ఓ చెమ్మ చెక్క... ఓ మల్లె మొగ్గ | Sakshi
Sakshi News home page

ఓ చెమ్మ చెక్క... ఓ మల్లె మొగ్గ

Published Sun, Aug 23 2015 12:15 AM

ఓ చెమ్మ చెక్క... ఓ మల్లె   మొగ్గ

స్టార్టింగ్ నుంచి క్లైమాక్స్ దాకా ప్రేక్షకుడు అవే కళ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటాడు...
మిస్టరీ ఈజ్ వెరీ గ్రిప్పింగ్... కానీ...
ఈ సినిమా చూస్తే ఒక్కటే ప్రాబ్లం...
నిద్ర పట్టదని అనుకుంటున్నారా?
చీకటంటే భయమేస్తుందనుకుంటున్నారా?
డోరు కిర్రుమన్నా, కిటికీ కటక్కుమన్నా
పైప్రాణాలు హుష్‌కాకి అనుకుంటున్నారా?
 అందరి కళ్లల్లో ఒక హంతకుడు కనబడతాడేమో అనుకుంటున్నారా?
 అనుమానం పెనుభూతమై వెంటాడుతుందని అనుకుంటున్నారా?
 అబ్బే... అవేవీ కాదండీ.... సినిమా ఎంజాయ్ చేస్తారు...
 మరి వాటీస్ ద ప్రాబ్లెం? ‘నాకిక్కడే ఇప్పుడే తెలియాలి.’
 ఓకే... ఓకే.... గడబిడ అంతా ఏంటంటే...
 కృష్ణగారిని చూసిన కళ్లతో మహేశ్‌బాబును చూస్తే
 అంత ముచ్చటగా అనిపించకపోవచ్చు.
 కావాలంటే కళ్లెట్టి చూడండి... మళ్లీ చూడండి.

 
 చిమ్మ చీకట్లో రెపరెపలాడుతున్న దీపంలా ఉంది ఆ బంగళా. ఆ బంగళాలో మిగిలి ఉన్న ప్రాణాలూ కొద్దిరోజులుగా రెప రెపలాడుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఏ ప్రాణం ఆరిపోతుందో తెలియదు. కానీ ఆరిపోక తప్పదని మాత్రం ఆ ఇంట్లోని ఒకరికి ఖాయంగా తెలుసు. ఆ ఒక్కరు కాంచన . కాంచనతో పాటు ఇంకో వ్యక్తికి కూడా... గాలిలో కలవబోయే ఆ ప్రాణాల గురించి తెలుసు. అతడెవరో కాదు, ఆ ఇంటి వాళ్లను ఒక్కొక్కరిగా మట్టుబెడుతున్న హంతకుడు! ఎవరా హంతకుడు? ఎందుకు ఈ హత్యలన్నీ చేస్తున్నాడు. అసలు అతడు ఇంట్లోని వాడా? ఇంటి బయటి వాడా? ఇంటికి వచ్చిపోతున్నవాడా? ఎవరికీ తెలీదు.

 మరి కాంచనకు ఎలా తెలిసింది? ఈ హత్యల్లో ఆ అమ్మాయి ప్రమేయం ఉందా? భాగస్వామ్యం ఉందా? లేదు. పాపం అసలా అమ్మాయికి ఏ పాపమూ తెలియదు. మద్రాసులో చదువుకుంటూ సెలవులకని ఫ్రెండ్స్ రేణుక, సాధన, విజయ, లక్ష్మిలను వెంటేసుకుని వచ్చింది. వచ్చీరాగానే పిన్నిని వితంతువుగా చూసి నిశ్చేష్టురాలవుతుంది. ఆమె భర్తను ఎవరో హత్య చేశారని తెలిసి చిగురుటాకులా వణికిపోతుంది.

 ఆ వణుకు అక్కడితో ఆగదు. సినిమా చివరి వరకూ కొనసాగుతూనే ఉంటుంది. ఆ అజ్ఞాత హంతకుడు ఆమెకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. నెక్స్ట్ ఎవరిని చంపబోతున్నాడో చెబుతుంటాడు! సినిమాలోని డ్రామా అంతా ఈ ఫోన్ కాల్స్ మధ్యే సాగుతుంటుంది.

