మానవతా విలువలను మేలుకొలిపే రమజాన్ | Sakshi
Sakshi News home page

మానవతా విలువలను మేలుకొలిపే రమజాన్

Published Thu, Jun 26 2014 11:16 PM

మానవతా విలువలను మేలుకొలిపే రమజాన్

దైవ ప్రసాదితమైన దివ్య ఖుర్‌ఆన్ గ్రంథం అవతరించిన పవిత్ర మాసం రమజాన్. మానవుడు పరిపూర్ణ ప్రేమమూర్తిగా మారేందుకు అవకాశం కల్పించే రమజాన్ ఎంతో శుభప్రదమైనది. మనిషిలో క్రమశిక్షణ, ఐక్యత, సర్వమానవ సౌభ్రాతృత్వం, సహనశీలం, భక్తిపరాయణత్వం, కోర్కెలను అదుపులో పెట్టుకునే మనోనిశ్చలతను, దానగుణాన్ని పెంపొందించే మహత్తరమైన నెల రమజాన్.
 
‘‘నీ సంపాదన నీ సుఖసంతోషాలకే, నీ భోగలాలసతకే వినియోగించడం మానవత్వం కాదు. కష్టాల్లో ఉన్నవారి కన్నీటిని తుడవాలి. నీ సంపాదనలో కొంత భాగం వారికిచ్చి వారి జీవితాలలో వెలుగులు నింపాలి. అపుడే నీ జీవితానికి అర్థం, పరమార్థం’’ అని ప్రబోధించారు ప్రవక్త  హజ్రత్ ముహమ్మద్ రసూలుల్లాహ్(స.అ.స). మనిషి మానవతామూర్తిగా మారడానికి రమజాన్ అవకాశం కల్పిస్తుంది.
 
ఇస్లాం మతానికి మూలం...

 ఇస్లాం ధర్మం ఐదు పునాదులపై ఉందని ప్రవక్త ముహమ్మద్ ప్రవచించారు. అవి 1. కలిమా(అల్లాహ్ ఒక్కడే. ఆయన సర్వశక్తిమంతుడు. ఆరాధనలకు ఆయనే అర్హుడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ముహమ్మద్ ఆయన ప్రవక్త అని విశ్వసించాలి). 2. నమాజ్ (ప్రతి రోజూ ఐదు పూటలా దైవధ్యానం చేయాలి). 3. రోజా (రమజాన్ మాసంలో విధిగా ఉపవాసం ఉండాలి). 4. జకాత్ (తన సంపాదనలో కొంత బాగాన్ని సంవత్సరానికి ఒకసారి పేదలకు దానం చేయాలి). 5. హజ్  (స్తోమతగలవారు జీవితంలో ఒకసారైనా మక్కా, మదీనా యాత్ర చేయాలి) ప్రతి ముస్లిం ఈ ఐదు సూత్రాలను కచ్చితంగా పాటించాలని ప్రవక్త నిర్దేశించారు.
 
 ఉపవాసంతో పరివర్తన

 రమజాన్ నెలలో చంద్రుడు కనిపించిన రోజు నుంచి 30 రోజులపాటు ఉపవాసం (రోజా) ఉంటారు. రమజాన్ శబ్దవ్యూత్పత్తిలోనే ఉపవాసం సూచన ఉంది. ‘రమ్జ్’ అంటే కాలుట. దహించుట అని అర్థం. ఉపవాసం వల్ల ఆకలి బాధ తెలుస్తుంది. ఆకలిగొన్నవారి పట్ల సానుభూతి పెరుగుతుంది. ప్రాతఃకాలం నుంచి సూర్యాస్తమయం వరకూ ఉపవాస దీక్షను నియమ నిష్టలతో పాటించాలి. ఐదు పూటలా ప్రార్థనతో పాటు పవిత్ర ఖుర్‌ఆన్ పారాయణం చేయాలి. ఓరిమితో, సహనంతో ప్రేమమూర్తిగా, మానవతావాదిగా మెలగాలి.  ప్రాతఃకాలంలో భోజనంచేయడాన్ని ‘సహరి’ అంటారు. సాయంత్రం ఉపవాసదీక్ష విరమించడాన్ని ‘ఇఫ్తార్’ అంటారు. ఇఫ్తార్ సమయంలో ముస్లింలందరూ మస్జీద్‌లో చేరి దీక్ష విరమిస్తారు. గోధుమ గంజితో పాటు ఖర్జూరం, వివిధ రకాల పండ్లు తీసుకోవచ్చు. హైదరాబాద్‌లాంటి నగరాల్లో హలీమ్, హరీస్ అనే పేరుతో మాంసాహార వంటకాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లోని ఆహార అలవాట్లకు అనుగుణంగా  తమకు అందుబాటులో ఉన్న ఏ ఆహారపదార్థాలైనా భుజించవచ్చు.
 
