సామాజిక మీడియాతో షేర్ చేసుకోండి. లవ్ లైఫ్‌లో కొత్తదనాన్ని నింపుకోండి. భార్యతో అన్యోన్యతను, తలిదండ్రులతో ప్రేమానుబంధాలను కాపాడుకోండి. జనవరిలో కెరీర్ బాగుంటుంది. మే, జూన్‌లల్లో కీలక నిర్ణయాలు వద్దు. లక్కీ కలర్: క్రీమ్; లక్కీ నంబర్: 1
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
నూత్న సంవత్సరం అదృష్టకరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోండి. పనిని శ్రద్ధతో చేయండి. ఈ సంవత్సరం మీ ముందు కొత్త సవాళ్లుండవచ్చు.  కొన్ని సందర్భాల్లో సందిగ్ధావస్థలో కూరుకుపోవచ్చు. అయితే తొట్రుపడకండా జాగ్రత్తగా పని చేసుకుపోండి. నిధుల దుర్వినియోగానికి, మోసపు పనులకు పాల్పడటానికి మీకు అవకాశాలున్నప్పటికీ మీ నిజాయితీని, మీకున్న మంచి పేరును నిలుపుకోండి. అవిశ్రాంతంగా పని చేయాల్సి వస్తుంది.  భయపడకండి. తగ్గ ఫలితం కూడా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరిలో కీలక నిర్ణయాలు వద్దు. ఏప్రిల్ వరకు ఆన్‌లైన్ వ్యవహారాలకు దూరంగా ఉండండి. షేర్‌మార్కెట్ జోలికే వెళ్లవద్దు. లక్కీ కలర్: ఆరంజ్; లక్కీ నంబర్: 5
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)

కొత్త బాంధవ్యాలు ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు వద్దు. భయాందోళనలు విడిచిపెట్టండి. మీ కుటుంబ సభ్యులు, సన్నిహితులు మీ వల్ల బాగా లబ్ధిపొందుతారు. రిస్క్‌తో కూడుకున్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. డబ్బు, నగలు, బంగారం కన్నా, అవసరంలో ఆదుకోగలిగే ఆప్తులు మాత్రమే నిశ్చింతని ఇవ్వగలరని గుర్తుంచుకోండి. మీ సహోద్యోగులు లేదా కిందివాళ్లు చేసిన పని నచ్చనప్పుడు నేర్పుగా తెలియజెప్పండి. కంపెనీ మీకు కొత్త కారు ఆఫర్ చేస్తుంది. కెరీర్‌పరంగా దూసుకుపోతారు. మేలో స్పెక్యులేషన్‌కి దూరంగా ఉండండి. మార్చి, ఏప్రిల్ ప్రోత్సాహకరంమైనవి. లక్కీ కలర్: సముద్రపు నురగ రంగు; లక్కీ నంబర్: 2
 
లిబ్రా  (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)