 మొదటి కాల్...
 ‘‘సుశీ... ఫోన్ పెట్టేస్తావా!.. కాస్త ఆగమ్మా. శుభవార్త చెబుతాను. అది విని పెట్టేద్దువుగానీ’’
 ‘‘ఎవరు నువ్వు... ఎవరు నువ్వు...’’
 ‘‘తొందరపడకమ్మా... సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే నేనెవర్నో. నీ తండ్రి చూశాడు నన్ను... చావడానికి ఒక్క నిమిషం ముందు. నీ బాబాయీ అంతే. నన్ను చూశాకే కన్నుమూశాడు. ఈసారి మీ ఇంట్లో నన్ను చూసే అదృష్టం ఎవరిదో తెలుసా? హా హా హా... హా హా హా...’’
 కాంచన భీతహరిణేక్షిణి అవుతుంది. ఏడాది క్రితం- తన తండ్రి కారు యాక్సిడెంట్‌లో పోలేదని, కారుకు యాక్సిడెంట్ చేసి ఆ హంతకుడే చంపేశాడని ఆమెకు అర్థమౌతుంది. అలాగే తన రెండో బాబాయి ఆత్మహత్య చేసుకోలేదని, అదే  హంతకుడు ఆయన్ని హత్య చేసి, ఉరి వేశాడని తెలుసుకుంటుంది. తన బాయ్‌ఫ్రెండ్ కృష్ణ సహాయంతో అతడిని పట్టుకోవాలని ప్రయత్నిస్తుంది. ఆలోపే ఆ హంతకుడు ఆ బాబాయి భార్యనూ చంపేస్తాడు!

 రెండో కాల్...
 ‘‘సుశీ... ఏదో అల్లరి పిల్లవులే అనుకున్నాను. చాలా గడుసుదానివి సుమా. నన్ను పట్టుకునే దాకా వచ్చిందా నీ సాహసం. అయితే ఇక నిన్ను విడువకూడదు. పోతావా మీ నాన్న దగ్గరికీ... ఊ! హా హా హా... హాహాహా...’’
 గుండె చిక్కబట్టుకుంటుంది కాంచన. తన వారిలో ఎవరిని కాపాడుకోవాలో, ఎలా కాపాడుకోవాలో తెలియక సతమతం అవుతున్న ఆ అమ్మాయి... హంతకుడు తనను కూడా టార్గెట్ చేశాడని తెలిసి మరింత భయపడిపోతుంది. ఓ రోజు కాంచన, ఆమె ఫ్రెండ్స్ ఇంట్లో ఒంటరిగా ఉంటారు. పెద్దవాళ్లెరూ ఉండరు. రాజనాల పొరుగూరు వెళ్తాడు. ఆయన తమ్ముడు ఊళ్లోనే ఏదో పని మీద వెళ్తాడు. అదే సమయానికి కాంచన కోసం ఇంటికి వస్తాడు కృష్ణ. అప్పుడు వస్తుంది హంతకుడి నుంచి మరో కాల్.

 మూడో కాల్...
 ‘‘సుశీ... నీ పెద్ద బాబాయి ఊళ్లోనే లేడు. నీ చిన్న బాబాయి బార్లో ఉన్నాడు. నువ్వు ఈ వేళ ఒంటరిగా ఉన్నావు. పోమ్మా, పోయి ఇష్టమైనవన్నీ తిని, తయారుగా ఉండు. నేను ఇప్పుడే వస్తున్నాను. ఇదే నీ ఆఖరు’’ అని హెచ్చరిస్తాడు హంతకుడు.
 ఆ రాత్రి కాంచనకు తోడుగా ఉంటాడు కృష్ణ. కానీ అందరి కన్నుకప్పి మరో హత్య చేస్తాడు ఆగంతకుడు. కాంచన రెండో బాబాయి హతుడౌతాడు. హంతకుడు కాపుగాసి మరీ, అతడు ఇంటికి రాగానే కత్తితో పొడిచి, పారిపోతాడు. కృష్ణకు అర్థమైపోతుంది. నెక్ట్స్ టార్గెట్ కాంచనేనని. ఇప్పుడేం చెయ్యాలి? హంతకుడిని ఎలా పట్టుకోవాలి? అప్పుడొస్తుంది మళ్లీ ఇంకొక కాల్.

 చివరి కాల్...
 ‘‘సుశీ... తప్పించుకు పోదామనుకున్నావా? ఎలాగైనా విజయం నాదే. ఇవాళ నీకు పెట్టిన గురి తప్పి, నీ బాబాయ్‌కి తగిలింది. హా హాహా...’’
 కాంచన గజగజ వణికిపోతుంది. హంతకుడికి ఇంత పగేమిటి? ప్రతీకారం ఏమిటి? అన్నెంపున్నెం ఎరుగని వారందరినీ చంపడం ఏమిటి?
 ఈ మిస్టరీని ఛేదించే సమయం ఆసన్నమైందని అనుకుంటాడు కృష్ణ.
   