 ఉపవాసం ఉండలేకపోతే...

 రమజాన్ నెలలో ఏ కారణం చేతనైనా ఉపవాసానికి భంగం కలిగి పూర్తిచేయలేకపోతే ‘కఫ్పారా’(మూల్యం) చెల్లించాలి. పరిహారంగా రమజాన్ తర్వాత అరవై రోజులు ఉపవాసముండాలి. అదీ వీలుకాకపోతే ఒక పేదవ్యక్తికి 60 రోజులకు సరిపడా ఆహారం ఇవ్వాలి. ప్రతి ముస్లిం తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అయితే అందులో కొన్ని సడలింపులు ఉన్నాయి. దూరప్రయాణాలు చేసేవారు, దీర్ఘ రోగాలతో బాధపడేవారు, వయసుమీరిన వారు, గర్భవతులు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలు, ఋతుస్రావం అవుతున్న మహిళలు ఉపవాసం ఉండకపోవచ్చు. అయితే, వారు రమజాన్ మాసంలో ఎన్నిరోజులు ఉపవాసదీక్ష పాటించలేకపోయారో అనంతరం అన్ని రోజులు ఉపవాసం ఉండాలి. కడుపులోని బిడ్డ భయంతో ఉపవాసం ఉండకపోతే ‘ఫిదియా’ చెల్లించాలి. అంటే రెండు పూటలా ఒక పేదవానికి కడుపునిండా అన్నం పెట్టాలి.
 
 సామూహిక ప్రార్థనామహిమ

 ఉపవాసం వల్ల కర్తవ్యపరాయణత్వం, కష్టాలను సహనంతో ఎదుర్కొనే శక్తి కలుగుతాయి..  కామక్రోధ మద మాత్సర్యాది అరిషడ్వర్గాలకు కళ్లెం వేయడంవల్ల మనో నిశ్చలత ఏర్పడుతుంది. దైవం పట్ల విశ్వాసం, పాపభీతి పెరిగి దుష్కృత్యాలు తగ్గుతాయి. రోజూ ఐదుసార్లు దైవప్రార్థన(నమాజ్)తో పాటు రమజాన్ మాసంలో ప్రతిరాత్రి ‘తరావీహ్’ నమాజ్ ప్రత్యేకంగా చేస్తారు. రోజుకు 20 రకాతుల చొప్పున నమాజ్ చేస్తూ 30 రోజులలో ఖుర్‌ఆన్‌లోని 30 భాగాలను పఠించడం పూర్తిచేస్తారు. మహిళలు ఇళ్లలోనే ప్రార్థన చేసుకోవచ్చు. అన్ని విధాలా ఆరోగ్యంగా ఉన్న వారు రమజాన్ మాసంలో ఉపవాసదీక్షతో పాటు ఎతెకాఫ్(ప్రాథమిక అవసరాల కోసం తప్ప మిగిలిన సమయమంతా దైవధ్యానంలోనే గడపడం) పాటించాలి. సాధారణంగా మగవాళ్లు మస్జీద్‌లో, ఆడవాళ్లు ఇంటిలోని ఒక గదిలో ఉండి నిరంతరం దైవధ్యానంలో, ప్రార్థనలో నిమగ్నమవుతారు. వీటితో పాటు తహజ్జూద్ నమాజ్ (అర్థరాత్రి తర్వాత తొలివేకువలో చేసే ప్రార్థన) చేయాలి.
 