 ప్రశాంతంగా జీవించడం ఎలాగో ఈ సంవత్సరం తెలుసుకుంటారు. వచ్చిన దాంతో సంతృప్తిని, సంతోషాన్ని పొందకపోతే చిక్కులు తప్పవు. ఎంతకాలం జీవించామన్నది కాదు... ఎంత సంతృప్తితో జీవిస్తున్నామన్నది ముఖ్యం. కొత్త ప్రాజెక్టులో లేదా వ్యాపారంలో ఉన్నప్పుడు ప్రాక్టికల్‌గా ఆలోచించడం, మసలుకోవడం అవసరమని గుర్తుంచుకోండి. అహం వల్ల చిక్కులు తప్పవు. కంటికి నచ్చినవారికన్నా, మనసుకు దగ్గరగా ఉన్నవారిని ఎంచుకోవడం వల్ల సంతోషంగా ఉండగలుగుతారని గుర్తుంచుకోండి. పెట్టుబడులకు ఫిబ్రవరి మంచిది. మేలో కీలక నిర్ణయాలు వద్దు. ఏప్రిల్‌లో తీవ్ర ఒత్తిడి తప్పదు. సెప్టెంబర్ తర్వాత జాగ్రత్త అవసరం. లక్కీ కలర్: ఆరంజ్; లక్కీనంబర్: 8
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
 ఇది చాలా అదృష్టకరమైన సంవత్సరం. ప్రశంసలు, బహుమానాలు, ఇంక్రిమెంటులు పొందే సమయం ఇది. మీకు, మీ భాగస్వామికి మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. సంవత్సరమంతా ప్రశాంతంగానే గడుస్తుంది. ఏ పని చేసినా లాభనష్టాలను బేరీజు వేసుకోండి. ఏం చేయొచ్చో, ఏం చేయకూడదో ఆలోచించి చేయండి. వీలైనంత వరకూ ప్రాక్టికల్‌గా ఆలోచించండి. సృజనాత్మకతను వెలికి తీయడానికి ఇదో గొప్ప తరుణం. బాంధవ్యాలు సంతోషాన్ని కలిగిస్తాయి. చిన్నపాటి అనారోగ్యాలు విసిగించే అవకాశం ఉంది. జనవరి బాగుంటుంది. మార్చిలో శ్రద్ధగా పని చేయండి. ఆగస్ట్‌లో చిన్న దుస్సంఘటన ఎదురు కావచ్చు. లక్కీ కలర్: వైట్; లక్కీ నంబర్: 6
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)

 ఎప్పటి నుంచో అనుకుంటోన్న కొత్త వ్యాపారాన్ని ఈ సంవత్సరం ప్రారంభిస్తారు. మీ తెలివితేటలు మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాయి. అయితే ఆలోచనలను అమలు చేయడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి మరి. ప్రేమ వ్యవహారాలు చేదును మిగల్చవచ్చు. మీకు తగిన వ్యక్తి తప్పకుండా వస్తారన్న నమ్మకంతో ఆ బాధను అధిగమించండి. వృత్తిపరంగా ఒడిదుడుకులు వస్తాయి. చేసే పనిలో నిరాసక్తత వల్ల ఓ మంచి అవకాశం చేజారిపోతుంది. అయితే తొందరలోనే మరో అవకాశం వస్తుంది కాబట్టి నిరుత్సాహపడకండి.  నవంబర్, డిసెంబర్ నెలల్లో ప్రయాణాలు ఉండవచ్చు. ఫిబ్రవరి, జూన్‌లు బాగుంటాయి. లక్కీ కలర్: బేబీ పింక్, లక్కీ నంబర్: 11
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
ఈ సంవత్సరం కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. ఇది మిమ్మల్ని ప్రశాంతంగా, సంతోషంగా ఉండేలా చేస్తుంది. బహుశా ఈ మార్పు మీ అంతట మీరుగా కాక పరిస్థితుల ప్రభావం కారణంగా ఏర్పడవచ్చు.వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకాస్త ప్రిపరేషన్ అవసరం. ఆచి తూచి అడుగేయండి. సంవత్సరమంతా విహార, వినోదయాత్రలతో సరదాగా గడిచిపోతుంది. కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో చికాకులు చోటు చేసుకుంటాయి. అయితే చిన్న చిన్న విషయాలకే మనసు కష్టపెట్టుకోకండి. మార్చి, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కీలక నిర్ణయాలు వద్దు. మే, ఆగస్ట్‌లు బాగుంటాయి. లక్కీ కలర్: పర్పుల్; లక్కీ నంబర్: 10
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
ఈ సంవత్సరం ఆర్థికంగా బలపడతారు కానీ అది క్రమంగా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి మీ పట్ల ఉన్న ప్రేమ ఇనుమడిస్తుంది. తనతో గడిపే మధుర క్షణాలను ఆనందమయం చేసుకోండి. ఊహించని గొప్ప అవకాశమొకటి మీ తలుపు తడుతుంది. దాన్ని వీలైనంత త్వరగా అందిపుచ్చుకుని పనిలో దిగండి. ఎప్పటి నుంచో ఉన్న ఓ బలమైన కోరిక నెరవేరుతుంది. ఇతరులను ప్రోత్సహించి ముందుకు నడుపుతారు. గతంలో మీ జీవితంలో ఉండి వెళ్లిన ఓ వ్యక్తితో మీ బంధాన్ని పునరుద్ధరించుకోవాలని ప్రయత్నిస్తారు. బాగా ఆలోచించుకోండి. పనిపరంగా, ఆర్థికంగా మార్చి చాలా బాగుంటుంది. లక్కీ కలర్: ఆరంజ్, లక్కీ నంబర్: 5
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
పెద్ద మొత్తంలో లాభాలు వచ్చి, ఈ సంవత్సరం సంతోషంగా గడుపుతారు. విజయం మీకు దగ్గరలోనే ఉంది. దాన్ని అంది పుచ్చు కోవాలంటే మీలోని సృజనాత్మకతను వెలికి తీయాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు కూడా ఇది కలసివచ్చే సమయం. ఎంతో డైనమిక్‌గా, నిజాయతీగా ఉండే ఓ వ్యక్తితో ప్రేమలో పడతారు. ఒకవేళ ఇప్పటికే ప్రేమలో ఉండివుంటే... మీకు తనపై ఉన్న నమ్మకం, ప్రేమలను మరింత బలపర్చుకోవడానికి ప్రయత్నించండి. మేనుంచి జులై దాకా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగస్ట్‌లో కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విస్తృతంగా ప్రయాణాలు ఉంటాయి. లక్కీ కలర్: సీ గ్రీన్; లక్కీ నంబర్: 4
 
