మంద్రస్వరం మత్తెకెత్తిస్తోంది..! | Sakshi
Sakshi News home page

మంద్రస్వరం మత్తెకెత్తిస్తోంది..!

Published Mon, Oct 21 2013 11:12 PM

మంద్రస్వరం మత్తెకెత్తిస్తోంది..!

పవర్‌ఫుల్ వాయిస్‌తో డైలాగ్‌లు చెప్పే హీరోల కన్నా.. కాస్తంత మంద్ర స్వరంతో డైలాగులు చెప్పే హీరోలే అమ్మాయిల మనసుపై చాలా త్వరగా మత్తు చల్లగలరు అని అంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. అబ్బాయిల వాయిస్- అమ్మాయిల మనసు అనే అంశంపై వారు జరిపిన పరిశోధన ఫలితంగా ఈ వివరాలు వెల్లడయ్యాయి. కాలేజ్ లోనైనా, సినిమా హీరోల విషయంలోనైనా అమ్మాయిల ఛాయిస్ మంద్రస్వర మాంత్రికులకేనన్నారు. కాలేజ్‌లో తమతో మాట్లేడే అబ్బాయిల విషయంలో కంచుకంఠాల కంటే.. కాస్తంత మొహమాటంతో, కొంచెం సంకోచంతో.. నెమ్మదిగా మాట్లాడే అబ్బాయిలనే అమ్మాయిలు త్వరగా ఇష్టపడతారట.

అబ్బాయితో మాట్లాడేటప్పుడు అమ్మాయిలు అతడి వాయిస్‌ను బాగా పరిశీలిస్తారట. 87 శాతం మహిళల్లో ఈ లక్షణం ఉంటుందట. తమతో మాట్లాడే వాడి వాయిస్ బాగా నచ్చితే అతడితో సంభాషణను కొనసాగించడానికి ప్రాధాన్యతనిస్తారట. బ్రిటన్‌లోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీ వారు ఈ విషయం గురించి విశ్లేషించారు. ‘‘ మనిషి వాయిస్ తను మాట్లాడుతున్న వక్తిని బట్టిగాక.. ఆ వ్యక్తితో ఉన్న అనుబంధాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫ్రెండ్స్‌తో, ఇంట్లో వాళ్లతో, బయటి వాళ్లతో, పరిచయం ఉన్న వాళ్లతో, లేని వాళ్లతో.. ఇలా  రిలేషన్ బట్టి మనిషి వాయిస్‌ను మారుస్తాడు.

ఇష్టమైన వాళ్లు ఫోన్ చేస్తే ఆ కాల్ రిసీవ్ చేసుకొని ‘హలో..’ అనడంతోనే ఆ వ్యక్తికి మీద ప్రేమాభిమానాల స్థాయి తెలిసిపోతుంది వ్యక్తమవుతాయి. ఈ విషయాన్ని మహిళలు మరీ సీరియస్‌గా తీసుకొంటారు. తొలి పరిచయంలోనే అబ్బయి గొంతులోని సౌమ్యతను పరిశీలిస్తారు..’’ అని అభిప్రాయపడ్డారు పరిశీలకులు. కొంతమంది సినిమా నటుల, సెలబ్రిటీల వాయిస్ విషయంలో కూడా మహిళల అభిప్రాయాలను తీసుకొన్నారు.

వారిలో గంభీరంగా, గట్టిగా పదాలను వదిలే వారికన్నా.. కోపాన్ని కూడా చాలా సౌమ్యమైన వాయిస్‌తో చెప్పే వాళ్లే తమకు ఎంతో ఇష్టమని అభిప్రాయాలు వ్యక్త పరిచారు మహిళా మణులు. 87 శాతం మహిళలు ఇలాంటి అభిప్రాయాన్నే చెప్పారని అంటే.. మగాడి వాయిస్ విషయంలో ఆడవాళ్లో అభిప్రాయంలో చాలా సామ్యత ఉందను కోవాలి. ఇక తమ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ గురించి కూడా వివరించారు కొంతమంది మహిళ లు. రొమాంటిక్ మూడ్‌లో తమ మగవాళ్లు ఆటోమెటిక్‌గా వాయిస్‌లో పిచ్ తగ్గిస్తారని వారు చెప్పారు.

అయితే ఈ విషయంలో కూడా కొంతమంది మహిళలు తమ వారిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే.. తమ పనిలో బిజీగా ఉన్న తమ పార్టనర్ గట్టిగా మాట్లాడతాడని.. ఆ పలకరింపే తమను నీరు గార్చేస్తుందని  వారు చెప్పారు. వీరందరి అభ్రిపాయాలను బట్టి.. అమ్మాయిలు మంద్రస్వరాన్నే కోరుకొంటున్నారని స్పష్టంగా చెప్పవచ్చు అని అంటున్నారు పరిశోధకులు. మరి ఇకేంటి.. అబ్బాయిలు.. ఇష్టమైన అమ్మాయితో మాట్లాడేప్పుడు కాస్తంత స్వరం తగ్గించండి!
 

Advertisement
Advertisement