దైవాదేశం వెలువడిన రాత్రి

 రమజాన్ నెలలో 27వ దినంనాటి రాత్రిని ‘మహిమగల రాత్రి’ (లైలతుల్ ఖద్)్రగా భావిస్తారు. దీనినే ‘షబే ఖద్’్ర అని కూడా అంటారు. ఆ రాత్రి జాగరణ చేసి అత్యంత విశ్వాసంతో, నిష్ఠతో, పుణ్యఫలాపేక్షతో ప్రార్థన చేస్తే కృతాపరాధాలను అల్లాహ్ క్షమిస్తాడని, ఇహపరసుఖాలు ప్రసాదిస్తాడని ముస్లింల విశ్వాసం. మనిషికి మార్గదర్శనం చేయడంకోసం, మానవతా విలువలు పాటించి సన్మార్గంలో నిడిచేవిధంగా, ఉత్తమ పౌరునిగా తీర్చిదిద్దేందుకు విశ్వప్రభువు ఖుర్‌ఆన్ పవిత్ర గ్రంథ సూక్తులను ప్రవక్త ద్వారా షబేఖద్ ్రరాత్రి నుంచే మానవాళికి అందించడం ప్రారంభించారు.
 
ఈ రాత్రి మహత్మ్యం గురించి అల్ ఖద్ ్రసూరాలో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు...‘‘మేము ఖుర్‌ఆన్‌ను ఈ షబేఖదర్‌లోనే అవతరింపజేశాము. షబేఖదర్ అంటే మీకు ఏమి తెలుసు. షబేఖదర్ వేయి మాసాల కంటే ఉత్తమమైనది. ఈ రాత్రి దూతలు, హజ్రత్ జిబ్రయీల్ విశ్వప్రభువు ఆజ్ఞ మేరకు ప్రతి పనినీ నిర్వహించేందుకు భువికి దిగివస్తారు. ఉదయం అయ్యేవరకూ శుభాశీస్సులు ప్రాప్తిస్తాయి.’’
 
మక్కాలో నివసించే ముహమ్మద్ రసూలువారికి చిన్నప్పటి నుంచి దైవచింతన ఎక్కువ. వీలు చిక్కినప్పుడల్లా సమీపంలోని హిరా అనే పేరుగల కొండ గుహకు వెళ్లి ధ్యానం(తపస్సు) చేసేవారు. క్రీ.శ.610 సంవత్సరం రమజాన్ నెలలో మూడు రోజులపాటు హిరా గుహలోనే దైవ ధ్యానంలో గడిపారు. అప్పుడు ఒక రోజు రాత్రి జిబ్రయీల్ ప్రత్యక్షమై దైవవాణి (ఖుర్‌ఆన్) వినిపించారు. అప్పటి నుంచి 22 సంవత్సరాలపాటు ఇహపరలోకాల్లో సాఫల్యం కోసం మానవునికి మార్గనిర్దేశనం చేయడానికి  ముహమ్మద్ ప్రవక్తకు దైవాదేశం వెలువడింది. సర్వేశ్వరుని సూక్తుల సమాహారమే ఖుర్‌ఆన్ పవిత్ర గ్రంథం.
 
వెల్లివిరిసే ఐక్యత

ముస్లింలందరూ ఒకే నెలలో ఒకే కాలంలో ఉపవాసవ్రతాన్ని పాటిస్తారు కాబట్టి పరస్పర సహకారం, సోదరభావం కలిగి ఐక్యత పరిఢవిల్లుతుంది. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో, ఆత్మవిమర్శతో ఉపవాసాలు పాటిస్తారో పూర్వం వారు చేసిన పాపాలను దేవుడు క్షమిస్తాడని ముహమ్మద్ ప్రవక్త సెలవిచ్చారు. రమజాన్ విశిష్టమైనది కాబట్టి ఈ నెలలోనే జకాత్ ఇస్తారు. తమ వార్షిక ఆదాయంలో కొంత భాగాన్ని పేదలకు ఇవ్వడమే జకాత్. 7.5 తులాల బంగారం, లేక 52.5 తులాల వెండి, లేదా దాని విలువ గల డబ్బు ఏడాదిపాటు మన వద్ద ఉంటే వాటి విలువలో నూటికి 2.50 రూపాయల ప్రకారం జకాత్‌గా తీసి ఆ మొత్తాన్ని పేదలకు దానధర్మాలు చేయాలి.
 