టారో ఇన్సియా
టారో అనలిస్ట్
రేకీ గ్రాండ్ మాస్టర్
 
సౌర వాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
 అష్టమ శని కారణంగా ఈ రాశివారు బాగా ఆలోచించి మాత్రమే నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. కష్టాలూ నష్టాలు రావచ్చనే అభిప్రాయంతో ఉంటూ, ముందుగానే తగినంత ముందుచూపుతో వ్యవహరించాలి ఈ సంవత్సరమంతా. ఏదో జరిగిపోబోందనే భయం, మనోవ్యధ అసలు వద్దేవద్దు. ఏ సంశయం లేకుండా మీ పనిని మీరు చేసుకుంటూ సాగిపోండి. ధర్మబద్ధంగా చేస్తుండే మీ వ్యవహారశైలి కారణంగా ఏ నష్టమూ కష్టమూ మీకు కలగదు. పిల్లల పెళ్లిళ్లు వంటి శుభకార్యాలకి కొంత సమయం పట్టవచ్చు కాబట్టి దిగులుపడిపోకండి.  మానసికమైన బెంగ తప్ప, జరిగే పనులు జరుగుతూనే వెళ్తాయి. ఇంట్లో ఏ దుర్వార్తలనీ వినరుగానీ ఆందోళన తప్పకపోవచ్చు.
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
రోజులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయని భావించవద్దు. ముఖ్యంగా రుణాలను ఈయడం, అనవసర వ్యవహారాల్లో జోక్యం, అంతపనినీ తామే చేయగలమని భావించడం సరి కాదు. అన్నిటికీ మించి ఈ రాశివారు తమని తాము ప్రశంసించుకోకూడదు. జీవితంలో ఒక కొత్తకోణంలో మీరు మీ దృష్టిని ప్రసరింపజేస్తారు. నిర్వేదం నిస్పృహ పూర్తిగా తొలగిపోయి పనిని సాధించి తీరాలనే పట్టుదల, పనికోసం వెంటపడటం, ముగిసేవరకు విశ్రమించకపోవడం, కొత్త పనుల్ని నెత్తిమీద వేసుకోకపోవడం, నా పనే నాకు ముఖ్యమనే ధోరణిలో ఉండడం... ఇలా అయిపోతారు. స్వప్రయోజనాలే ముఖ్యమనే ధోరణితో ఉంటే అవసరంలో మీకు ఎవరూ కలిసిరారు అని గ్రహించుకోండి.
 
