దూరంగా ఉన్నా... దగ్గర కావచ్చు! | Sakshi
Sakshi News home page

దూరంగా ఉన్నా... దగ్గర కావచ్చు!

Published Sun, Nov 3 2013 11:32 PM

Away, but ... May be near!

పెళ్లి అనేది ఆడపిల్ల జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం. అది ఆనందంతో పాటు ఎన్నో సందేహాలను, భయాలను, కన్ఫ్యూజన్లను తీసుకొస్తుంది. నాపెళ్ళి సమయంలో నేను కూడా వీటన్నిటితో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. పెళ్ళి తర్వాత నాజీవితం ఎలా ఉంటుందో... నాభర్త నన్ను అర్థం చేసుకుంటారో లేదోనన్న భయం... అక్కడ అడ్జస్ట్ అవగలనో లేదోనన్న సందేహం, అక్కడి వాళ్ళ మసస్తత్వాలు ఎలా ఉంటాయో తెలియక కన్ఫ్యూజన్ కలిసి నన్ను కుదరుగా ఉండనివ్వలేదు.
 
ఏదైతేనేం... వెంకట్ గారితో నా పెళ్ళి జరిగిపోయింది. నేను చిన్న కోడలిగా ఆ ఇంట్లో అడుగు పెట్టడం కూడా అంతే వేగంగా అయిపోయింది. వెంటనే హనీమూన్, చుట్టాలింటికి భోజనాలకు వెళ్ళడాలు వంటి వాటితో ఓ నెల రోజులు ఊపిరాడలేదు. ఆ తర్వాత మొదలైంది అత్తారింటిలో అసలైన జీవితం.
 
మా అత్తగారు మంచిదే. కానీ ఆవిడ చెప్పింది  చెప్పినట్టు పాటించాల్సిందే! లేదంటే చాలా ఫీలైపోయి ముఖం మాడ్చుకుని కూర్చునేది. ఏంటలా ఉన్నావని పొరపాటున ఏ కొడుకో అడిగాడా... ‘మీ నాన్న పోవడంతోనే నా విలువ పోయింది’ అంటూ ముక్కు చీదేది. దాంతో కొడుకులు కరిగిపోయేవారు. కట్ చేస్తే ఏముంది... ‘అమ్మను అర్థం చేసుకోండి, ఆమెను బాధపెట్టకండి’ అంటూ మాకు క్లాసులు.
 
వంటదగ్గర్నుంచి ప్రతి విషయం గురించీ ముందే ఆజ్ఞలు జారీ చేసేసేది. ఆమె ఏది వండమంటే  అదే వండాలి. ఇంట్లో లేదు కదా అని మరొటి వండితే ఇక అంతే సంగతులు. ఏదో పెద్దావిడలే అని సరిపెట్టేసుకునేదాన్ని. కానీ నా భర్తకు, నాకు ప్రైవసీ లేకపోతే మాత్ర చాలా బాధ కలిగేది. ఆయన నాకు చీర కొనుక్కొచ్చినా మొదట ఆవిడే చూడాలి. ఓసారి ఆయన అలా చూపించకుండా ఇచ్చారని నానా యాగీ చేసింది. పోనీ చూపిస్తే ఆనందపడేదా అంటే అదీ లేదు. దాంతో మా వారు పూలు తేవడానికి కూడా ధైర్యం చేసేవారు కాదు. నా మనసు చివుక్కుమనేది.
 
మా తోడికోడళ్ళు కూడా అదోలా ప్రవర్తించేవారు. వాళ్ళకూ నా మీద కోపమేమీ లేదు. కానీ అత్తగారిని ఏమీ అనలేక నా మీద ప్రతాపం చూపించేవారు. వాళ్ళ పనులు నా మీద రుద్దడం, ఏదైనా తేడా జరిగి అత్తగారు కోప్పడితే నా మీద తోసెయ్యడం, మావారు నేనూ సన్నిహితంగా ఉంటే సెటైర్లు వేయడం చేసేవారు. ఓ ఆరునెలలు ఇవన్నీ భరించానుకానీ ఓరోజు నా ఓపిక నశించిపోయింది.
 
ఆరోజు నా అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ని మా ఇంట్లో చూపించాను. దాంతో చిన్నపాటి యుద్ధమే చెలరేగింది. తమకు మాట మాత్రమైనా చెప్పలేదని తోడికోడళ్ళు, అసలు ఉద్యోగం చేయడానికి వీల్లేదని అత్తగారు అనేసరికి నాకు తిక్కరేగినట్టైంది...‘‘నేను ఎంబీయే చేశాను, నాతెలివితేటల్ని, చదువుని వృథా చేసుకోలేను, అయినా నాభర్త ఒప్పుకున్నారు’’ అని అనేసరికి అత్తగారు భద్రకాళి అయ్యారు. ‘అంతా నీ ఇష్టమేనా, అంత పెద్దవాడివైపోయావా!’ అంటూ మావారి మీద కేకలేశారు. నన్ను అమితంగా ఆశ్చర్యపర్చిన విషయం... మావారు నన్ను సపోర్ట్ చేస్తూ ఒక్కమాట కూడా మాట్టాడకపోవడం. తర్వాత నా దగ్గరకు వచ్చి, అమ్మకిష్టం లేదు కదా, ఉద్యోగం సంగతి మరోసారి ఆలోచించు అనడం.ఇక నేను ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన టైమ్ వచ్చిందని నాకు అర్థమైంది.
 