ముప్పై రోజుల కఠిన ఉపవాసదీక్షానంతరం రమజాన్ ‘ఖుద్బా’ (పండుగ) చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి ‘ఈద్గాహ్’లో సామూహికంగా ప్రార్థన చేస్తారు. ఆరోజు సేమ్యా పాయసం తింటారు. ప్రార్థనకు వెళ్లేముందే ‘ఫిత్రా’ (దానం) ఇస్తారు. డబ్బు రూపంలో కానీ, ధాన్యం రూపంలో గానీ పేదలకు ఫిత్రా ఇస్తారు. ఇంట్లో ఎంతమంది సభ్యులుంటే అంతమంది పేర ఫిత్రా ఇవ్వాలి. 1.75 కిలోల గోధుమలు లేదా దాని విలువ గల డబ్బు ఈద్ నమాజ్‌కు ముందే పేదలకు ఇవ్వాలి. ముస్లింలందరూ కొత్తదుస్తులు ధరించి ఆనందోత్సాహాలతో, భక్తిప్రపత్తులతో పండుగ చేసుకుంటారు. ఖుద్బా అనంతరం పరస్పరం ఈద్ ముబారక్(పండుగ శుభాకాంక్షలు) చెప్పుకుని ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటారు.  
 
 - సద్దపల్లి ఖుదాబక్ష్
 
 ‘ఇస్లాం’ అనే అరబ్బీ పదానికిస్వయంసమర్పణ, విధేయత, ఆజ్ఞాపాలన, శాంతి అనే అర్థాలు ఉన్నాయి.   సర్వాంతర్యామికి, విశ్వప్రభువుకు,జీవనదాతకు మానవుడు స్వయంసమర్పణ చేసుకోవడమే ఇస్లాం.
 
 ఇస్లాం క్యాలెండర్ (హిజ్రీ శకం) ప్రకారం
 ఈనెల 29వతేదీ నుంచి రమజాన్ నెల ప్రారంభం అవుతుంది.
 జూలై 29వ తేదీ (నెలవంక కనిపిస్తే...)
 ఈదుల్ ఫితర్ జరుపుకుంటారు. రమజాన్ నెలలో
 నిష్కల్మష హృదయంతో, చిత్తశుద్ధితో, సంపూర్ణ
 విశ్వాసంతో, భక్తిప్రపత్తులతో ప్రార్థిస్తే సర్వేశ్వరుని
 కృపకు పాత్రులవుతారని, ఇహపర సుఖాలు లభిస్తాయని
 ముస్లింల విశ్వాసం.
 
 ఉపవాస దీక్ష ప్రారంభించే ముందు చేసే నియ్యత్...
 ‘అల్లాహుమ్మ అసూము గదల్ల్లక ఫగ్‌ఫిర్లి మా ఖద్దమ్‌తు వమా అఖ్ఖర్‌తు’ (అర్థంః  దేవా... నా ఉపవాసాన్ని స్వీకరించు. నీవు ఏ పుణ్య ఫలాన్ని  ప్రసాదిస్తానని సెలవిచ్చావో దాన్ని నాకు ప్రసాదించు.)
 
 
 ‘ఇఫ్తార్’ (ఉపవాస దీక్ష విరమణ) సమయంలో చేసే ప్రార్థన (దువా)... ‘అల్లాహుమ్మ లకాసుమ్తు వ బికా ఆమంతు వ అలైక తవక్కల్‌తు వ అలా రిజ్జఖ అఫ్తర్ తు వతఖబ్బల్ మిన్ని’(అర్థంః   దేవా. నేను నీ కోసమే ఉపవాసం పాటించాను.  నీవు ప్రసాదించిన దానిద్వారానే ఉపవాస దీక్ష విరమిస్తున్నాను).
 
 ‘అల్లాహ్’ అనే పదానికి ముహజ్జబుల్ లుగాత్ గ్రంథంలో అర్థం ఇలా ఉంది.
 1.     ఖాలిఖ్ (సృష్టికర్త).
 
 2. పర్‌వర్‌దిగార్ (సృష్టిస్థితిలయకారుడు, పోషించువాడు).
     
 ఈ పదం ఇలాహ్ అనే అరబ్బీ పదం నుంచి రూపొందింది.
     
 అల్లా- దేవుడు, ప్రభువు, సర్వశక్తిమంతుడు (ఎన్‌సైక్లోపిడియా ఏషియాటికా).
     
 లాహ్- అరబ్బీ క్రియ నుంచి రూపొందింది.
     
 కంపించుట, ప్రకాశించుట అని అర్థం.
     
 ఇలాహ్- దేవత...దానికి అల్ ప్రత్యయం చేర్చి దేవుడు అనే అర్థంలో అల్లాహ్ అని వాడుకలోకి వచ్చింది.

Advertisement
Advertisement