జెమిని (మే 21-జూన్ 21)
ఏదో ఒక విషయాన్ని గురించి బాగా ఆలోచించి, అనుభవజ్ఞుల్ని సంప్రదించి ఆ సమస్య పరిష్కారానికి ఓ నిర్ణయాన్ని తీసుకోండి. మంచిదే. అయితే ఆ నిర్ణయాన్ని గురించి మళ్లీ వెనక్కి వెళ్లి ఆలోచిస్తూ సరికాదేమో అని మథనపడుతూ ఉండద్దు. మీ నిర్ణయం తప్పుకా(బో) దు. దాన్ని గురించిన వ్యధ సరికాదు. ఉద్యోగపరంగా స్థానచలనం, అద్దె ఇల్లు మారడం లేదా నివసిస్తున్న ఊరు మారడం లేదా స్వదేశాన్నే మారడం జరగవచ్చు. అలా వచ్చిన మార్పు పట్ల నిర్లక్ష్యం, మార్పు వచ్చేసిందన్నధీమా ఏమాత్రం సరికావు. జాగ్రత్తని పాటించండి. ఉన్నంతలోనే ఉండండి తప్ప, ఆడంబరాలకోసం ధనవ్యయం ఏ మాత్రమూ సరికాదు. ధనవిషయంలో మరింత జాగ్రత తప్పనిసరి.
 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
మీకు ఇబ్బందులు రావుగాని, మీ కుటుంబ సభ్యులకో, మీ ఆప్తులకో వచ్చిన ఇబ్బందులని తీర్చడం కోసం మీరు శ్రమపడాల్సి వస్తుంది. ఈ రాశివారి దశ బాగున్న కారణంగా వీరి వల్ల సమస్యలు తీర్చబడతాయి గాని చిక్కు ముడిపడిపోవు. రచయితలూ వినోదరంగం వారూ గుర్తింపును పొందుతారు. లోపల అగ్నిపర్వతం ఉడుకుతున్నా, పైకి పెరుగుకుండలా చక్కగా ఉండగల శక్తి మీకు భగవంతుడిచ్చిన వరం. ఆ కారణంగానే సంతానం ఆరోగ్యం ఉద్యోగమనే వ్యవహారాల్లో మనోవ్యధని అనుభవిస్తున్నా బయటపడకుండా జీవిస్తుంటారు మీరు. నడిలోతు దాటి మెల్లగా ఒడ్డువైపుకి వస్తున్నారు కాబట్టి చెప్పుకోదగిన ఇబ్బందులుండవు. క్రమక్రమంగా సమస్యలు పరిష్కరింపబడుతూ వెళ్తాయి.
 
లియో (జూలై 24-ఆగస్టు 23)
ఆరిపోయిందనుకున్న నిప్పు మళ్లీ చిన్నగా చెలరేగుతూ ఉంటుంది అర్ధాష్టమ శని కారణంగా. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించి ఆ లాభంతో రుణాలని తీర్చాలనే ఆలోచన వద్దు. మీకు ఎందరో సహాయపడుతూ మీ కష్టాల ఎండలకి చక్కని గొడుగు పడతారు. భయం వీడండి.  అప్పు చేసి, ప్రయోజనాత్మకమైన స్థలాన్నో ఇంటినో వ్యాపార నిమిత్తం తీసుకుంటారు. అది మంచికే అవుతుంది. భర్త/భార్య ఆరోగ్యాన్ని గమనించుకుంటూ ఉండాలి. సంతానానికి విద్య అబ్బుతుంది. వ్యాపారం చేయాలనే ఆలోచన మంచిదే గాని, తగ్గ ప్రణాళికని  ముందే స్థిరంగానూ, దృఢంగానూ వేసుకోవాల్సి ఉంది. సహాయం చేస్తామన్నవారు సహాయపడరని అనుకుంటూ ఆ ప్రణాళికని రచించుకోవాలి.
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మీ శరీరారోగ్యాన్ని సక్రమంగా రక్షించుకోలేక అశ్రద్ధ చేయడమే మీకు రాబోయే సమస్య. అనారోగ్యమనేది తీవ్ర ఉండదు కాని, నిరంతరం అనారోగ్యాన్ని గురించిన ఆలోచనని చేయకుండా ఉండ(లే)రు. వ్యాపారంలో భాగస్వాముల్ని గమనిస్తూ ఉండాలి. ‘ఇది తప్పు’ అని తెలిసీ  చేయాల్సిన పరిస్థితిలో పడతారు. ‘వద్దు’ అనుకున్న వివాహమే నిర్ణయించుకోవలసి వస్తుంది. ఇలాంటి క్లిష్టపరిస్థితిలో ఏమాత్రమూ సంశయించకుండా ‘కాదు- కుదరదు- వద్దు’ అని దృఢంగా నిశ్చయించుకోండి తప్ప మనస్సాక్షికి వ్యతిరేకంగా వెళ్లద్దు. కొంతకాలమయ్యాక ‘అయ్యో! అలా చేసి ఉంటే బాగుండేది’ అని మీకు అనిపించినా ఆ పనిని చేసి ఉండకపోవడమే మంచిదని మీకు అర్థమౌతుంది అనుభవంలో.
 
లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
 గట్టి పట్టుదలతోనూ, ఎందరో మిమ్మల్ని రెచ్చగొట్టిన కారణంగానూ అనవసరమైన న్యాయ(స్థాన)వివాదంలో పడి- మీకున్న అభిమానం కారణంగా వెనక్కి తిరిగి రాలేకపోతారు. సమస్య ఎవరితో వచ్చిందో నేరుగా వారితోనే మెత్తగా మాట్లాడినట్లయితే తప్పక చిక్కు వీడిపోతుంది. మీ జీవితం ఇతరులకోసం కాదు- మీ కోసమని ఆలోచించుకోవాలి. ఆర్థికమైన లోటుని అనుభవిస్తూ ఉండవచ్చు. చేస్తున్న పని లేదా చేసిన పని సరికాదనే ఆలోచన మనసుకి వచ్చినా- మంచిదే అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటారు. దానిక్కారణం మీ తలిదండ్రులూ విశేషించి తల్లీ కారణం కావచ్చు. ఆస్తిని అమ్మకానికి పెట్టి దాన్ని ఉపసంహరించుకోవచ్చు. మనశ్శాంతి లోపించడం, మరపు కూడా ఏర్పడవచ్చు.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)
మీ ధైర్యం మీ ధర్మబద్ధ విధానం మీ నిజాయితీలే మీ ఆయుధాలుగా  యుద్ధం జరిగినప్పుడు ఆ యుద్ధంలో కొంత ఎలా నష్టపోక తప్పదో, అదే తీరుగా కొంత (ధనం పరిచయాలు పలుకుబడి, గౌరవం...) నష్టపోతారు తప్ప విజయం మీదే. మీరెవరెవరికి సహాయపడ్డారో, వారే మీ మార్గానికి అడ్డుపడుతూ మిమ్మల్ని యాతనలకి గురి చేయవచ్చు- బెదిరించవచ్చు-కోర్టుకి పోవచ్చు కూడా. బెదిరిపోవాల్సిన పని లేదని గ్రహించండి. ఆవేశం సాహసం, ఎదురు దాడిని చేయదలచడం వద్దు. మీకు కాలం సరిలేదు కాబట్టి, సముద్రపు కెరటం బలంగా వచ్చినప్పుడు తలవంచినట్లు తప్పుకోవడం మంచిది. వాగ్దానాలూ హామీలూ రాతకోతలూ వద్దు. శాంతి ఖడ్గమనేది కోట్ల తలల్ని నరకగలదు.
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)    
మీరు ఆత్మస్థైర్యంతో పనిని చేయడమనేది స్వాగతించదగినదే అయినా, మీ కుటుంబ సభ్యులతో ముందుగా చెప్పడం అవసరం. లేనిపక్షంలో  పనికి అభ్యంతరం కలగవచ్చు. భార్యాభర్తల అన్యోన్య విషయంలో భార్య తప్పక భర్తకి అనుకూలంగా ఉండవలసిందే. లేనిపక్షంలో ఈ రాశివారిలో పొరపచ్చాలు పెద్దవి అయ్యే అవకాశం ఉంది. సొమ్మువిలువ మీకు బాగా తెలిసొచ్చే కాలమిదే. ఇకనుండి రూపాయినీ వందగా లెక్కించవలసి వస్తుంది. రుణాలని పై వ్యక్తులనుంచి తీసుకోకూడని కాలమిది. పై అధికారులతోనూ కింది ఉద్యోగులతోనూ, తోటివారితోనూ మీ గొప్పదనాన్ని చాటుకోవద్దు- ఇతరుల అసూయ కారణంగా పరిస్థితులు తారుమారు కావచ్చు. ఎవరినీ విరోధించకండి.
 