 అప్పటికి ఆ బంగళాలో ప్రాణాలతో మిగిలిన వారు రాజనాల, కాంచన మాత్రమే. మిగతావారు ఆ ఇంటివారు కాదు. ఆ ఇంటితో సంబంధం ఉన్నవారు. అప్పటికే రాజనాల పెద్దన్నయ్య, రెండో అన్నయ్య, ఆయన భార్య, రాజనాల తమ్ముడు... ఇలా వరుసగా ఒక్కొక్కర్నీ హంతకుడు చంపేసి ఉంటాడు. ఆ హంతకుడెవరన్నది సస్సెన్స్?
 ఆ హంతకుడిని అందరికన్న ముందు... కృష్ణ చూస్తాడు! వాడితో పోరాడుతూ.. చురకత్తి పదునున్న, పగతో రగులుతున్న, ప్రతీకారంతో జ్వలిస్తున్న ఆ కళ్లను చాలా దగ్గరగా చూస్తాడు.
 ఇంతకీ ఆ కళ్లెవరివి?
 అనేక రహస్యాలు రెండోప్రాణికి తెలియనివ్వని రాజనాలవా?
 హత్య జరిగిన ప్రతిసారీ అక్కడే ఉంటున్న డాక్టర్ నాగభూషణానివా?
 తోడబుట్టకపోయినా, సొంత సోదరునిలా మెలిగే రామయ్య తాతవా?
 కర్కశత్వం మూర్తీభవించిన డ్రైవరువా?
 ఎప్పుడూ చేత్తో కత్తి పట్టుకుని తిరిగే వంటవాడు రమణారెడ్డివా?
 కాంచనను ప్రేమించి, ఆ బతుకులో భాగస్వామి కాగోరే కృష్ణవా?
  లేక...
 హత్య జరగ్గానే పారిపోయి కనుమరుగయ్యే అజ్ఞాత యువతివా?
 వీరందరిలో ఆ ‘కళ్లు’ ఎవరివి?

 క్లైమాక్స్
 ఆ కళ్లు ఎవరివో కాంచన పుట్టినరోజు నాడు బయట పడుతుంది. ఓ ఆగంతకుడు బాల్కనీలోకి చొరబడి, హాల్లో కేక్ కట్ చేయబోతున్న కాంచనకు గురిపెట్టి తుపాకీ పేల్చుతాడు. అది మిస్ అవుతుంది. అంతా ఆగంతకుడిని వెంబడిస్తారు. అతడు బంగళా బయటికి పరుగెత్తి అదృశ్యమైపోతాడు. ఈలోపు పొదల్లోంచి రామయ్య తాత మూలుగులు వినిపిస్తుంటాయి. ‘‘ఏమైంది తాతా?’’ అని అనడిగితే ఎవరో తనను తలపై బలంగా కొట్టి అటుగా పారిపోయాడని చెబుతాడు. ఈలోపు ఇన్‌స్పెక్టర్ కూడా అక్కడికి చేరుకుంటాడు. కుటుంబ సభ్యులంతా ఒకచోటికి చేరుకుంటారు. ఎందుకా ఆగంతకుడు ఇలా వరస హత్యలకు పాల్పడుతున్నాడని ఆలోచనలో పడతారు. ఎవరైనా శత్రువులున్నారా అని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటారు.

 అప్పుడు రాజనాల ఓ భయంకరమైన నిజాన్ని బయటపెడతాడు. తన తండ్రికి వేరే స్త్రీతో సంబంధం ఉందని, ఆవిడకు ఒక కొడుకు కూడా ఉన్నాడని, పెద్దన్నయ్యకు అది ఇష్టం లేక తల్లీకొడుకులు ఇంట్లో ఉండగా ఆ ఇంటికి పెద్దన్నయ్య నిప్పు పెట్టాడని చెబుతాడు.

 తండ్రి మరణించినప్పుడు ఆ కుర్రాడి వయసు 10 సంవత్సరాలు. తండ్రి మరణించి పదిహేను సంవత్సరాలయ్యింది. అంటే ఆ వ్యక్తికి ఇప్పుడు పాతిక సంవత్సరాలు ఉంటాయి. కాబట్టి ఆ వ్యక్తి బతికి ఉండి (మంటల్లోంచి తప్పించుకుని) పగబట్టి ఉండవచ్చునని అనుకుంటారు.

