లేని ‘మేక’ కోసం వెతకొద్దు | Sakshi
Sakshi News home page

లేని ‘మేక’ కోసం వెతకొద్దు

Published Sun, May 11 2014 11:03 PM

లేని ‘మేక’ కోసం వెతకొద్దు - Sakshi

 ప్రేరణ
 
మనలో లేనిదాని కోసం అర్రులుచాచి విలువైన కాలాన్ని, శక్తిని వృథా చేసుకోవద్దు. కలిగిన దానితోనే అనుకున్నది సాధించి చూపేందుకు కృషి చేయాలి.
 
 రెండు పడవలపై ప్రయాణం
అర్జున్‌వర్మ ఇంజనీరింగ్‌లో టాపర్‌గా నిలిచి, ఓ ప్రముఖ బహుళజాతి సంస్థలో మంచి ఉద్యోగం సాధించాడు. అతడిలోని నైపుణ్యాలను గుర్తించిన సహచరులంతా అర్జున్‌ను అమితంగా గౌరవిస్తుంటారు. అయినా అతడు నిత్యం అసంతృప్తితో రగిలిపోతుంటాడు. ప్రస్తుతం తన స్థితి పట్ల ఏమాత్రం సంతోషంగా లేడు. మంచి ఉద్యోగం ఉన్నవాడికి అసంతృప్తి ఎందుకు? ఇంజనీరింగ్ సరిపోదు, ఎంబీఏ చేయాలనే కోరిక అర్జున్‌లో బలంగా నాటుకుపోయింది. ఎంబీఏతోనే తన భవిష్యత్తు బంగారుమయంగా మారుతుందనే నమ్మకం పెంచుకున్నాడు. ఇంకేముంది.. దండయాత్ర ప్రారంభించాడు. ఉద్యోగం చేస్తూనే రెండేళ్లపాటు కోచింగ్‌లకు హాజరయ్యాడు. ‘క్యాట్’ పరీక్షలు రాస్తూనే ఉన్నాడు.
 
అయినా ఫలితం లేదు. మరోపక్క తన ఉద్యోగానికీ న్యాయం చేయలేకపోయాడు. అర్జున్ పరిస్థితి చూసి యాజమాన్యం, సహచరులు ఆశ్చర్యపోయారు. అతడి పనితీరు రోజురోజుకీ దిగజారిపోయింది. క్లుప్తంగా చెప్పాలంటే.. అర్జున్‌వర్మ ఒకేసారి రెండు పడవలపై కాళ్లు పెట్టి ప్రయాణించాలనుకున్నాడు. అంగుళం కూడా ముందుకెళ్లలేకపోయాడు. మీరు కూడా ఎప్పుడైనా అర్జున్‌లాగే ఆలోచించి దెబ్బతిన్నారా? ఇప్పటిదాకా లేని ఒక డిగ్రీ లేదా స్కిల్ సాధించాలని కోరుకుంటున్నారా? ‘చిన్న కుగ్రామంలో పుట్టి పెరిగాను, ఇంగ్లిష్ మీడియంలో చదువుకోలేదు, నా తల్లిదండ్రులు ధనవంతులు కాదు’.. ఇలాంటి ఆలోచనలతో ఆందోళన చెందుతున్నారా? అయితే.. అర్జున్‌తోపాటు మీరు కూడా తెలుసుకోవాల్సిన కథ ఒకటి ఉంది. అదేంటో చదవండి..
 
 మేకలు 1, 2, 4..
 కెనడాలోని టోరంటో సమీపంలో ఓ చిన్న పట్టణంలో ఇది జరిగింది. ఇద్దరు పాఠశాల విద్యార్థులకు ఒక చిలిపి ఆలోచన వచ్చింది. మూడు మేకలను సంపాదించి, వాటిపై రంగుతో 1, 2, 4 అనే అంకెలు వరుసగా వేశారు. అంటే.. ఒక మేకపై 1, మరోదానిపై 2, ఇంకోదానిపై 4 అని వేశారు. ఒక ఆదివారం రాత్రిపూట వాటిని తమ స్కూల్ భవనంలో వదిలేశారు. మరుసటిరోజు ఉదయం ఉపాధ్యాయులు, సిబ్బంది స్కూల్‌కు చేరుకున్నారు. మేకలు వదిలిన వ్యర్థాలను చూసి బిత్తరపోయారు. వ్యర్థాల వాసనను భరించలేకపోయారు. గదులు, మెట్లు అపరిశుభ్రంగా ఉన్నాయి. పాఠశాలలోకి మేకలు ప్రవేశించాయని అర్థమైంది. వాటి కోసం గాలింపు ప్రారంభించారు. 1, 2, 4 అంకెలున్న మూడు మేకలూ దొరికాయి. మరి 3వ అంకె ఉన్న మేక ఇంకా దొరకకపోవడంతో ఉపాధ్యాయులు ఆందోళనకు గురయ్యారు. ఆ రోజు స్కూల్‌కు సెలవు ప్రకటించారు. రోజంతా ఎంత గాలించినా 3వ నెంబరున్న మేక దొరకలేదు.
 
 అంతర్గత శక్తిసామర్థ్యాలపైనే దృష్టి పెట్టాలి
 మనం కూడా సదరు స్కూల్ ఉపాధ్యాయులలాంటి వాళ్లమే. మన దగ్గర మేకలు ఉన్నప్పటికీ.. వాటిని మరిచిపోయి ఉనికిలో లేని 3వ నెంబర్ మేకను వెతికేందుకు ప్రయత్నిస్తూ ఉంటాం. అదొక అలవాటుగా మారిపోతుంది. తమ రంగాల్లో విజయం సాధించిన వ్యక్తులు తమలోని అంతర్గత శక్తి సామర్థ్యాలపైనే ఎక్కువగా దృష్టి పెడతారు. వాటిని వినియోగించుకొని ఎదుగుతారు. లేనిదాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృథా చేసుకోరు.
 
 భారత జట్టు విజయమిలా
 2011 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత జట్టు ఎలా విజయం సాధించింది? అప్పుడు జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉంది. ఫీల్డింగ్‌లో చాలా బలహీనంగా ఉంది. అప్పటికప్పుడు ఫీల్డింగ్‌ను మెరుగుపర్చుకోలేరు కాబట్టి.. టీమ్ తమ బలాలపైనే దృష్టి పెట్టింది. ఎక్కువ పరుగులు, వికెట్లు సాధించింది. చివరికి చరిత్ర సృష్టించింది.
 
 జీవితాన్ని అశాంతిమయం చేసుకోవద్దు
 కొందరు వ్యక్తులు ఎప్పుడూ విచారంతో కుంగిపోతూ ఉంటారు. నిత్యం ఒత్తిడికి లోనవుతారు. గొప్ప వేతనాలు, పదవులు, కార్లు, భవనాల కోసం తపిస్తూ ఉంటారు. తమకు కలిగిన దానితో ఆనందించే సమయం కూడా వారికి ఉండదు. మీరు కూడా వారిలా మారిపోయి జీవితాన్ని అశాంతిమయంగా మార్చుకోవద్దు. మీకు ఉన్నదానిపట్ల కృతజ్ఞత చూపండి. దానితోనే విజయం, సంతో షం వస్తాయి. లేని 3వ నెంబర్ మేకను పట్టుకోవాలని చూస్తే మిగిలేది నిరాశే!!
-‘కెరీర్స్ 360’ సౌజన్యంతో

Advertisement

తప్పక చదవండి

Advertisement