ఉన్న ఊరూ... కన్నతల్లీ! | Sakshi
Sakshi News home page

ఉన్న ఊరూ... కన్నతల్లీ!

Published Wed, May 31 2017 11:58 PM

ఉన్న ఊరూ... కన్నతల్లీ!

ఆత్మీయం

రావణసంహారం పూర్తయిన తర్వాత లంకలో ప్రవేశించారు రామలక్ష్మణులు. రావణుడు మనసుపడి కట్టించుకున్న కోటను స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు లక్ష్మణుడు. మనసులోని మాటను అన్నగారితో చెప్పాడు. రావణ రాజసౌధం సామాన్యమైంది కాదు. అంతా మణిమయమే. ఎటు చూసినా బంగారమే. కాని, రాముని తీరు వేరు. ఆయనకు దురాశ ఉండదు. ధర్మం తప్పడు. లక్ష్మణుని సలహాను సున్నితంగా తిరస్కరిస్తాడు. ‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ’ అంటూ అయోధ్యవైపు చూడాలని సూచన చేస్తాడు. లంక విభీషణునికే  చెందుతుందని స్పష్టం చేస్తాడు.

మనం ఇప్పుడు అలా ఆలోచించగలుగుతున్నామా? మన దేశం అంటే మనకు అంత గౌరవం ఉందా అసలు? మనవాళ్లెవరైనా అమెరికాలో ఉన్నారంటే మనకెప్పుడు అవకాశం వస్తుందా, మనమెప్పుడు వెళ్దామా అని ఆలోచిస్తాం. ఎంతసేపూ పొరుగుదేశాలను పొగడటం, స్వదేశాన్ని తెగడటం... లక్ష్మణుడి వంటి తమ్ముడో అన్నో మనకూ ఉంటాడు. అలాంటి సలహా ఇచ్చే మేనమామలూ, బాబాయిలూ, బావమరుదులూ ఉండనే ఉంటారు. వాళ్లు సలహా ఇచ్చేవరకూ మనం స్థిమితంగా ఉండగలమా అసలు! అవతలి వాడు వెళ్లి ఎంత సంపాదించాడు, మనం వెళ్లక ఏమి కోల్పోయాం అనేదే అహరహం ఆలోచన. జన్మభూమిలో ఉండటం, కన్నతల్లి వద్ద ఉండటం కన్నా మించిన స్వర్గం మరొకటి ఉండదని అనుకోం. రాముడిని ఆదర్శంగా తీసుకుందాం... ఆయనలా ఆలోచిద్దాం.

Advertisement
Advertisement