అభివృద్ధే ఈ అతివల మంత్రదండం! | Sakshi
Sakshi News home page

అభివృద్ధే ఈ అతివల మంత్రదండం!

Published Tue, Oct 14 2014 11:16 PM

అభివృద్ధే ఈ అతివల మంత్రదండం!

స్ఫూర్తి

ఒకప్పుడు వారు మహిళల కోసమే కేటాయించిన స్థానానికే పోటీ చేసి గెలిచి ఉండవచ్చు. కానీ, ఇప్పుడు వారు జనరల్ కోటాలో పోటీ చేసి కూడా గెలిచారు. ఎందుకంటే కాలిబాట కూడా కరువైన తమ గ్రామాలకు అద్దంలాంటి రోడ్డు వేయించటం, ఏళ్లతరబడి విద్యుత్ ముఖమే చూడని వీధులను విద్యుద్దీపాలతో వెలిగిపోయేలా చేయటం, దాహంతో ఎండిపోతున్న తమ గొంతులను మైళ్లకొద్దీ దూరం నడిచి వెళ్లి, కావిళ్లతో తెచ్చుకున్న కలుషిత నీటితో తడుపుకునేవారు గ్రామస్థులు.

ఇప్పుడు వారు చేతిపంపులు, గొట్టపు బావులతో సమృద్ధిగా లభించే మంచినీటితో శుభ్రంగా స్నానాలు చేస్తున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని ఎందరో పండుటాకులకు వృద్ధాప్య పింఛన్ల రూపంలో ఊరటనిచ్చారు వారు. వీటిని ఆ గ్రామస్థులెవరూ ఆనాడు ఊహించి ఉండరు. అయితేనేం, అవన్నీ  మహిళా సర్పంచుల కృషితో సాకారమయ్యాయి.
 
అభివృద్ధికి ఎంతో దూరంలో ఉండే రాజస్థాన్ రాష్ట్రంలో 2000వ సంవత్సరంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నిలబడిన మహిళా అభ్యర్థులందరూ గెలిచారు. వీరిని చూసి పెదవి విరిచిన వారందరినీ ఆ తర్వాత ఆశ్చర్యంతో నోరువెళ్లబెట్టేలా చేశారు. తర్వాత రెండు దఫాలూ వారు తమ స్థానాలను ఎలా నిలబెట్టుకున్నారో చూద్దాం..  
 
జైపూర్‌కి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న సోడా గ్రామంలో 1980లో పుట్టిన చావీ రాజావత్ ఆ గ్రామానికి మహిళా సర్పంచ్‌గా ఎన్నికైం ది. ఆంధ్రప్రదేశ్‌లోని రిషీ వ్యాలీలోని మాయో కాలేజీ గరల్స్ పాఠశాలలో చదివిన చావీ రావత్  పూనేలో ఎంబిఏ పూర్తి చేసి, తమ గ్రామంలో ఎంబిఏ చదివిన మొట్టమొదటి మహిళగా రికార్డు సృష్టించింది. ఉన్నతోద్యోగం చేస్తున్న రాజావత్ సర్పంచ్ అయ్యాక, తన ఉద్యోగానికి రాజీనామా చేసి, ప్రజలలోకి వెళ్లి వారి కష్టసుఖాలు తెలుసుకుని, సమస్యలకు పరిష్కారం చూపింది.

ఎన్నో ప్రాజెక్టులు చేపట్టి, పంటలకు సాగునీరు అందేలా చేసింది. ఆ గ్రామంలోని ప్రతి ఇంటిలోనూ మరుగుదొడ్లు ఉండేలా చర్యలు చేపట్టమే కాదు... రాజస్థాన్ గ్రామాల రూపురేఖలు మారేలా పదిమందికీ స్ఫూర్తిగా నిలిచి, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదగా న్యూఢిల్లీలో జరిగిన ‘టెక్నాలజీ డే ఫంక్షన్’లో యంగ్ ఇండియన్ లీడర్ అవార్డు అందుకుంది. మురళీ మీనాది మరో కథ.

దినసరి కూలీల కుటుంబంలో పుట్టిన మురళీ మీనాలో మొదటినుంచి నాయకత్వ లక్షణాలున్నాయి. పెళ్లయిన తర్వాత  అనుకోకుండా కలసి వచ్చిన అవకాశం ఆమెను గ్రామసర్పంచ్‌గా నిలబెట్టింది. తనను తాను నిరూపించుకునేందుకు అవకాశం ఇచ్చింది. కేవలం ఎనిమిదో తరగతితో చదువు ఆపేసిన మురళీ మహిళలందరినీ సంఘటిత పరచి, స్వయం సహాయక బృందాలుగా తమ కాళ్లమీద తాము నిలదొక్కుకునేలా చేసింది. ఆమె చేసిన మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరో రెండు పర్యాయాలు మురళీనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చేశాయి.

అదే బాటన నడిచారు మరో ముగ్గురు సర్పంచ్‌లు సునీతా రాజావత్, శ్రీమాలి, బాదం బైర్వా. ఒకప్పుడు మహిళలకోసం కేటాయించిన స్థానాల నుంచి గెలుపొందిన వీరంతా ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనరల్‌గా మారిన ఆ స్థానాల్లో పోటీ చేసి, పురుష ప్రత్యర్థులపై ఘన విజయం సాధించటం వారి సుపరిపాలనకు నిలువెత్తు నిదర్శనం. వ్యవస్థలో ఉండి వ్యవస్థను బాగుచేస్తూ, గ్రామంలోని మహిళలనందరినీ ఒక్క తాటి మీదకు తీసుకువచ్చిన ఈ మహిళలు మరెందరికో స్ఫూరిదాయకం.
 

Advertisement
Advertisement