 ఈలోగా... పగబట్టిన ఆ కళ్లను నేను చూశాను అంటాడు కృష్ణ. ఆ కళ్లను మళ్లీ ఒక్కసారి చూసినా గుర్తుపడతానంటాడు. ఒక్కొక్కరికి ముసుగు వేస్తూ కళ్లను పోల్చుకుంటూ ఉంటాడు. చివరికి రామయ్య తాత కళ్లు చూడగానే అవే కళ్లని గుర్తు పడతాడు.

 తన తల్లి మంటల్లో కాలిపోవడం చూసి ప్రతీకారంగా ఈ కుటుంబాన్ని సమూలంగా నాశనం చేస్తానని తల్లికి ప్రమాణం చేశాననీ, ఒక్కొక్కరిగా చంపాననీ, ఇంకా ఇద్దరే మిగిలి ఉన్నారని, ఒకటి రాజనాల, మరొకరు కాంచన అని చెబుతాడు రామయ్య తాత వేషంలో ఉన్న యువకుడు. ఆ తర్వాత ఆ యువకుడు అక్కడి నుంచి పారిపోతుండగా గుమ్మడి వచ్చి రివాల్వర్‌తో కాల్చేస్తాడు. కృష్ణ సిఐడిగా వచ్చాడని గుమ్మడి చెప్తాడు.

 కథలో క్రైమ్, సస్సెన్స్ మాత్రమే కాదు, ఎమోషన్ కూడా ఉంది. అది సినిమా మొత్తంలో ఒకే ఒక్కసారి కనిపిస్తుంది. రామయ్య తాత వీణ వాయిస్తూ ఉండగా కాంచన, ఆమె ఫ్రెండ్స్ రాగానే వీణను పక్కన పెడుతూ ‘అమ్మా’ అంటూ అమ్మని తలచుకుంటాడు. లాస్ట్ సీన్‌లో అతడు ఇన్‌స్పెక్టర్ తుపాకీ తూటాకు నేల కూలి వీణపై పడ్డప్పుడు ఆ దృశ్యం ఎంతో హృద్యంగా ఉంటుంది. అమ్మ జ్ఞాపకాలను వదల్లేక, అమ్మలోనే ఐక్యమైన ఆ హంతకుడిని తలచుకుంటే అతడెంత హంతకుడైనా సరే జాలేస్తుంది.    
- సాక్షి ఫ్యామిలీ
 
► రాజనాల, వెన్నిరాడై నిర్మల మీద ‘చెలిని చెంతకు పిలుచుకో’ పాటను చిత్రీకరించారు. సముద్రపు ఒడ్డున చిత్రీకరించిన ఈ పాటలో వెన్నిరాడై నిర్మల స్విమ్‌సూట్‌లో కనిపిస్తారు.
► కృష్ణ నటించిన తొలి హారర్, సస్పెన్స్ మూవీ.
► ఫస్ట్ రన్‌లో సినిమా పెద్దగా అనిపించలేదు. క్రమక్రమంగా ఊపు అందుకుంది.
► పాటలన్నీ సూపర్ హిట్. ‘మా ఊళ్లో ఒక పడుచుంది. దయ్యమంటే భలే భయమన్నది’ అనేపాటైతే సూపర్ డూపర్ హిట్.
► కాంచన డాన్స్, కృష్ణ అందం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్స్.
► పద్మనాభం, గీతాంజలి మధ్య కామెడీని దర్శకుడు సందర్భోచితంగా పండించారు. గీతాంజలి తల్లిగా కనకం చేశారు.
► సంసారం చదరంగం లాంటి చిత్రాలు చేసిన ఎస్.పి.ముత్తురామన్ ఈ చిత్రానికి అసిస్టెంట్ డెరైక్టర్.
► కాంచన పక్కన డాన్స్ చెయ్యడానికి కృష్ణ తడబడ్డాడట. ఆ తడబాటు కనిపించకుండా కాంచన ఆయన్ని కలుపుకునిపోయారట.
► అద్దె ఇల్లు కోసం కృష్ణ, పద్మనాభం భార్యాభర్తల్లా నటిస్తారు. పద్మనాభం ‘రోసీ’గా ఆడవేషంలో కనిపిస్తారు.
► హీరోగా కృష్ణకిది 10వ చిత్రం. (మొత్తం 350కి పైగా చిత్రాలలో నటించారు).
►ప్రతి పాత్ర మీదా ఓ అనుమానం క్రియేట్ చేస్తూ దర్శకుడు చూపిన ప్రతిభ భేష్ అనదగ్గది.

Advertisement
Advertisement