చిమ్మ చీకట్లో కాంతి కిరణం! | Sakshi
Sakshi News home page

చిమ్మ చీకట్లో కాంతి కిరణం!

Published Thu, Jun 18 2015 11:01 PM

చిమ్మ చీకట్లో కాంతి కిరణం!

స్పృహ
పెళ్లిళ్లు స్వర్గంలో జరుగుతాయంటారు. అయితే అక్కడి ఆడపిల్లలు మాత్రం ‘స్వర్గం’లో కాదు ‘నరకం’లో జరిగినట్లే వణికిపోతారు. పెళ్లి అనేది ఒక అందమైన కల. అయితే వారికి మాత్రం కలల విధ్వంసం. ఒక అమ్మాయి డాక్టర్ కావాలనుకుంటుంది. చదువుకునే ప్రతిభ ఉంటుంది. సౌకర్యాలు ఉంటాయి. అయినా కాలేకపోతుంది. మరో అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనుకుంటుంది. ఆ కల తన కళ్ల ముందే నిలువెల్లా చెదిరిపోతుంది. ‘కల కనండి... ఆ కలను నిజం చేసుకోండి’ అనే మాట ఒడిషాలోని చాలా గ్రామాల్లో అపహాస్యం పాలవుతుంటుంది.

దీనికి కారణం బాల్య వివాహం. బాల్యవివాహాలు ముక్కుపచ్చలారని ఎందరో ఆడపిల్లల కాళ్లకు బంధనాలు వేస్తుంటాయి. ఈ నేపథ్యంలో నుంచి పుట్టుకొచ్చిందే ‘కిషోరి కళ్యాణ సమితి’
   
సుజాతకు నిండా పదహారు సంవత్సరాలు కూడా లేవు. కందమాల్ జిల్లా డంకెనీ అనే మారుమూల కుగ్రామానికి చెందిన ఈ అమ్మాయికి పెళ్లి చేయడానికి తల్లిదండ్రులు సిద్దపడ్డారు. తొందర పెట్టారు.
‘‘నాకు చదువుకోవాలని ఉంది’’ అనే సుజాత ఆవేదనను వాళ్లు పెద్దగా ఖాతరు చేయలేదు. తమ చుట్టాలు, పక్కాలలో ఎవరెవరికి ఏ వయసులో పెళ్లి అయిందో లిస్ట్ చదువుకుంటూ పోయారు వాళ్లు. బాగా చదువుకొని, పెద్ద ఉద్యోగమేదో చేయాలనే సుజాత కల మసకబారడం మొదలుపెట్టింది. ఎటు చూసినా చీకటి. చనిపోదామనే ఆలోచన ఆమెకు ఎప్పుడూ రాలేదు...తొలిసారిగా మృత్యుప్రేమ! కలను నిజం చేసుకోలేని బతుకెందుకు అనే వైరాగ్యం!!
 
ఒక వైపు పెళ్లి కార్డులు ప్రింటవుతున్నాయి. మరోవైపు కన్నీటి ప్రవాహాలు ఉరకలెత్తుతున్నాయి. పెళ్లికి ఒక వారం మాత్రమే టైమ్ ఉంది. తన చావుకు ఇంకొక రోజు మాత్రమే బాకీ ఉంది అనుకుంది ఆ అమ్మాయి. ఈలోపే ఎవరో ‘కిశోరి కళ్యాణ్ సమితి’ గురించి చెప్పారు. చిమ్మచీకటిలో కాంతికిరణం జాడ దొరికినట్లయింది సుజాతకు. ఆలస్యం చేయకుండా స్నేహితుల సహాయంతో రహస్యంగా వెళ్లి సంస్థ ప్రతినిధులను కలిసి తన బాధ చెప్పింది. సుజాత ఇలాంటి సంస్థ దగ్గరకి వెళ్లడం కొత్త కావచ్చు. కానీ సంస్థకు మాత్రం సుజాతలాంటి అమ్మాయిల కన్నీటి గాథను వినడం కొత్తేమీ కాదు!
 
‘పెళ్లి అడ్డుకోవడానికి మీరెవర్రా’ అని ‘కెకెయస్’పై కన్నెర్ర చేసి కత్తులు దూశారు సుజాత చుట్టాలు పక్కాలు.
 ఆవేశం సమయం... నిమిషం.
 ఆలోచన సమయం... అనంతం.
 ‘అయ్యా... బాల్య వివాహం చేయడం ఎందుకు తప్పంటే...’ అని సంస్థ ప్రతినిధులు ఒకరి తరువాత ఒకరు చెప్పడం ప్రారంభించారు. అంతెత్తుకు ఎగిరిన వాళ్ల ఆవేశం నిమిషాల వ్యవధిలో ముగిసిపోయింది. ఆలోచన మాత్రం వాళ్లకు కొత్తదారి చూపింది. ‘‘అవును... మా అమ్మాయికి చిన్న వయసులోనే పెళ్లి చేయాలనుకోవడం తప్పు’’ అనే స్పృహ వారిలో వచ్చేలా చేసింది.

ఆమె పేరు సుజాత కావచ్చు.
కవిత కావచ్చు... కల్పన కావచ్చు... ఇలా ఎందరో ఆడపిల్లల కళ్లలో వెలుగు నింపింది కిశోరి కళ్యాణ్. ఈ సంస్థలోని సభ్యులు ఏ ఆకాశం నుంచో దిగి రాలేదు. భూమి మీద సుజాతలా ఇబ్బందులు ఎదుర్కొన్నవాళ్లు కావచ్చు. సుజాతలాంటి అమ్మాయిల సమస్యను చూసి చలించిన వాళ్లు కావచ్చు. వాళ్లు కిశోరి కళ్యాణ్‌లో క్రియాశీల సభ్యులు.
 ‘పెళ్లి చేసి చూడు... ఇల్లు కట్టి చూడు’ అనేది సామెత.
 పెళ్లి ఆపడం అనేది కూడా ఎంత కష్టమో కిశోరి కళ్యాణ్ సామాజిక సంస్థను చూస్తే అర్థమవుతుంది. కొన్ని పెళ్ళిళ్లు జరగడం లోకకళ్యాణం కోసం... కొన్ని పెళ్లిళ్లు ఆగడం కూడా లోక కళ్యాణం కోసమే కావచ్చు!

Advertisement
Advertisement