మావారికి ఒకటే చెప్పాను. ‘నాకు మీ అమ్మగారు. అన్నా వదినలు ముఖ్యమే... కానీ అంతకంటే ముందు మీరు, నాభవిష్యత్తు ముఖ్యం, మీరు నాభవిష్యత్తుగా తోడుగా ఉంటారా లేదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి’ అన్నాను. ఆయన కాస్త ఆలోచించే మనిషే. అందుకే నన్నేమీ అనలేదు. అలాగని ఎస్ కూడా చెప్పలేదు. మౌనంగా ఉండిపోయారు. నేను తనతో చెప్పాను...‘‘దగ్గరగా ఉండి స్ఫర్థలు పెంచుకుంటున్నాం. దూరంగా ఉండే ప్రేమలు పెంచుకుందాం, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఏమన్నా నేను సహించాను, కానీ నాకంటూ కొన్ని ఆశలు, కోరికలు ఉంటాయి. వాటి గురించి ఎవరూ ఆలోచించడం లేదు. అందుకే దూరంగా ఉండి మన బతుకు మనం బతుకుదాం, కానీ మీ వాళ్లకు మాత్రం దూరం కావద్దు, వాళ్ళ పట్ల అన్ని బాధ్యతలూ నెరవేరుద్దాం’’ అన్నాను.
 
మావారు మొత్తానికి కన్విన్స్ అయ్యారు. అత్తగారు మా నిర్ణయాన్ని అంగీకరించలేదు. ఆయన అన్నలు, వదినలు మమ్మల్ని సపోర్ట్ చెయ్యలేదు. కానీ మేం అనుకున్న అడుగు వేశాం. అక్కడికి దగ్గర్లోనే ఇల్లు తీసుకుని వేరు కాపురం పెట్టాం. వారు న్ను ప్రోత్సహించి నాక్చిన మాట నిలబెట్టుకున్నారు. నేను కూడా ఆయనకిచ్చిన మాట నిలబెట్టుకున్నాను. నా జీతంలో సగభాగం ప్రతినెలా తీసుకెళ్ళి అత్తగారికిచ్చాను. పండుగలకి, పబ్బాలకి అందరికీ బట్టలు కొన్నాను. ఇంట్లో ఏ పూజనీ, శుభకార్యాన్నీ మిస్ కాలేదు. అత్తమ్మ మందుల దగ్గర్నుంచి తోడికోడళ్ళ పిల్లల పుట్టినరోజుల వరకూ దేన్నీ మర్చిపోలేదు. దాంతో మొదట కోపంగా ఉన్నవారు మెల్లగా నాకు చేరువయ్యారు. నామనసులో ఏ దురద్దేశం లేదని అర్థం చేసుకున్నారు. చనిపోయేవరకూ మా అత్తగారు అందరికీ చెప్పేవారు...‘మా చిన్నకోడలు భలే పిల్లండీ, నేనెంత అదృష్టవంతురాలినో’ అని.
 
నేనారోజు ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే మనస్ఫర్థలతో మా మధ్య దూరాలు పెరిగిపోయి ఉండేది. మా వాళ్ళకూ నాకూ మధ్య పెద్ద ఆగాథం ఏర్పడి ఉండేది. నా మీద కోపంతో వాళ్ళు ... నా ఆశలు తీరలేదన్న అసంతృప్తితో నేనూ బతకాల్సి వచ్చేది. అలాగని అందరూ వేరు కాపురాలు పెట్టాలని అనడం లేదు. కానీ మీ స్పేస్ మీకు అవసరం అనిపించినప్పుడు ఓ నిర్ణయం తీసుకోవడానికి వెనుకాడవద్దని మాత్రం చెబుతాను. అది తప్పు కాదు. ఒక్కోసారి దూరం ప్రేమల్ని, బంధాల్ని బలపరుస్తుందే తప్ప తగ్గించదు. దానికి నా జీవితమే ఓ ఉదాహరణ.
 - విమల, ముమ్మిడివరం, తూ.గో.జిల్లా
 
 మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉంటే మాకు రాసి పంపించండి. బంధాలను బలపరచుకోవడానికి, అనుబంధాలను పదిలపరచుకోవడానికి మీ అనుభవాలు మరికొందరికి దారి చూపవచ్చు.
 
 మా చిరునామా: అస్త్ర, సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్,హైదరాబాద్ - 500034, మెయిల్: sakshi.asthra@gmail.com
 

Advertisement
Advertisement