క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20)
 చేపట్టిన పని ఒక సందర్భంలో పూర్తి కాకపోవచ్చు. ఏమైనా సరే అని దూసుకుని వెళ్తే మొదటికి మోసం రావచ్చు. వివాదాల జోలికి వెళ్లద్దు. స్థానచలనం మంచిది కాదు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే ముందు తగినంత సిబ్బంది ఉన్నారా లేదా? పరిశీలించుకుని దిగండి. అనుకున్న ప్రయాణాలు వాయిదా పడవచ్చు. చేద్దామనుకున్న ఉద్యోగం దూరం జరిగిపోవచ్చు. తీసుకున్న రుణాన్ని తీర్చడం లేదా పొందుదామనుకున్న రుణం తీసుకోవడం అనేవి వాయిదా పడుతూ వెళ్లవచ్చు. బంధుమిత్రుల ఉదాశీన వైఖరి వల్ల కొంత నిర్వేదం - మీలో కలగవచ్చు. కుటుంబ రహస్యాలని మీ తలిదండ్రులకీ అత్తమామలకీ తప్ప మరెవరికీ తెలియడం నాకిష్టమైనది కాదనే విషయాన్ని అందరికీ చెప్పండి.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)

న్యాయస్థానంలో ఉన్న అపరిష్కత సమస్యల గురించి వ్యర్థ ప్రయత్నాలని మానండి. సంతానానికి సంబంధించిన ఓ సమస్యని గుర్తించిన తొలిరోజుల్లో మానసికంగా కుంగిపోవచ్చు. భయం అనవసరం. ఏదో ఇల్లూ స్థలం యంత్రం... ఇలా పెద్దమొత్తంలో దేన్నో ఒకదాన్ని కొనే ఆలోచన మీకు బలంగా రావచ్చు. దానికి తగిన ఆదాయం రుణసౌకర్యం... ఇవన్నీ అప్రయత్నంగా మీకు సిద్ధించవచ్చు. ఇంతకుముందు లేని విధంగా ఈసారి మీ అత్తమామలతోనూ దగ్గర బంధువులతోనూ సత్సంబంధాలని మీరు కొనసాగించవచ్చు. మీ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడంలో మీరు వెనకడుగు వేయడం సరికాదుగాని, చెప్పే శైలిలో తీరులో మాత్రం కాఠిన్యం ఉండకూడదని గ్రహించండి.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
 ఒకప్పుడు పెద్దల సమక్షంలో చేసుకున్న ఒప్పందం తారుమారు కావచ్చు. మీదైన ఇల్లు, పొలం వాహనం వంటి వాటిని మొగమాటానికి పోయి మరెవరికో తాత్కాలికంగానైనా రిజిస్టర్ చేయకండి. ఇబ్బంది పెట్టే భార్యాభర్తల్లో భార్యతో ఆ భర్త మంచిగా ఉండగలిగితే సమస్య నివారింపబడుతుంది. సంతానాన్ని గురించి బాగా పట్టించుకుంటారు. పిల్లల చదువులకోసం మీరు, వాళ్లకి దగ్గరగా మీ నివాసాన్ని మార్చుకోవడం గాని, వాళ్లని మంచి చోటులో చేర్చాలనే ఆలోచనకి రావడంగాని చేస్తారు. మీ సమీప బంధువులు జీవితంలో ఓ సమస్యకి గురికావచ్చు. దాని ప్రభావం మీమీద పడవచ్చు. దానిని ఏమాత్రమూ పట్టించుకోకపోవడం మంచిది. దూరాభార ప్రయాణాల్లో ఆరోగ్యం చెడవచ్చు.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు
 
 

Advertisement
Advertisement